Bigg boss Telugu 5: బలం ఉంటే సరిపోదు.. కాస్త బుద్ధి ఉపయోగించు..!

కెప్టెన్సీ టాస్క్‌ వల్ల గత కొన్నిరోజుల నుంచి ఇంటి సభ్యుల మధ్య ఏర్పడిన దూరాలను తొలగించి.. వారిని మరింత దగ్గర చేయడానికి బిగ్‌బాస్‌ సరికొత్త టాస్క్‌తో ముందుకు వచ్చాడు...

Updated : 23 Oct 2021 09:53 IST

విశ్వపై ప్రియాంక చిర్రుబుర్రులు

హైదరాబాద్‌: కెప్టెన్సీ టాస్క్‌ వల్ల గత కొన్నిరోజుల నుంచి ఇంటి సభ్యుల మధ్య ఏర్పడిన దూరాలను తొలగించి.. వారిని మరింత దగ్గర చేయడానికి బిగ్‌బాస్‌ సరికొత్త టాస్క్‌తో ముందుకు వచ్చాడు. జీవితంలో ఎదుర్కొన్న అడ్డంకుల గురించి చెప్పాలని బిగ్‌బాస్ కోరగా.. సన్నీ, షణ్ముఖ్‌, సిరి, లోబో, రవి, ప్రియ, జెస్సీ.. ఇలా ఒక్కొక్కరూ తమ జీవితంలో ఎదురైన చేదు సంఘటనలు పంచుకున్నారు. ఒకానొక సమయంలో లవ్‌ ఫెయిల్‌ కావడంతో సూసైడ్‌ చేసుకోవాలనుకున్నానని కానీ, స్నేహితుడి కారణంగా ఆ నిర్ణయాన్ని విరమించుకున్నానని షణ్ముఖ్‌ చెప్పాడు. తన జీవితంలో ఎదురైన ఇబ్బందులు గురించి చెప్పి సిరి భావోద్వేగానికి గురయ్యింది. తాను ఎదుర్కొన్న పరిస్థితులను వివరిస్తూ జెస్సీ చెప్పిన మాటలు స్ఫూర్తినింపేలా ఉన్నాయి. ఈ టాస్క్‌లో ఇంటి సభ్యుల మనస్సులను జెస్సీ గెలుచుకున్నాడు.

కెప్టెన్‌గా సన్నీ.. కల నెరవేరింది..!

ఇక, బిగ్‌బాస్‌ హౌస్‌ కొత్త కెప్టెన్‌ ఎంపికలో భాగంగా చివరి టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. విశ్వ, రవి, మానస్‌, సన్నీ, కాజల్‌లు పోటీదారులుగా ఈ టాస్క్‌ జరిగింది. టాస్క్‌లో భాగంగా కెప్టెన్సీ పోటీదారులకు బిగ్‌బాస్‌ బెలూన్స్ ఇచ్చాడు. పోటీదారులందరూ ఒక్కొక్క బెలూన్‌ తీసుకుని.. టాస్క్‌ ముగిసే వరకూ దాన్ని జాగ్రత్తగా దాచుకోవాలి. టాస్క్‌లో భాగంగా బజర్‌ మోగిన ప్రతిసారీ పోటీలో లేని మిగిలిన ఇంటి సభ్యులకు బిగ్‌బాస్‌ ఒక సూది ఇస్తాడు. ఆ సూదిని గెలుచుకున్న హౌస్‌మేట్‌.. తనకు ఇష్టమైన పోటీదారుడికి దాన్ని ఇవ్వొచ్చు. దాంతో ఆ పోటీదారుడు.. తనకు ఇష్టంలేని పోటీదారుడి బెలూన్‌ పగలకొట్టి కెప్టెన్సీ పోటీ నుంచి తొలగించవచ్చు.

తొలి బజర్‌లో జెస్సీ సూది సంపాదించి కాజల్‌కు ఇవ్వగా.. ‘‘నువ్వు రెండు సార్లు కెప్టెన్‌ అయ్యావు. కాబట్టి, నీ బెలూన్‌ పగలగొట్టాలనుకుంటున్నాను’’ అని విశ్వ బెలూన్‌ పగలకొట్టడానికి ప్రయత్నించింది. ‘‘నేను కష్టపడి రెండుసార్లు కెప్టెన్‌ అయ్యాను. ఇప్పుడు పోటీ నుంచి తప్పుకోను’’ అని విశ్వ బదులిచ్చి.. కాజల్‌ నుంచి దూరంగా వెళ్తుండగా.. అనుకోకుండా బెలూన్‌ పగిలిపోయింది. రెండో బజర్‌ మోగినప్పుడు సూదిని గెలుచుకునేందుకు విశ్వ, ప్రియాంక, లోబోలు పరిగెత్తగా.. మిగిలిన ఇద్దర్నీ తోసేసి.. విశ్వ ఆ సూదిని సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో ప్రియాంక కిందపడిపోయింది. కనీసం ఆమెను పైకి లేపకుండా, సారీ చెప్పకుండా విశ్వ వ్యవహరించిన తీరు ఇబ్బందికరంగా అనిపించింది. ‘‘బలం ఉంటే సరిపోదు అన్నయ్య. కాస్త బుద్ధి కూడా ఉపయోగించు’’ అని ప్రియాంక మండిపడింది. ‘‘నాకున్నది నేను వాడుకుంటా. తప్పేంటి’’ అంటూ విశ్వ రివర్స్‌ అయ్యాడు. ఇరువురి మధ్య వాగ్వాదం నడిచింది. సూది దక్కించుకున్న విశ్వ దాన్ని రవికి ఇచ్చాడు. రవి.. మానస్‌ బెలూన్‌ పగలకొట్టాడు. 

చివరి బజర్‌ మోగగానే అక్కడే ఉన్న అనీ మాస్టర్‌ సూది దక్కించుకుని సన్నీకి ఇచ్చింది. సన్నీ, మరో ఆలోచన చేయకుండా రవి బెలూన్‌ పగలకొట్టాడు. దాంతో సన్నీ హౌస్‌లో కొత్త కెప్టెన్‌గా విజయం సాధించాడు. తాను కెప్టెన్‌ అయితే వేసుకుందామని ఇంటి నుంచి తెచ్చుకున్న స్పెషల్‌ డ్రెస్‌ని ధరించి.. బాధ్యతలు స్వీకరించాడు. ‘సన్నీ మహారాజ్‌కి జై’ అంటూ శ్రీరామ్‌ నినాదాలు చేయడం సరదాగా అనిపించింది. అనంతరం సన్నీ హౌస్‌మేట్స్‌ దగ్గరికి వెళ్లి ఎవరికి ఏ పని చేయడం ఇష్టమో కనుకొని వాళ్ల ఇష్టానుసారం పనులు చేయమని సూచించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని