Allu arjun: ‘అల వైకుంఠపురములో’ సీక్వెల్‌తో వస్తారా? కొత్త కథ?

గతేడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి, బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’.

Updated : 07 Dec 2022 20:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గతేడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి, బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. అల్లు అర్జున్‌ స్టైలిష్‌ నటన, త్రివిక్రమ్‌ టేకింగ్‌, పూజా హెగ్డే అందాలతో పాటు, తమన్‌ అందించిన పాటలు సినిమాలను మరో స్థాయిలో నిలిపాయి. బన్నీ కెరీర్‌లో ఇప్పటివరకూ ఆల్‌టైమ్‌ సూపర్‌హిట్‌ చిత్రంగా నిలిచింది. ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అల్లు అర్జున్‌తో మరో సినిమా చేస్తానని త్రివిక్రమ్‌ అప్పట్లోనే ప్రకటించారు. కాగా, ఆ మాట నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

నాగశౌర్య కథానాయకుడిగా నటించిన ‘వరుడు కావలెను’ చిత్ర ప్రచార కార్యక్రమంలో అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరిద్దరితో పాటు తమన్‌తో కలిసి దిగిన ఫొటోను నిర్మాత నాగ వంశీ పంచుకున్నారు. ‘త్వరలోనే సర్‌ప్రైజ్‌ రానుంది’ అంటూ హారిక హాసిని ట్విటర్‌ను ట్యాగ్‌ చేశారు. దీంతో అల్లు అర్జున్‌-త్రివిక్రమ్‌-తమన్‌ కాంబినేషన్‌లో మరో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని టాలీవుడ్‌లో టాక్‌ మొదలైంది. అది ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి సీక్వెల్‌గా తీస్తారా? కొత్త కథతో ముందుకు వస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.

‘అల వైకుంఠపురములో’ బంటు(అల్లు అర్జున్‌) ఇంటికి రాజ్‌ మనోహర్‌(సుశాంత్‌).. రాజ్‌ మనోహర్‌ ఇంటికి బంటు వెళతారు(అవే వాళ్ల అసలైన తల్లిదండ్రుల ఇళ్లు). ఆ తర్వాత కథ ఎలా ఉంటుంది? బంటు బిజినెస్‌లోకి మళ్లీ అప్పలనాయుడు(సముద్రఖని), అతడి కొడుకు పైడితల్లి(గోవింద్‌) వచ్చారా? వస్తే బంటు ఎలా ఎదుర్కొన్నాడు? ఇలా కథను ముందుకు నడిపించే అవకాశమూ లేకపోలేదు. ప్రస్తుతం అల్లు అర్జున్‌ ‘పుష్ప’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. మొదటి భాగం డిసెంబరులో విడుదల కానుంది. ఇక త్రివిక్రమ్‌ ప్రస్తుతం ‘భీమ్లా నాయక్‌’ కోసం పనిచేస్తున్నారు. మరోవైపు మహేశ్‌బాబుతో చేయబోయే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ పనుల్లోనూ బిజీగా ఉన్నారు. మరి వీరి కాంబినేషన్‌లో చిత్రం ఎప్పుడు మొదలవుతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఈ వార్తే నిజమైతే బన్ని అభిమానులకు పండగే పండగ.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని