HBD Aishwarya: ఐశ్వర్యరాయ్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

ఆమెను చూస్తే, ‘ఇనుములో కూడా హృదయం మొలుస్తుంది’.. ఆమె అందానికి ‘అతిశయం కూడా ఆశ్చర్యపోతుంది’.. ‘మెరుపును

Updated : 01 Nov 2021 15:05 IST

ఆమెను చూస్తే, ‘ఇనుములో కూడా హృదయం మొలుస్తుంది’.. ఆమె అందానికి ‘అతిశయం కూడా ఆశ్చర్యపోతుంది’.. ‘మెరుపును తెచ్చి కుంచెగ మలిచి రవివర్మ గీచిన వదనం’.. ‘మిస్‌ వరల్డ్‌’ కిరీటం సైతం ఆమె తలకు అలంకరించే సమయంలో ఎంతగానో మురిసిపోయింది. ఎన్ని అవార్డులైనా ఆమె నటన ముందు చిన్నబోతాయి. నటిగా, బచ్చన్‌ కుటుంబానికి కోడలిగా, మంచి భార్యగా, తల్లిగా ఎప్పుడూ బాధ్యతలు మర్చిపోలేదు. ఆమే అందాల రాశి, నీలి కళ్ల సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్‌‌. సోమవారం ఈ వన్నె తరగని అందం పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఐశ్వర్యరాయ్‌ గురించి ఆసక్తికర విషయాలు మీకోసం..

ఐష్‌ స్వస్థలం కర్ణాటకలోని మంగుళూరు. కుటుంబంలో అందరూ చదువుకున్నవారే కావడంతో ఆమెకు చిన్నప్పటి నుంచే వైద్యవృత్తిపై ఆసక్తి ఏర్పడింది. కళాశాలలో ఉన్నప్పుడు మోడలింగ్‌పై మనసు మళ్లింది. అదే సమయంలో ఆమెకు ప్రకటనల్లో నటించే అవకాశం లభించింది. అలా ఆమె నటించిన ‘పెప్సీ’ యాడ్‌ మంచి పేరు తీసుకురావడంతో వైద్య విద్య నుంచి మోడలింగ్‌ వైపు అడులేశారు. ఆ తర్వాత 1994లో ‘మిస్‌ వర్డల్‌’ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు.


15 ఏళ్లలో వయసులోనే ఐష్‌ కామ్లిన్‌ పెన్సిల్‌ యాడ్‌ చేసింది. 1992-1993లో బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్‌తో కలిసి శీతల పానియాల’ యాడ్‌ చేసింది. దీని షూటింగ్ మొత్తం ఒకే రాత్రిలో జరిగిపోయిందట. ఈ ఒక్క ప్రకటనతో ఐష్‌ పేరు మోడలింగ్‌ రంగంలో మార్మోగిపోయింది.


1994లో ఐష్‌ ‘మిస్‌ వరల్డ్‌’ కిరీటాన్ని సొంతం చేసుకుంది. అదే ఏడాది సుస్మితా సేన్‌ ‘మిస్‌ యూనివర్స్‌’గా నిలిచింది.


ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకున్న తర్వాత ఐష్‌కి సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. కానీ, తన తెరంగేట్రం మాత్రం అదిరిపోయేలా ఉండాలని భావించింది. అలా 1997లో మణిరత్నం తెరకెక్కించిన ‘ఇరువర్‌’ (ఇద్దరు) సినిమాతో చిత్రసీమలోకి అడుగుపెట్టింది. తొలి చిత్రంలోనే ద్విపాత్రాభినయం చేసింది. రాజకీయ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. 1942లో వచ్చిన హాలీవుడ్‌ చిత్రం ‘కాసాబ్లాంకా’ అంటే ఐష్‌కి చాలా ఇష్టం. తన ఆల్‌ టైమ్‌ ఫేవరెట్‌ సినిమా అదేనట. ఒక వేళ బాలీవుడ్‌లో ఈ చిత్రాన్ని రీమేక్‌ చేస్తే మాత్రం కచ్చితంగా నటిస్తానని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.


ఐష్‌కి వాచ్‌లంటే ఎంతో ఇష్టం. కొత్తగా వచ్చిన మోడల్‌ వాచ్‌లన్నింటినీ సేకరించడం ఆమె హాబీ. ఆమెకు ఆభరణాలంటే కూడా మక్కువే. కొన్నింటిని సొంతంగానే డిజైన్‌ చేసుకుంటారట.


ఐశ్వర్యకు భారత్‌లోనే కాదు విదేశాల్లోనూ అభిమానులు ఎక్కువే. ఈమె నటించిన ‘జోధా అక్బర్‌’ చిత్రంలో ఆమె ఆహార్యం ఆధారంగా బార్బీ బొమ్మలను తయారు చేశారు. బ్రిటన్‌లో వీటిని తయారు చేయగా మార్కెట్‌లోకి విడుదల చేసిన కొన్ని నిమిషాల్లోనే హాట్‌ కేకుల్లాగా అమ్ముడుపోయాయి.


నెదర్లాండ్స్‌లోని క్యూకెనోఫ్‌ గార్డెన్‌లో ఉన్న తులిప్‌ పువ్వుల్లోని ఒక ప్రత్యేక జాతికి ఐశ్వర్య రాయ్‌ పేరు పెట్టారు.


సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కు ఐష్ వీరాభిమాని. ఎప్పటికైనా ఆయనతో నటించాలన్న తన కోరిక ‘రోబో’ చిత్రంతో నెరవేరింది. శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.


ఐష్‌కి క్రికెట్‌ ఆడటమంటే చాలా ఇష్టం. ఖాళీ సమయాల్లో బ్యాటు పట్టుకుని తన సరదాగా ఆడుతుంటారు. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన ‘రాజా హిందుస్థానీ’ చిత్రంలో కథానాయిక పాత్రకు ముందుగా ఐష్‌నే సంప్రదించారు. కానీ, ఆమె నిరాకరించడంతో ఆ అవకాశం కరీష్మాకపూర్‌ను వరించింది.


ఐష్‌ పుస్తకాల పురుగు. ఖాళీ సమయాల్లో చరిత్రకు సంబంధించిన పుస్తకాలు చదువుతుంటారు.


అందంగా, ఆరోగ్యంగా ఉండటం కోసం ఈమె ఆహారనియమాలు పాటిస్తారు. మధ్యాహ్న భోజనం తర్వాత తప్పనిసరిగా పండ్లు తీసుకుంటారట. 2009లో ఐష్‌ను భారత ప్రభుత్వం ‘పద్మ శ్రీ’ అవార్డుతో సత్కరించింది. 2012లో ఆమెకు బ్రిటన్‌ ప్రభుత్వం ‘ఆడ్రె డెస్‌ ఆర్ట్స్‌ ఎట్‌ డెస్‌ లెట్రెస్‌’ పురస్కారాన్ని అందించింది.


2003లో కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జ్యూరీ సభ్యురాలిగా ఐష్‌ వ్యవహరించారు. ఈ ఘనత దక్కిన తొలి భారతీయు నటి ఈమే. దీంతో పాటు ఈ ఉత్సవంలో ఇప్పటికీ ప్రత్యేక ఆకర్షణగానే నిలుస్తోంది. వైవిధ్యమైన కాస్ట్యూమ్స్‌తో రెడ్‌ కార్పెట్‌పై ఆమె నడిచి వచ్చే సమయం కోసం అక్కడ ఎన్నో కళ్లు, కెమెరాలు ఎదురు చూస్తుంటాయి.


2007 ఏప్రిల్‌ 20న ఐశ్వర్య రాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌లకు వివాహమైంది. హిందూ సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరిగింది. 2011 నవంబర్‌ 16న వీరికి ఆరాధ్య జన్మించింది.


ప్రస్తుతం ఐశ్వర్యరాయ్‌ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిస్టారికల్‌ ఫిక్షన్‌ స్టోరీ ‘పొన్నియన్‌ సెల్వన్‌’లో మందాకిని/నందిని పాత్రల్లో కనిపించనున్నారు. రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని