Cinema News: తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోం

‘‘సినిమాల్ని, సినీ పరిశ్రమకి చెందిన వ్యక్తుల్ని లక్ష్యంగా చేసుకుని సామాజిక అనుసంధాన వేదికల్లో తప్పుడు ప్రచారం సృష్టిస్తున్నారు. ఇకపైన అలాంటి వ్యాఖ్యలు ప్రచారం చేసేవాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అన్నారు

Updated : 20 May 2022 06:54 IST

 తెలుగు చలన చిత్ర పరిశ్రమ

‘‘సినిమాల్ని, సినీ పరిశ్రమకి చెందిన వ్యక్తుల్ని లక్ష్యంగా చేసుకుని సామాజిక అనుసంధాన వేదికల్లో తప్పుడు ప్రచారం సృష్టిస్తున్నారు. ఇకపైన అలాంటి వ్యాఖ్యలు ప్రచారం చేసేవాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అన్నారు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ. సామాజిక అనుసంధాన వేదికల్లో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఖండిస్తూ గురువారం హైదరాబాద్‌లోని చలన చిత్ర వాణిజ్య మండలి కార్యాలయంలో పరిశ్రమకి చెందిన అన్ని విభాగాల ప్రతినిధులు విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు జి.ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ ‘‘సామాజిక అనుసంధాన వేదికల్లో సినిమాలకి వ్యతిరేకంగా ప్రచారం చేయడం ఇటీవల పరిపాటిగా మారింది.  ఇండియన్‌ సెన్సార్‌షిప్‌ చట్టంతో కానీ, సినిమాటోగ్రఫీ సెన్సార్‌ చట్టంతోకానీ సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఓటీటీ వేదికల్లో కంటెంట్‌ని ప్రదర్శిస్తున్నారు. ఓటీటీ తరహాలోనే సామాజిక అనుసంధాన వేదికలూ మారాయి. పైరసీ నియంత్రణ విభాగం చలన చిత్ర వాణిజ్య మండలి ఆధీనం నుంచి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లింద’’ని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్లు అనుకున్నవి, ఊహించినవి సామాజిక అనుసంధాన వేదికల్లో ప్రచారం చేస్తున్నారు. వీటిపై నియంత్రణ అవసరం. దీనిపై ఏం చేయాలో మేం ఓ నిర్ణయానికొచ్చాం’’ అన్నారు తమ్మారెడ్డి భరద్వాజ. యూట్యూబ్‌కీ సెన్సార్‌ విధానం తీసుకురావాలని చెప్పారు దర్శకుల సంఘం అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్‌. ‘‘కొన్ని యూ ట్యూబ్‌ ఛానళ్లు మా కుటుంబంపై వ్యతిరేకమైన ప్రచారం చేశాయి. అవి మా జీవితాల్ని ప్రభావితం చేస్తున్నాయి’’ అన్నారు జీవిత రాజశేఖర్‌. ఈ సమావేశంలో పాల్గొనడం గురించి టి.ప్రసన్నకుమార్‌కీ, నిర్మాత శేఖర్‌గౌడ్‌కీ మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు ఎన్‌.శంకర్‌, వి.ఎన్‌.ఆదిత్య, టి.ప్రసన్నకుమార్‌, మోహన్‌ వడ్లపట్ల, మాదాల రవి, మధుసూదన్‌, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని