Telugu Heroes: సీనియర్లు ఇలా.. జూనియర్లు అలా.. డబుల్‌/ట్రిపుల్‌ ధమాకా ఇచ్చారు కానీ

అటు అగ్ర కథానాయకులు, ఇటు యంగ్‌ హీరోలు 2022లో రెండు/మూడు సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. విభిన్న పాత్రల్లో కనిపించారు.

Updated : 21 Dec 2022 14:02 IST

ఒక్కో ఏడాది రెండు/మూడు సినిమాలతో తమ అభిమానుల్ని అలరించాలని ప్రతి హీరో అనుకుంటాడు. కానీ, అది అందరికీ వీలు పడే విషయం కాదు. ప్రతి సంవత్సరం ఏమోగాని ఈ ఏడాది అధిక సంఖ్యలో హీరోలు ఒకటికి మించిన సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు. అలా డబుల్‌/ట్రిపుల్‌ ధమాకా ఇచ్చిన వారెవరు, ఏ చిత్రాలు మెప్పించాయి? రివైండ్‌ చేద్దాం..

చిరు, నాగ్‌, వెంకీ, రవితేజ

సీనియర్లు ఇలా..

గతేడాది ‘వైల్డ్‌ డాగ్‌’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ఈ సంవత్సరం మూడు సినిమాల్లో కనిపించారు. ఈయన హీరోగా దర్శకుడు కల్యాణ్‌కృష్ణ తెరకెక్కించిన ‘బంగార్రాజు’ ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా వివిధ కారణాల వల్ల వాయిదా పడి ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘పండగలాంటి సినిమా’ అని అనిపించుకుంది. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో నాగ్‌ నటించిన ‘ది ఘోస్ట్‌’ సినిమా దసరా కానుకగా విడుదలైంది. ఈ థ్రిల్లర్‌ చిత్రం ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయింది. మరోవైపు, బాలీవుడ్‌ చిత్రం ‘బ్రహాస్త్ర’లో కీలక పాత్రతో నాగార్జున అలరించారు. 2019 తర్వాత చిరంజీవి (Chiranjeevi) వెండితెరపై మెరిసింది ఈ సంవత్సరంలోనే. కొరటాల శివ దర్శకత్వంలో ఆయన నటించిన ‘ఆచార్య’ (Acharya)పై భారీ అంచనాలు ఏర్పడగా, వాటిని ఆ చిత్రం అందుకోలేకపోయింది. ‘గాడ్‌ ఫాదర్‌’ (God Father) ఆ లోటును తీర్చింది. మోహన్‌రాజా డైరెక్షన్‌లో వచ్చిన చిత్రమిది. ‘ఎఫ్‌ 3’తో సందడి చేసిన వెంకటేశ్‌, ‘ఓరి దేవుడా’ సినిమాలో అతిథి పాత్రలో కనిపించి మెప్పించారు. సినిమాల అవకాశాల విషయంలో ఎప్పుడూ ముందుండే హీరో రవితేజ (Ravi Teja). ఆయన నటించిన రెండు సినిమాలు ఇప్పటికే విడుదలకాగా డిసెంబరు 23న ‘ధమాకా’ (Dhamaka) విడుదల కానుంది. త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన సినిమా ఇది. రమేశ్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘ఖిలాడి’, శరత్‌ మండవ తెరకెక్కించిన ‘రామారావు: ఆన్‌ డ్యూటీ’ చిత్రాలు రవితేజకు విజయాన్ని అందించలేకపోయాయి.

చరణ్‌, చైతన్య, రానా

జూనియర్లు ఇలా..

2019లో ‘వినయ విధేయ రామ’ సినిమా రామ్‌ చరణ్‌కు మంచి ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత ఆయన నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ కొవిడ్‌ ప్రభావం వల్ల పలు మార్లు వాయిదా పడి, ఎట్టకేలకు ఈ వేసవిలో విడుదలైంది. రాజమౌళి దర్శకత్వంలో.. ఎన్టీఆర్‌తో కలిసి చరణ్‌ నటించిన ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టించింది. తన తండ్రి చిరంజీవితో కలిసి చరణ్‌ నటించిన ‘ఆచార్య’.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదలైన సుమారు 35 రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకొచ్చింది. గతేడాది ‘లవ్‌స్టోరి’తో హిట్‌ అందుకున్న నాగ చైతన్య 2022లో ‘బంగార్రాజు’తో అభిమానుల్ని బాగా అలరించారు. తర్వాత, ఈయన హీరోగా విక్రమ్‌. కె. కుమార్‌ రూపొందించిన ‘థ్యాంక్యూ’ ఫెయిల్‌ అయింది. ‘లాల్‌సింగ్‌ చడ్డా’ సినిమాతో ఇదే ఏడాది బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు చైతన్య. ఆమిర్‌ఖాన్‌ హీరోగా అద్వెత్‌ చందన్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో చైతన్య కీ రోల్‌ ప్లే చేశారు. బాలీవుడ్‌, టాలీవుడ్‌లో ఈ చిత్రం పరాజయం పొందింది. రానా ప్రతినాయకుడిగా నటించిన ‘భీమ్లా నాయక్‌’ ప్రేక్షకులను అలరించింది. పవన్‌ కల్యాణ్‌ హీరోగా సాగర్‌ కె. చంద్ర తెరకెక్కించిన చిత్రమిది. రానా హీరోగా వేణు ఊడుగుల రూపొందించిన ‘విరాటపర్వం’ ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయింది. మరోవైపు, కొన్నాళ్ల క్రితం రానా హీరోగా తెరకెక్కిన ‘1945’ సినిమా ఈ ఏడాది విడుదలై, బాక్సాఫీసు వద్ద నిరాశపరిచింది.

శర్వా, వరుణ్‌, నిఖిల్‌, విశ్వక్‌, శేష్‌, సత్య

కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్‌ నటించిన ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ మెప్పించలేకపోయింది. శ్రీ కార్తిక్‌ తెరకెక్కించిన ‘ఒకే ఒక జీవితం’ శర్వాకు మంచి గుర్తింపు తెచ్చింది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ నటించిన చిత్రం ‘ఎఫ్‌ 3’. గతంలో విజయవంతమైన ‘ఎఫ్‌ 2’కి సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రంలో ఆయన వెంకటేశ్‌తో కలిసి తెరను పంచుకున్నారు. ఇది విజయాన్ని అందించినా అంతకు ముందే వచ్చిన ‘గని’ సక్సెస్‌ కాలేదు. దీనికి కిరణ్‌ కొర్రపాటి దర్శకుడు. విశ్వక్‌ సేన్‌ కథానాయకుడిగా దర్శకుడు విద్యాసాగర్‌ చింతా తెరకెక్కించిన చిత్రం ‘అశోకవనంలో అర్జున కల్యాణం’. ఈ సినిమా విశ్వక్‌లోని కొత్త కోణాన్ని ఆవిష్కరించి, హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ‘ఓరి దేవుడా’ చిత్రంతోనూ విశ్వక్‌ ఓకే అనిపించారు. అశ్వత్‌ మారిముత్తు డైరెక్షన్‌లో వచ్చిన చిత్రమిది.‘మేజర్‌’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు అడివి శేష్‌. శశి కిరణ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అంతటా మంచి స్పందన లభించింది. ఇటీవల, విడుదలైన ‘హిట్‌ 2’ (Hit 2) కూడా శేష్‌కు హిట్‌ అందించింది. శైలేష్‌ కొలను దర్శకుడు. నిఖిల్‌ నటించిన తొలి పాన్‌ ఇండియా సినిమా ‘కార్తికేయ 2’. చందు మొండేటి తెరకెక్కించిన ఈ చిత్రం అందరినీ మెప్పించింది. సూర్య ప్రతాప్‌ దర్శకత్వంలో నిఖిల్‌ (Nikhil) నటించిన ‘18 పేజేస్‌’ (18 Pages) సినిమా ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకురానుంది. ‘గాడ్సే’తో విజయాన్ని అందుకోలేకపోయిన సత్యదేవ్‌.. ‘గాడ్‌ ఫాదర్‌’లో కీలక పాత్ర పోషించి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేశారు.

కిరణ్‌, ఆది, శ్రీవిష్ణు

వీరు ఇలా..

ఆది సాయికుమార్‌ నటించిన ‘అతిథి దేవోభవ’, ‘తీస్‌ మార్‌ ఖాన్‌’, ‘బ్లాక్‌’, ‘క్రేజీ ఫెలో’ చిత్రాలు; కిరణ్‌ అబ్బవరం హీరోగా వచ్చిన ‘సెబాస్టియన్‌’, ‘సమ్మతమే’, ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ సినిమాలు, శ్రీవిష్ణు నటించిన ‘భళా తందనాన’, ‘అల్లూరి’ చిత్రాల్లో ఏ ఒక్కటీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు రాబట్టలేకపోయాయి.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని