Telugu Indian Idol 2: ‘తెలుగు ఇండియన్‌ ఐడల్‌ 2’ విజేత సౌజన్య

తెలుగు ఇండియన్‌ ఐడల్‌  సీజన్‌ 2 (Telugu Indian Idol 2) నేటితో ముగిసింది. ఈ సీజన్‌కు సౌజన్య విజేతగా నిలిచారు.

Updated : 05 Jun 2023 13:22 IST

హైదరాబాద్‌: ఆహా ఓటీటీ (AHA Telugu) వేదికగా ప్రసారమవుతోన్న ప్రముఖ మ్యూజిక్‌ రియాల్టీ షో ‘తెలుగు ఇండియన్‌ ఐడల్‌ 2’ (Telugu Indian Idol 2) ఆదివారంతో ముగిసింది. రెండో సీజన్‌లో గాయని సౌజన్య విజేతగా (Telugu Indian Idol 2 winner) నిలిచారు. గ్రాండ్‌ ఫినాలేకు ముఖ్య అతిథిగా విచ్చేసిన అల్లు అర్జున్‌ (Allu Arjun) ఫైనల్‌కు వచ్చిన కంటిస్టెంట్స్‌ను మెచ్చుకున్నారు. అనంతరం ఈ సీజన్‌కు విజేతగా నిలిచిన సౌజన్యకు టైటిల్‌తోపాటు రూ.10 లక్షల నగదు బహుమతిని అందజేశారు.

సౌజన్యను ఉద్దేశిస్తూ బన్నీ మాట్లాడుతూ... ‘‘మీరు టైటిల్‌ గెలుచుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే, పిల్లలను తల్లిదండ్రులు ప్రోత్సహించడం సాధారణంగా జరుగుతుంది. కానీ, భర్త, అత్తింటి వాళ్లు సపోర్ట్‌ చేస్తే ఒక మహిళ గొప్ప విజయాలు అందుకోవచ్చని మీరు నిరూపించారు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు’’ అని తెలిపారు. ఇక, ఈ సీజన్‌లో ఫస్ట్‌ రన్నరప్‌గా నిలిచిన జయరాజ్‌ రూ.3లక్షలు, సెకండ్‌ రన్నరప్‌గా నిలిచిన లాస్య రూ.2 లక్షల చెక్‌ను అందుకున్నారు.

‘ఏదో ప్రియరాగం వింటున్నా’, ‘బూచాడే’, ‘సామీ సామీ’ పాటలతో ఫినాలేలో సౌజన్య అలరించారు. సౌజన్య పాటలకు ఫిదా అయిన బన్నీ ఆమెను మెచ్చుకున్నారు. ‘‘మీరు సింగింగ్‌కు గ్యాప్‌ ఇవ్వలేదు. వచ్చింది అంతే. ఇకపై గ్యాప్‌ ఉండదు. మీరు పాడుతున్న విధానం, తెలుగు భాషపై మీకున్న పట్టును మెచ్చుకోవాలి. నాకు మీపై ప్రత్యేకమైన గౌరవం ఏర్పడింది. ఎందుకంటే, ఒక తల్లిగా రెండేళ్ల వయసున్న పాపను, కుటుంబాన్ని చూసుకుంటూనే మీ కలను నెరవేర్చుకోవడం కోసం ఎంతో శ్రమిస్తున్నారు. అలాగే, సౌజన్య ఈ స్థాయికి రాగలిగారంటే ఆమె భర్త, అత్తింటి వారిని మెచ్చుకోవాలి. భర్త అనేవాడు భార్యకు ఎప్పుడూ సపోర్ట్‌ చేస్తూ ఉండాలి. నేను కూడా నా భార్యకు అండగా ఉంటాను. తనకు మనస్ఫూర్తిగా ఏదైనా చేయాలనిపిస్తే తప్పకుండా చేయమని చెబుతా. నా భార్యకు ఫొటోషూట్‌ కంపెనీ ఒకటి ఉంది. అందులో మీ పాపకు, ఫ్యామిలీ మొత్తానికి ఫొటోషూట్‌కు నేను ఛాన్స్‌ ఇస్తున్నాను’’ అని బన్నీ వివరించారు. అంతేకాకుండా యువ టాలెంట్‌ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే తాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు.

సౌజన్య కేరాఫ్‌ వైజాగ్‌

సౌజన్య స్వస్థలం విశాఖపట్నం. చిన్నప్పటి నుంచి ఆమెకు సంగీతమంటే ఎంతో ఇష్టం. ఎన్నో పోటీల్లోనూ పాల్గొన్నారు. పెళ్లి, ఓ పాపకు జన్మనిచ్చిన తర్వాత వ్యక్తిగత జీవితాన్ని దృష్టిలో ఉంచుకుని సంగీతాన్ని పక్కన పెట్టారు. ఈ క్రమంలోనే భర్త అండగా నిలవడంతో కెరీర్‌పరంగా కమ్‌బ్యాక్‌ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అలా, ఆమె ‘తెలుగు ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 2’లో అడుగుపెట్టారు. ‘అర్జున్‌రెడ్డి’లోని ‘గుండెలోన...’ పాటను ఆలపించింది సౌజన్యనే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని