Updated : 27 Nov 2021 23:14 IST

Akhanda: కొవిడ్‌ వచ్చినా.. దేవుడే దిగి వచ్చినా తెలుగు సినిమా.. ప్రేక్షకుడు ‘తగ్గేదేలే’

హైదరాబాద్‌: తెలుగు ప్రేక్షకులు సినిమాను ప్రేమించినంతగా మరే ప్రేక్షకుడు సినిమాను ప్రేమించడని, అలాంటి మీ ప్రేమాభిమానాలు తమకు ఉన్నాయని కథానాయకుడు అల్లు అర్జున్‌ అన్నారు. కొవిడ్‌ వచ్చినా, పైనుంచి దేవుడు దిగి వచ్చినా తెలుగు సినిమా, తెలుగు ప్రేక్షకులు తగ్గేదేలే అంటూ తనదైన శైలిలో అలరించారు. బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అఖండ’. బోయపాటి శ్రీను దర్శకుడు. ప్రగ్యా జైస్వాల్‌ కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ శిల్పకళావేదికలో ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. 

ఈ సందర్భంగా కథానాయకుడు నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘తల్లిదండ్రులను దేవుళ్లకంటే ఎక్కువ ప్రేమతో చూసుకోవాలి. మీరు ఎవరిని ప్రేమిస్తారు అని అడిగితే నా నోటి నుంచి వచ్చే మొదటి పేరు మా నాన్నగారిది. ఆ తర్వాత అన్నీ నాకు అభిమానులే. ఏమీ ఆశించకుండా నన్ను ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటి అభిమానులను పొందడం మా పూర్వ జన్మ సుకృతం. కొవిడ్‌ కష్టకాలాన్ని కూడా ఎదురొడ్డి ఎంతో మంది సినిమాను తెరకెక్కించారు. అలాంటి వారిని ప్రోత్సహించాలంటే ప్రతి సినిమాకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందించాలి. రాబోయే రోజుల్లో వచ్చే ‘పుష్ప’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘ఆచార్య’సహా ప్రతి చిత్రమూ మంచి విజయం సాధించాలి’’ అని బాలకృష్ణ అన్నారు.

రీల్‌లోనూ రియల్‌గానూ బాలకృష్ణ ఒకేలా ఉంటారు: అల్లు అర్జున్‌

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అల్లు అర్జున్‌ మాట్లాడుతూ.. ‘‘నందమూరి కుటుంబానికి, అల్లు వారి కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. మా తాతయ్య అల్లు రామలింగయ్యగారంటే స్వర్గీయ ఎన్టీఆర్‌కు ఎంతో ఇష్టం. ఎంతో చనువు కూడా ఉంది. చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు చూస్తూ నేను పెరిగా. అలాంటి గొప్ప వ్యక్తి ప్రీరిలీజ్‌ వేడుకకు రావటం సంతోషంగా ఉంది. ‘భ్రద’ సినిమా కథ నాకే చెప్పారు. కానీ ‘ఆర్య’ చేయాల్సి రావటంతో అది కుదరలేదు. నన్ను బాగా ఇష్టపడే వ్యక్తుల్లో బోయపాటిగారు ఒకరు. బాలకృష్ణ- బోయపాటి కాంబినేషన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘సింహా’తో మొదలైంది.. ‘లెజెండ్‌’తో దూసుకెళ్లింది. ‘అఖండ’తో అన్‌స్టాపబుల్‌ అవుతుంది. ఈ సినిమాతో మీరొక సరికొత్త శ్రీకాంత్‌ను చూస్తారు. బాలకృష్ణ ఈ స్థాయిలో ఉన్నారంటే రెండు కారణాలు ఉన్నాయి. సినిమా అంటే ఆయనకున్న డెడికేషన్‌, డిక్షన్‌. రెండు పేజీల డైలాగ్‌ అయినా ఎలాంటి మార్పూ లేకుండా డిక్షన్‌ చెబుతారు. బాలకృష్ణ రీల్‌లో అయినా, రియల్‌గా అయినా ఒకేలా ఉంటారు. మనకు నచ్చినట్లు మనం ఉండటం గొప్ప విషయం. అందులో బాలకృష్ణ స్పెషల్. ‘అఖండ’ జ్యోతిలా ఈ సినిమా వచ్చే సినిమాలకు మార్గదర్శనం చూపాలి’’ అని అల్లు అర్జున్‌ అన్నారు.'

ప్రస్తుత పరిస్థితుల్లో సినిమానే గెలవాలి: బోయపాటి

ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. ‘‘ఒక సినిమా బాగా తీస్తే ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో ‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాలు ఉదాహరణ. ఈ సినిమా చూసిన తర్వాత ఒక మంచి మూవీ చూశామన్న ఉత్సాహంతో ప్రేక్షకులు బయటకు వస్తారు. ‘అఖండ’ కోసం టెక్నీషియన్స్‌ ఎంతో కష్టపడి పనిచేశారు. ప్రతి విషయంలోనూ అందరూ చాలా సహకారం అందించారు. బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెండితెరపై మీరే చూస్తారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతలను అభినందించాలి. 21 నెలల పాటు నా నిర్మాత ఎంతో ఓపికతో మంచి సినిమా తీయాలనే ఉద్దేశంతో వేచి చూశారు. ‘జై బాలయ్య’ సాంగ్‌ ప్రాక్టీస్‌ చేస్తుండగా బాలకృష్ణ గాయపడ్డారు. అయినా కూడా నొప్పిని భరిస్తూ ఆ పాట పూర్తి చేశారు. నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు నన్ను ప్రోత్సహించిన వ్యక్తి అల్లు అర్జున్‌. నా కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్ ఇచ్చిన వ్యక్తి బాలకృష్ణ. ఇద్దరికీ నా ధన్యవాదాలు. ఒకరి సినిమాను మరొకరు ప్రోత్సహిస్తూ వెళ్లాలి. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమానే గెలవాలి’’ అని అన్నారు. 

‘అఖండ’తో ఆ బ్రేక్‌ బద్దలవుతుంది: నిర్మాత మిర్యాల రవీందర్‌

నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమా గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అందరికీ కృతజ్ఞతలు. కరోనా కారణంగా థియేటర్‌లో సినిమా చూసే విషయంలో ఒక బ్రేక్‌ పడింది. డిసెంబరు 2న ‘అఖండ’తో ఆ బ్రేక్‌ బద్దలవుతుంది. ఆ తర్వాత ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్‌’లు విజయ పరంపరను కొనసాగిస్తాయి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అల్లు అర్జున్‌, రాజమౌళిలకు ధన్యవాదాలు అని అన్నారు.


ఫొటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని