Mohan: చెప్పాల్సిన కథతో 1997

‘‘నేనెప్పుడో విన్న ఓ సంఘటన నా మనసులో అలాగే ఉండిపోయింది. నేటికీ మన సమాజంలో అలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అందరికీ చెప్పాల్సిన ఆ కథతోనే మా చిత్రం తెరకెక్కింద’’న్నారు డా.మోహన్‌.

Updated : 24 Nov 2021 08:17 IST

‘‘నేనెప్పుడో విన్న ఓ సంఘటన నా మనసులో అలాగే ఉండిపోయింది. నేటికీ మన సమాజంలో అలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అందరికీ చెప్పాల్సిన ఆ కథతోనే మా చిత్రం తెరకెక్కింద’’న్నారు డా.మోహన్‌. ఆయన ప్రధాన పాత్ర పోషించడంతోపాటు, స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘1997’. నవీన్‌చంద్ర, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, కోటి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా దర్శకనిర్మాత, నటుడు డా.మోహన్‌ మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

‘‘ఒక దొర అహంకారానికి బలైన ఓ అమాయకురాలి కథని సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించాం. సమాజంలో అసమానతలకి అద్దం పట్టే కథ. పాఠశాల రోజుల్లో సెలవులకి ఊరికి వెళ్లినప్పుడు మా తాత చెప్పిన ఓ సంఘటన నా మనసులో అలాగే ఉండిపోయింది. కథ రాసుకున్నాక నిర్మాతల్ని, దర్శకుల్ని కలిశాం. ఈ కథని మరోలా చెప్పేందుకు ముందుకు రావడంతో నేనే దర్శకత్వం చేశా. ఏ పనైనా పూర్తిగా లీనమై చేయడం నా శైలి. అందుకే స్వయంగా నిర్మించడంతోపాటు, ఓ పాత్రనీ చేశా. ఐపీఎస్‌ పాసై అప్పుడే ఊరికి వెళ్లిన ఓ పోలీస్‌ అధికారిగా నేను కనిపిస్తా. నవీన్‌ చంద్ర నాపై అధికారిగా కనిపిస్తారు. మేం ఇద్దరం హీరోలం కాదు, కథే మా సినిమాకి హీరో. శ్రీకాంత్‌ అయ్యంగార్‌... చారి అనే పోలీస్‌గా చాలా బాగా నటించారు. సంగీత దర్శకుడు కోటి నేను తీసిన సినిమా నచ్చి సంగీతం అందించారు. సినిమాని చూసిన చాలా మంది కన్నీళ్లు పెట్టించావని అన్నారు. వాణిజ్య హంగులతోనే తెరకెక్కించా’’ అన్నారు డా.మోహన్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని