Pragya jaiswal: కథ వినకుండానే ‘అఖండ’ చేశా

తొలి అడుగుల్లోనే ప్రతిభ చాటింది ప్రగ్యా జైస్వాల్‌. ‘కంచె’ చిత్రంతో ఆమె చక్కటి అభినయం ప్రదర్శించింది. వరుసగా అవకాశాలు అందుకొంటోంది. ఇటీవల బాలకృష్ణ సరసన ‘అఖండ’లో నటించింది.

Updated : 27 Nov 2021 08:04 IST

తొలి అడుగుల్లోనే ప్రతిభ చాటింది ప్రగ్యా జైస్వాల్‌. ‘కంచె’ చిత్రంతో ఆమె చక్కటి అభినయం ప్రదర్శించింది. వరుసగా అవకాశాలు అందుకొంటోంది. ఇటీవల బాలకృష్ణ సరసన ‘అఖండ’లో నటించింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఆ చిత్రం   డిసెంబర్‌ 2న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ  సందర్భంగా ప్రగ్యా జైస్వాల్‌ శుక్రవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది.

ఈ సనిమాలో అవకాశం సొంతమయ్యాక మీ మనసులో ఎలాంటి ఆలోచనలు వచ్చాయి?

2020 కరోనా తర్వాతే నాకు ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. కెరీర్‌ని మళ్లీ కొత్తగా మొదలు పెడుతున్న అభిప్రాయం కలిగింది. దర్శకుడు బోయపాటి శ్రీనుపై చాలా నమ్మకం. ఆయన ఒక పాత్ర కోసం ఒకరిని అనుకున్నారంటే అది పక్కాగా ఓ మంచి ఎంపిక అవుతుంది. ఆయన ఎంతో ఆలోచించిగానీ నటుల్ని ఎంపిక చేసుకోరు. అందుకే ఈ సినిమా కోసం నన్ను సంప్రదించినప్పుడు కథ వినాలనిపించలేదు. కథ వినకుండానే చేస్తానని చెప్పా. బోయపాటిపై నాకు అంత నమ్మకం.

బాలకృష్ణతో కలిసి నటించడం ఎలా అనిపించింది?

అంత పెద్ద హీరోతో నేను ఇదివరకెప్పుడూ నటించలేదు. ఆయనతో అంతకుముందు రెండు మూడు సార్లు కలిశాను కానీ, సెట్‌కి వెళ్లిన తొలి రోజు భయంగా అనిపించింది. ఈ సినిమా సెట్‌కి వెళ్లిన తొలి రోజే బాలకృష్ణ సర్‌తో కలిసి సన్నివేశాలు చేయాల్సి వచ్చింది. సెట్‌లో అడుగు పెట్టగానే ఎంతో ఉత్సాహంగా ‘ప్రగ్యా...’ అంటూ పలకరించారు.  ఐదు నిమిషాలకే నాలో భయాలన్నీ మాయమైపోయాయి. ఆయనది సమయం అంటే సమయమే. క్రమశిక్షణ, సమయపాలన విషయాల్లో ఆయన్నుంచి చాలా నేర్చుకున్నా. మూడు గంటలకే లేస్తారు, ఆరు గంటలకే సెట్‌కి వస్తారు. రోజంతా చిత్రీకరణలో పాల్గొంటారు. దర్శకుడు బోయపాటి శ్రీను నుంచి చాలా నేర్చుకున్నా. ఆయన నటులకి ఎంతో స్వేచ్ఛనిస్తారు. కొన్నిసార్లు ఆయన చెప్పింది చెప్పినట్టు చేసినా సరిపోతుంది. పాత్ర విషయంలో ఆయనకి అంత స్పష్టత ఉంటుంది.

ఈ కథ, మీ పాత్ర గురించి ఏం చెబుతారు?

‘అఖండ’ కథ, అందులోని పాత్రల్ని ఇప్పటివరకు నేను చూడలేదు. చాలా శక్తివంతమైన పాత్రలతో ఈ కథని తీర్చిదిద్దారు  దర్శకుడు. ఇక నేనొక  ఐఏఎస్‌ అధికారిగా    కనిపిస్తా. కథంతా ఆ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ‘నాకు ఎదురైన సంఘటనల వల్లే అఖండ పాత్ర తెరపైకొస్తుంది. ఇదివరకు చూసిన ప్రగ్యా ఇందులో అస్సలు కనిపించకూడద’ని చెప్పారు బోయపాటి. ఆ పాత్రని పోషించేందుకు చాలా కష్టపడ్డా. ఇలాంటి ఓ బలమైన,  కీలకమైన పాత్రని పోషించే అవకాశం దొరకడం చాలా సంతృప్తినిచ్చింది.

ఇప్పటిదాకా సాగిన    కెరీర్‌ని విశ్లేషించుకుంటే ఏమనిపిస్తోంది?

నా వరకు వచ్చిన కథల్లోంచి మంచి పాత్రల్ని ఎంచుకున్నా. కొన్ని ఫలితాల్నిచ్చాయి, కొన్ని ఇవ్వలేదు. ఫలితాలనేవి మన చేతుల్లో ఉండవు కదా. నేను మాత్రం మంచి కథలపై దృష్టిపెడుతూ, మంచి పాత్రల్ని ఎంచుకుంటూ వస్తున్నా. ఏడేళ్లుగా సాగుతున్న సినీ ప్రయాణం నాది. పనిని అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం తీసుకున్నా. డిజిటల్‌ వేదికలా లేక సినిమానా? అని సంబంధం లేకుండా... మంచి కథలు, మంచి బృందంతో కలిసి ప్రయాణం చేయాలనేది నా ప్రణాళిక.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని