83 Movie: భారతీయులంతా కాలరెగరేసుకుని తిరిగిన సంఘటన అది: నాగార్జున

1983లో భారత క్రికెట్‌ జట్టు ప్రపంచకప్‌ను గెలుచుకున్నప్పుడు ప్రతి భారతీయుడు కాలరెగరేసుకుని తిరిగారని

Updated : 17 Sep 2022 14:13 IST

హైదరాబాద్‌: 1983లో భారత క్రికెట్‌ జట్టు ప్రపంచకప్‌ను గెలుచుకున్నప్పుడు ప్రతి భారతీయుడు కాలరెగరేసుకుని తిరిగారని అగ్ర కథానాయకుడు నాగార్జున(Nagarjuna) అన్నారు. దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపిన ఆ చారిత్రక సంఘటనతో తెరకెక్కిన ‘83’(83 Movie) చిత్రాన్ని నేటి యువత తప్పకుండా చూడాలని అన్నారు. 1983 ప్రపంచకప్‌, కపిల్‌ దేవ్‌(kapil dev) జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో తెరకెక్కిన స్పోర్ట్స్‌ డ్రామా ఇది. రణ్‌వీర్‌ సింగ్‌(Ranveer Singh), దీపిక పదుకొణె(Deepika Padukone) కీలక పాత్రలు పోషించారు. కబీర్‌ఖాన్‌ దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా క్రిస్మస్‌ కానుకగా డిసెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీతో పాటు, ప్రాంతీయ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాను తెలుగులో నాగార్జున విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగార్జునతో పాటు రణ్‌వీర్‌ సింగ్‌, కబీర్‌ఖాన్‌, కపిల్‌ దేవ్‌, శ్రీకాంత్‌ కృష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు.

రణ్‌వీర్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘‘నటనారంగంలో ఉన్న వాళ్లకు సరికొత్త పాత్రలు చేయాలన్న పిచ్చి ఉంటుంది. అదే నన్ను కపిల్‌  పాత్ర పోషించేలా చేసింది. ప్రపంచకప్‌ గెలుపొందిన టీమ్‌లో ఉన్న సభ్యులు వారి కుటుంబాలతో కలిసి ఈ సినిమాను చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఈ సినిమా కోసం కపిల్‌దేవ్‌తో కొన్నాళ్లు ప్రయాణం చేయడం నా జీవితంలో మర్చిపోలేనిది. శ్రీకాంత్‌ కృష్ణమాచారి, విశ్వనాథ గుండప్ప, క్లైవ్‌ లాయిడ్‌ ఇలా ఆరోజు మ్యాచ్‌ ఆడిన వాళ్లలో చాలా మంది సినిమాలో వారి పాత్రలు పోషించే వారికి ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చారు. అలాంటి వారి దగ్గర ఈ సినిమా కోసం శిక్షణ తీసుకోవడం మా అదృష్టం’’ అని అన్నారు. ‘‘ఇలాంటి మధురానుభూతులను తెరపై చూపించాలంటే, ఆనాటి పరిస్థితులను కళ్లకు కట్టాలి. అందుకోసం మేము చాలా రీసెర్చ్‌ చేశాం. ఆనాడు మ్యాచ్‌ ఆడిన వాళ్లను చాలా మందిని కలిశాం. కపిల్‌దేవ్‌తో కలిసి కొన్నాళ్లు ప్రయాణించాం’’ అని దర్శకుడు కబీర్‌ ఖాన్‌ చెప్పుకొచ్చారు.

ఇక ఈ కార్యక్రమంలో కపిల్‌ దేవ్‌ మాట్లాడుతూ.. ‘‘కబీర్‌ఖాన్‌ ‘83’ని రెండు భాగాలుగా చూపించారు. ఒకటి క్రికెట్‌, మరొకటి ఫ్యామిలీ. రెండింటినీ మిళితం చేసి చూపించటం చాలా బాగుంది. తెరపై క్రికెట్‌ చూపించటం సులభమే. కానీ, ఫ్యామిలీడ్రామా, అదీ ఎమోషనల్‌గా చూపించటం చాలా కష్టం. అలాగే నటులు కూడా సులభంగా నటిస్తారు. కానీ, ఎమోషన్స్‌ పండించటమే అసలైన సవాల్‌. నాటి టీమ్‌ ఇండియా సభ్యులు, వారి కుటుంబం, తల్లిదండ్రులు, మనవళ్లు, మనవరాళ్లతో కలిసి సినిమాను చూశారు. చూస్తున్నంత సేపు చాలా ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యాం’’ అని అన్నారు. ‘‘83’లో రణ్‌వీర్‌ సింగ్‌ నాకు కనిపించలేదు. కేవలం కపిల్‌దేవ్‌ మాత్రమే కనిపించాడు. ఎవరినో పొగడాలని ఇది చెప్పటం లేదు. నా బ్యాటింగ్‌లాగానే నా మాటలు కూడా ఫటాఫట్‌ ఉంటాయి. ‘ఏడు కొండల వాడా గోవిందా గోవిందా’ అనుకుంటూ బంతిని బాదేస్తా. అలాగే మాట్లాడతా. అది మీ అందరికీ తెలుసు. సినిమా చూసిన తర్వాతే కపిల్‌దేవ్‌ వ్యక్తిగత జీవితం గురించి తెలిసింది. ఇప్పటివరకూ ఆ విషయాలు ఏవీ నాకు తెలియవు. కపిల్‌ నిరాడంబరతకు హ్యాట్సాఫ్‌’’ అని టీమ్‌ ఇండియా మాజీ ఆటగాడు, 83 ప్రపంచకప్‌ జట్టు సభ్యులు శ్రీకాంత్‌ కృష్ణమాచారి చెప్పుకొచ్చారు. తాను నాగార్జున ఇంజినీరింగ్‌లో క్లాస్‌మేట్స్ అని, ఆ తర్వాత కొన్ని రోజులకు చూస్తే చైన్‌ పట్టుకుని ‘శివ’ అవతారమెత్తారని శ్రీకాంత్‌ నవ్వులు పంచారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని