Updated : 11 Nov 2021 07:25 IST

Anand Devarakonda: అలాంటి నటులు లేకపోతే ఎలా?

విజయ్‌ దేవరకొండ తమ్ముడిగానే పరిచయమైనా... తనకంటూ ఓ ప్రత్యేకత ఉండేలా కథల్ని ఎంపిక చేసుకుంటూ దూసుకెళుతున్నాడు ఆనంద్‌  దేవరకొండ. ‘మిడిల్‌క్లాస్‌ మెలోడీస్‌’తో విజయాన్ని అందుకున్న ఆయన, ఇటీవల ‘పుష్పకవిమానం’ చేశారు. విజయ్‌ దేవరకొండ సమర్పిస్తున్న ఈ సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఆనంద్‌ దేవరకొండ బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

‘పుష్పక విమానం’ పేరుకీ, మీ కథకీ సంబంధం ఏమిటి?
పుష్పక్‌ ట్రావెల్స్‌ అనే ఓ హనీమూన్‌ ఏజెన్సీ ఉంటుంది ఇందులో. దాంతోపాటు నా పాత్ర పెళ్లి గురించి రకరకాలుగా ఊహించుకుంటూ ఉంటుంది. ఆ కోణంలో ఈ పేరయితేనే బాగుంటుంది. అలా అన్నిటినీ దృష్టిలో పెట్టుకునే ఈ పేరు పెట్టాం. మొదట ‘పుష్పకవిమానం’తోపాటు రకరకాల పేర్లు అనుకున్నాం. ఇదైతే పాజిటివ్‌ సౌండ్‌తో ఉంటుందనిపించింది. మా దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు సర్‌కి ఫోన్‌ చేసి మీ సినిమా పేరు పెట్టుకుంటున్నాం అంటే... ‘అది నా పేరేమీ కాదు, ఎప్పట్నుంచో ఉన్నదే. మీ సినిమాకి సరిపోయేలా ఉందనిపిస్తే వాడండి’ అని చెప్పారు.

మీరు టీచర్‌ పాత్రని పోషించారు కదా, ఆ పాత్ర కోసం ప్రత్యేకంగా సిద్ధమయ్యారా?
కొన్ని వర్క్‌ షాప్‌లు చేశాం. టీచర్‌ అనగానే చిన్నప్పుడు స్కూల్‌ని గుర్తు చేసుకున్నా. ఎక్కడికెళ్లినా గౌరవంగా కనిపించాలని కొద్దిమంది టీచర్లు నీటుగా దువ్వుకుని, టక్‌ వేసుకుని  కనిపిస్తుంటారు. అలా వాళ్లని గుర్తు  చేసుకుని నేను పోషించిన చిట్టిలంక సుందర్‌ పాత్ర కోసం సిద్ధమయ్యా. అమాయకంగా  కనిపిస్తూ, ఎక్కువగా మాట్లాడని పాత్ర అది. ఒక పరాజితుడిలా కనిపిస్తుంటాడు.

కెరీర్‌ ఆరంభంలోనే ఇలాంటి పాత్రని చేయడం రిస్క్‌ అనిపించలేదా?
ఏదో రకంగా కొత్తదనం తీసుకురావాలి కదా. బయట చాలా మంచి కథలు ఉన్నాయి. చాలా మంది దర్శకులు నా దగ్గరికి వచ్చి, మాకు ఇలాంటి కథలు చేయడానికి, ఇలాంటి యువ కథానాయకులు కావాలి అని అడుగుతుంటారు. ప్రేక్షకులు ఇలాంటి సహజమైన సినిమాల్ని స్వీకరిస్తున్నారు. మనకు చూసే ప్రేక్షకులతోపాటు, చేసే నిర్మాతలు, దర్శకులు ఉన్నప్పుడు నటులొక్కరే లేకపోతే ఎలా? మొదట ఈ కథని నేను నిర్మాతగానే విన్నా. పెళ్లి చేసుకునే పాత్ర కదా అని వేరే కథానాయకుల దగ్గరికి పంపించాం. కొద్దిమంది పెళ్లాం లేచిపోవడమా? అలాంటి పాత్రలోనా? అంటూ సంశయించారు. మా నాన్న ‘నువ్వు చేస్తావా?’ అని అడిగారు. మా అన్న విజయ్‌ చేసిన ‘అర్జున్‌రెడ్డి’, ‘గీత గోవిందం’ సినిమాల్లో చివర్లో పెళ్లి చేసుకుంటాడు. మరి ఇందులో ఆరంభంలోనే పెళ్లి చేసుకునే కుర్రాడిగా నేను నటిస్తే స్వీకరిస్తారా? అని అడిగా. లుక్‌ టెస్ట్‌ చేసుకున్నాక నేను సిద్ధమైపోయా.

పెళ్లికి ముందే పెళ్లయిన వ్యక్తిలా నటించడం ఎలా అనిపించింది?
అదొక సవాల్‌ అనుకుంటే, అలాంటివి ఇంకా సినిమాలో చాలానే ఎదురయ్యాయి. అవన్నీ తెరపై చూస్తే అర్థమవుతుంది. కుటుంబ భావోద్వేగాలు, ఫన్‌, థ్రిల్లింగ్‌ అంశాలు... ఇలా అన్నీ కలగలిసిన కథ ఇది. పెళ్లాం లేచిపోవడం అనే అంశం ఎంత ఆసక్తిని పెంచుతుందో, పెళ్లి గురించి మేం చర్చించిన విషయాలు అంతే ఆకట్టుకుంటాయి. దర్శకుడు దామోదర్‌ మా అన్నయ్యకి స్నేహితుడు. తను చాలా స్పష్టతతో సినిమాని తీశాడు.

కొత్త దర్శకులతోనే సినిమాలు చేస్తున్నారు, కారణం?
చెప్పాలంటే పెద్ద దర్శకులతో కలిసి సినిమా చేసే అవకాశం రాలేదు. ఇప్పుడైతే సీనియర్‌ దర్శకులు సాయిరాజేశ్‌, కె.వి.గుహన్‌లతో చేస్తున్నా. ఆ తర్వాత మరొకొన్ని కొత్త దర్శకులతోనూ చేయాల్సి ఉంది.


‘‘కథల ఎంపికలో మా అన్న ప్రమేయం ఏమీ ఉండదు. ఆయన్ని చూసి నేనెప్పుడూ ప్రభావితం కాలేదు. నేను విన్న కథకి నేను ఫిట్‌ అవుతానా? లేదా? అనే ఆలోచిస్తా. నా కథల్ని, దర్శకుల్ని నేనే ఎంపిక చేసుకుంటా. మా అన్న నన్ను ‘మా తమ్ముడు ఆఫ్‌బీట్‌ సినిమాలు చేస్తుంటాడ’నే పరిచయం చేస్తుంటారు. మొదటి సినిమా తర్వాత నా గురించి రకరకాల అభిప్రాయాలు వ్యక్తమైనా... ‘ఇప్పుడు నీ కథల ఎంపిక బాగుంది, తర్వాతేంటి?’ అని ఆసక్తిగా అడుగుతున్నారు. అది నాకు ఉత్సాహాన్నిచ్చే విషయం’’.


 


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని