Raja Vikramarka: నా రెండో సినిమా అనుకుని చేశా!

సుధాకర్‌  కోమాకుల అంటే గుర్తు   పడతారో లేదో కానీ... ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ నాగరాజ్‌ అంటే ఆయన రూపం కళ్ల ముందు మెదులుతుంది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన ఆ చిత్రంతోనే పరిచయమైన సుధాకర్‌ కోమాకుల...

Updated : 11 Nov 2021 07:27 IST

సుధాకర్‌  కోమాకుల అంటే గుర్తు పడతారో లేదో కానీ... ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ నాగరాజ్‌ అంటే ఆయన రూపం కళ్ల ముందు మెదులుతుంది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన ఆ చిత్రంతోనే పరిచయమైన సుధాకర్‌ కోమాకుల... ఆ తర్వాత హీరోగా సినిమాలు చేస్తూనే, అప్పుడప్పుడు కీలక పాత్రల్లోనూ మెరుస్తున్నారు. ‘క్రాక్‌’లో పోలీస్‌ కానిస్టేబుల్‌గా సందడి చేసిన సుధాకర్‌... ఇటీవల ‘రాజా విక్రమార్క’లోనూ నటించారు. కార్తికేయ కథానాయకుడిగా నటించిన ‘రాజా విక్రమార్క’ ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సుధాకర్‌ కోమాకుల బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...  

‘‘తొలి దాంతోపాటు రెండు మూడు సినిమాలూ  కీలకమే. ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ తర్వాత నేను మంచి కథలే ఎంచుకున్నా అవి ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయాయి. ‘రాజా విక్రమార్క’ నాకు పునః ప్రారంభం అనుకుంటున్నా. ఇది నా రెండో సినిమా అనుకుని చేశా. ఇందులో ఏసీపీ గోవింద్‌ అనే ఓ కీలకమైన పాత్రలో కనిపిస్తా. నేనెక్కువగా సరదా పాత్రలే చేశా. ఇందులో గోవింద్‌ పాత్ర చాలా గంభీరంగా ఉంటుంది. ఆ పాత్రలో భిన్న కోణాలు ఉన్నాయి. సినిమా తర్వాత తప్పకుండా నాకు మంచి పేరొస్తుంది. ఇందులో నేను నటించడానికి కారణం దర్శకుడు శ్రీ సరిపల్లి. తను నాకు పదేళ్లుగా తెలుసు. అమెరికాలో చాలా సినిమాలకి పనిచేశాడు. నేను ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ చేసేటప్పుడు తను సహాయ దర్శకుడిగా చేసేవాడు. ఆ తర్వాత నా సినిమా ‘నువ్వు తోపురా’కి చీఫ్‌ అసోసియేట్‌ దర్శకుడిగా పనిచేశారు. తను కార్తికేయకి కథ చెప్పి ఒప్పించాక నాకు ఫోన్‌ చేసిన ‘నువ్వు ఓ కీలక పాత్ర చేయాలి’ అన్నాడు. నేను హీరోగా సినిమాలు చేస్తున్నాను కదా అంటే, ‘మంచి పాత్ర, నువ్వు చేయాల్సిందే’ అన్నాడు. అలా ‘క్రాక్‌’ కంటే ముందే ఒప్పుకొని చేసిన సినిమా ఇది’’.

* ‘‘హీరోగా నా ఆకలి ఇంకా తీరలేదు. ఇక నుంచి హీరోగా ఎక్కువ మంచి సినిమాలు చేయాలనుకుంటున్నా. నా పుట్టినరోజున ఈ సినిమా విడుదలవుతోంది. ప్రస్తుతం కథానాయకుడిగా ‘నారాయణ అండ్‌ కో’, ‘జీడీ’ (గుండెల్లో దమ్ముంటే) అనే సినిమాలు చేస్తున్నా. వీటితోపాటు మరో సినిమా ఖరారైంది. సుఖ మీడియా పేరుతో నిర్మాణ సంస్థని ఏర్పాటు చేశా. మంచి కథలు వస్తే మా భాగస్వామ్యంలో నిర్మించాలనేది ప్రణాళిక. చిరంజీవి సర్‌ పుట్టినరోజు సందర్భంగా నేను, నా భార్య హారిక కలిసి చేసిన ‘ఇందువదన...’ పాటకి చక్కటి స్పందన లభించింది. ఆ తరహాలో ‘30 వెడ్స్‌ 21’ ఫేమ్‌ అనన్యతో కలిసి ఓ ఇండిపెండెంట్‌ గీతం చేశా. అది త్వరలోనే విడుదలవుతుంది’’.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని