Chiranjeevi: నాట్యానికే అంకితం

‘‘మన ఆచారాలు, సంప్రదాయాలు, కళల్ని మరిచిపోతున్న నేటి పరిస్థితుల్లో ‘నాట్యం’ తెరకెక్కడం సంతోషంగా ఉంది. ఈ సినిమాతో నాట్యం గొప్పదనమేమిటో ప్రేక్షకులకు చేరువవుతుంది’’ అన్నారు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి.

Updated : 20 Oct 2021 07:09 IST

‘‘మన ఆచారాలు, సంప్రదాయాలు, కళల్ని మరిచిపోతున్న నేటి పరిస్థితుల్లో ‘నాట్యం’ తెరకెక్కడం సంతోషంగా ఉంది. ఈ సినిమాతో నాట్యం గొప్పదనమేమిటో ప్రేక్షకులకు చేరువవుతుంది’’ అన్నారు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి. ఆయన ఇటీవల తనని కలిసిన ‘నాట్యం’ బృందాన్ని ప్రశంసించారు. చిత్రాన్ని చూసేందుకు ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి సంధ్యారాజు స్వయంగా నటించి, నిర్మిస్తున్న చిత్రమిది. రేవంత్‌ కోరుకొండ దర్శకత్వం వహించారు. ఈ నెల 22న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ‘‘కళల పట్ల సంధ్యారాజుకి ఉన్న అంకితభావాన్ని తెలియజేస్తున్న ప్రయత్నమిది. ఆమె డబ్బు కోసం కాకుండా ఎంతో తపనతో ఈ సినిమా చేశారు. యువ దర్శకుడు రేవంత్‌ ఈ తరహా చిత్రం చేయడం అభినందనీయం. ఇలాంటివారు పరిశ్రమకి రావాలి. సినిమా మాధ్యమం ఎంతో ప్రభావవంతమైనది. దీని ద్వారా ప్రతిభని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. అది వృథా కాదు. ‘నాట్యం’ సినిమాకి ప్రేక్షకుల ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నా’’ అన్నారు. సంధ్యారాజు మాట్లాడుతూ ‘‘నా జీవితాన్ని నాట్యానికి అంకితం చేశా. డబ్బుతో వచ్చేది కాదు ఈ కళ. ఎంతో అంకితభావం, కష్టం ఉండాలి. ఈ సినిమా ప్రయాణంలో చిరంజీవి సర్‌ని కలవడం ఎంతో సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘నాట్యం గురించే కాకుండా మన సంస్కృతిని, తెలుగుదనాన్ని చూపించాం. అన్ని రకాల భావోద్వేగాలున్న చిత్రమిది’’ అన్నారు దర్శకుడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని