Raja Vikramarka: అందుకే చిరంజీవి టైటిల్‌ పెట్టాం

‘‘దర్శకుడిగా అన్ని రకాల జానర్లు ప్రయత్నించాలి అనుకుంటున్నా. అయితే ఏ జానర్‌ సినిమా చేసినా.. అందులో వినోదం పక్కాగా ఉండేలా చూసుకుంటాను’’ అన్నారు శ్రీ సరిపల్లి. ‘రాజా విక్రమార్క’ చిత్రంతో తెరకు పరిచయమవుతున్న

Updated : 09 Nov 2021 08:43 IST

‘‘దర్శకుడిగా అన్ని రకాల జానర్లు ప్రయత్నించాలి అనుకుంటున్నా. అయితే ఏ జానర్‌ సినిమా చేసినా.. అందులో వినోదం పక్కాగా ఉండేలా చూసుకుంటాను’’ అన్నారు శ్రీ సరిపల్లి. ‘రాజా విక్రమార్క’ చిత్రంతో తెరకు పరిచయమవుతున్న కొత్త దర్శకుడాయన. కార్తికేయ, తాన్యా రవిచంద్రన్‌ జంటగా నటించిన ఈ సినిమాని రామారెడ్డి, ఆదిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 12న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ
నేపథ్యంలోనే సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు శ్రీ సరిపల్లి.

‘‘నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ)లో కొత్తగా చేరిన కుర్రాడి కథ ఇది. అతను విచారణ చేసే క్రమంలో పొరపాటున ఆయుధాలు అమ్మే ఓ వ్యక్తిని చంపేస్తాడు. చనిపోవడానికి ముందు ఆ వ్యక్తి ఓ భారీ కుట్రకు సంబంధించిన సగం సమాచారాన్ని అందిస్తాడు. మరి ఆ మిగిలిన సమాచారాన్ని హీరో ఎలా కనుగొన్నాడు? ఈ క్రమంలో అతనికెదురైన సవాళ్లేంటి? ప్రత్యర్థుల కుట్రని ఎలా భగ్నం చేశాడు? అన్నది మిగిలిన కథ. యాక్షన్‌తో పాటు వినోదానికి ప్రాధాన్యమిస్తూ ఆసక్తికరంగా ఈ కథ సిద్ధం చేశా. హాలీవుడ్‌ సినిమా ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’, తెలుగులో వచ్చిన ‘నిర్ణయం’ తరహాలో ఈ చిత్రం కనిపిస్తుంది. నా దృష్టిలో ఇదొక మినీ ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ అని చెప్పొచ్చు’’.

* ‘‘ఈ చిత్రంలో వినోదం కథలో భాగంగానే ఉంటుంది తప్ప ఎక్కడా బలవంతంగా ఇరికించినట్లు ఉండదు. ద్వితియార్ధం చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ కథ రాసుకునేటప్పుడు ఎవరైనా యువ హీరోతో చేయాలని అనుకునేవాణ్ని. కార్తికేయను చూశాక ఈ కథకి తను సరిగ్గా సరిపోతాడనిపించింది. ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమా విడుదల సమయంలో ఆయనకి ఈ కథ చెప్పా. స్క్రిప్ట్‌ నచ్చి తనే స్వయంగా నిర్మించాలనుకున్నారు. ఈలోపు వేరే ప్రాజెక్ట్‌లు ముందుకు రావడం వల్ల.. ఇది కాస్త ఆలస్యమైంది. ఈలోపు రామారెడ్డి, ఆదిరెడ్డి నిర్మించడానికి ముందుకొచ్చారు. ఈ సినిమాని కరోనాకు ముందే ప్రారంభించాం. మధ్యలో రెండు లాక్‌డౌన్‌లు రావడం వల్ల చిత్రీకరణ ఆలస్యమైంది. నిజానికి ఈ సినిమా చిత్రీకరణని 70రోజుల్లోనే పూర్తి చేశాం’’.

* ‘‘ఈ సినిమాలో హోంమంత్రి కుమార్తెగా తాన్యా రవిచంద్రన్‌ కనిపిస్తుంది. మనసుకు నచ్చినట్లుగా బతికే అమ్మాయి తను. క్లాసికల్‌ డ్యాన్సర్‌. తాన్యా స్వతహాగానూ మంచి క్లాసికల్‌ డ్యాన్సర్‌ కావడం వల్ల ఈ పాత్రకు సరిగ్గా సరిపోతుందనిపించి తీసుకున్నాం. ఇందులో తనికెళ్ల భరణి, సాయికుమార్‌, సుధాకర్‌ కోమాకుల, పశుపతి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రతి ఒక్కరి పాత్రకు కథలో సమ ప్రాధాన్యత ఉంటుంది. చిరంజీవి సర్‌ టైటిల్‌ను వాడుకోవాలన్న ఉద్దేశంతో ‘రాజా విక్రమార్క’ అనే పేరు పెట్టలేదు. కథకు.. హీరో క్యారక్టరైజేషన్‌కు సరిగ్గా సరిపోతుందనిపించే ఆ పేరును ఖరారు చేశాం’’.

* ‘‘మాది విజయవాడ. పుట్టి పెరిగిందంతా అక్కడే. కాలేజీ చదువులు పూర్తయ్యాక యూఎస్‌ వెళ్లి యూనివర్సల్‌ స్టూడియోస్‌లో మాస్టర్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ మేకింగ్‌ చేశాను. మళ్లీ ఇక్కడికి వచ్చాక.. కొన్ని చిన్న సినిమాలకు పని చేశాను. ఈ క్రమంలోనే 2012లో వి.వి.వినాయక్‌ సర్‌ దగ్గర చేరాను. అలా ఆయన దగ్గర ‘నాయక్‌’, ‘అల్లుడు శీను’ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేశాను. ఇప్పుడు ‘రాజా విక్రమార్క’ సినిమాతో దర్శకుడిగా తెరకు పరిచయమవుతున్నాను. నా తర్వాతి చిత్రం కోసం ఇప్పటికే ఓ స్క్రిప్ట్‌ సిద్ధం చేసి పెట్టుకున్నా. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తా’’.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని