Updated : 15 Oct 2021 06:59 IST

Pelli SandaD: విందు భోజనం పెళ్లి సందడి

కమర్షియల్‌ సినిమా..కె రాఘవేంద్రరావు ముందు, తర్వాత అనేంతగా ప్రభావం చూపించిన దర్శకుడు. ఆయన సినిమా అంటే వాణిజ్య ఇంద్రజాలం. ఆయన కథానాయిక ఓ స్వప్న సుందరి. ఆయన సినిమాలోని పాటే సౌందర్య లహరి. తరాలు మారినా దర్శకేంద్రుడి సినిమాకి మాత్రం నిత్య యవ్వనం. పాతికేళ్ల క్రితం రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘పెళ్లి సందడి’ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే పేరుతో ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో మరో చిత్రం తెరకెక్కింది. గౌరీ రోణంకి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ కథానాయకుడిగా నటించాడు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా రాఘవేంద్రరావుతో ఈనాడు సినిమా ప్రత్యేకంగా ముచ్చటించింది.

సరా పండగకి ఇంటిల్లిపాదికీ సందడిని పంచుతుంది. విస్తరాకులో విందు భోజనంలా అన్ని రుచులూ ఉన్న సినిమా ఇది. కరోనా తర్వాత కుటుంబ ప్రేక్షకులు పూర్తిస్థాయిలో ఇంకా థియేటర్లకి రాలేదు. ఈ సినిమా కచ్చితంగా కుటుంబ ప్రేక్షకుల్ని థియేటర్లకి తీసుకొస్తుందనే నమ్మకం ఉంది. సరిగ్గా పాతికేళ్ల తర్వాత... అదీ అప్పటి ‘పెళ్లిసందడి’ హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ ఇందులో హీరో కావడం... ఇదంతా కూడా యాథృచ్ఛికంగానే జరిగింది. నిజానికి మేం మొదట వేరే కథతో వేరే హీరోలతో సినిమా చేయాలనుకున్నాం. నా దగ్గర పదేళ్లుగా రచయితగా పనిచేస్తున్న గౌరి రోణంకి పెళ్లి నేపథ్యంలో ఈ కథని మలచడంతో ‘పెళ్లిసందడి’ తెరపైకొచ్చింది. ఈ కథకి కొత్త హీరో అయితే బాగుంటాడని అనుకుంటున్న సమయంలోనే హృతిక్‌ రోషన్‌ లాంటి లుక్స్‌తో రోషన్‌ కనిపించాడు. వెంటనే శ్రీకాంత్‌కి ఫోన్‌ చేశా. ‘నేనే మీకు చూపిద్దాం అనుకున్నాను, ఇలా తయారయ్యాడు వాడు’ అంటూ రోషన్‌ గురించి చెప్పాడు.

అంతేనా, లేక ఆ పెళ్లి సందడి కథతో ఏమైనా సంబంధం ఉండటంతో రోషన్‌ని ఎంపిక చేసుకున్నారా?

చాలా మంది ‘అప్పటి పెళ్లిసందడికి సీక్వెలా?’ అంటున్నారు. మేం కూడా మొదట ‘పెళ్లిసందడి 25’ అనే పేరు  పెట్టాలనుకున్నాం. కానీ మళ్లీ ఆ కథతో సంబంధం ఉందనుకుంటారని ఆ నిర్ణయాన్ని మార్చుకున్నాం. ఆ కథకీ, ఈ సినిమాకీ ఎలాంటి సంబంధం లేదు. పెళ్లి చుట్టూనే సాగే కథ కావడం, నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా పేరు ఉండాలనే ఆలోచనతోనే ‘పెళ్లిసంద...డి’ అని పెట్టాం. అప్పటి సినిమాలో ఫైట్లు ఉండవు. ఇందులో ఫైట్లు కూడా ఉంటాయి. అప్పట్లో ‘పెళ్లిసందడి’ విడుదలైనప్పట్నుంచి తెలుగునాట ఫలానావారి పెళ్లి సందడి అని శుభలేఖల్లోనూ, వాహనాలపైన అచ్చు వేయించడం అలవాటైంది. ఇప్పుడు కూడా అంతే. ఈ సినిమా విడుదలయ్యాక ఇదే తరహాలోనే చివర్లో డి అనే రాసుకుంటారు. అంతగా ఈ సినిమా ప్రభావం చూపిస్తుందని నమ్మకముంది. వినోదానికి ప్రాధాన్యమున్న కథ కావడంతో దర్శకుడు అనిల్‌ రావిపూడితోపాటు అప్పటి సినిమా రచయిత సత్యానంద్‌ కూడా కొన్ని ఇన్‌పుట్స్‌ ఇచ్చారు. పెళ్లిసందడి అనగానే పాటలే గుర్తుకొస్తాయి కాబట్టి ఈ సినిమా విషయంలోనూ సంగీతం పరంగా కీరవాణి ఛాలెంజ్‌గా తీసుకుని స్వరాలు సమకూర్చారు.

తొలిసారి మీరు కెమెరా ముందుకొచ్చారు. అదెలా జరిగింది?

‘ఘర్షణ’ సినిమాకే అనుకుంటా.. గౌతమ్‌ మేనన్‌, వెంకటేష్‌ నన్ను నటించమని బలవంతం చేశారు. ఆ తర్వాత ‘శతమానం భవతి’ సినిమాలో ప్రకాశ్‌ రాజ్‌ చేసిన పాత్ర కోసం కూడా మొదట నన్నే సంప్రదించారు. కానీ నేను నటించలేదు. ‘శతమానం భవతి’ సినిమాలో కొడుకులు నిర్లక్ష్యం చేసే ఓ తండ్రి పాత్ర. నిజ జీవితంలో నాకూ, మా పిల్లలకీ చాలా అనుబంధం ఉంటుంది. అందుకే ఆ పాత్ర చేయలేనని చెప్పా. పైగా సినిమాలో అదొక పెద్ద పాత్ర. తొలిసారే అంత బరువైన పాత్ర చేయడం కష్టం కాబట్టి చేయనని చెప్పా. ఊరెళ్లినప్పుడు స్నేహితులతో కలిసి సరదాగా మేమే ఓ స్క్రిప్ట్‌ రాసుకుని మేమే నటిస్తూ సెల్‌ఫోన్లలో షూట్‌ చేస్తుంటాం. అవి మా పిల్లలకి చూపించినప్పుడు మీరు సినిమాలో కూడా నటించొచ్చు కదా అంటుంటారు. ఇందులో సూత్రధారి తరహా పాత్ర ఒకటి ఉండటం, పక్కన రాజేంద్రప్రసాద్‌ లాంటి ఓ పెద్ద నటుడు ఉంటాడనే ఆ పాత్రని నేను చేశా. ఈ సినిమా మా తమ్ముడు కృష్ణమోహన్‌రావు సమర్పకులుగా రూపొందడం కూడా మరో ప్రత్యేకత. నేను, మా తమ్ముడు కలిసి ఆర్‌.కె.ఫిల్మ్స్‌ పతాకంపై 12 సినిమాలు నిర్మించాం. నా సమర్పణలో ‘బాహుబలి’ వచ్చింది. అలా మా తమ్ముడి సమర్పణలోనూ ఓ సినిమా రావాలని, తను ఉన్నప్పుడే ఈ సినిమాని మొదలుపెట్టాం. ఆర్నెళ్ల కిందట తను మాకు దూరమయ్యాడు. తనకి ఈ సినిమాలోని పాటలు చూపించామంతే.

నేటి స్టార్లలో చాలా మందిని కథానాయకులుగా మీరే పరిచయం చేశారు. ఎప్పటికప్పుడు కొత్తతరంతో పనిచేయడం ఎలా ఉంటుంది?

అదొక పెద్ద సవాల్‌ అనే చెప్పాలి. వెంకటేష్‌ని ‘కలియుగ పాండవులు’ చిత్రంతో పరిచయం చేసినప్పుడు తనకి చాట్ల శ్రీరాములు దగ్గర ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించాం. మహేష్‌బాబు కూడా సత్యానంద్‌ దగ్గర ట్రైన్‌ అయినా ‘రాజకుమారుడు’ కోసం ప్రత్యేకంగా సన్నద్ధమయ్యాడు. ‘గంగోత్రి’ సమయంలో బన్నీని, ‘స్టూడెంట్‌ నెంబర్‌ 1’ సమయంలో ఎన్టీఆర్‌నీ ఆయా కథలకి, పాత్రలకి తగ్గట్టుగా ముందే మలిచేవాళ్లం. ఎంత చదువుకుని, శిక్షణ తీసుకుని వచ్చినా ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ అవసరం కదా. అలా వాళ్లని ముందే మలిచేవాళ్లం. ‘పెళ్లిసందడి’కి కూడా రోషన్‌, శ్రీలీల నెల రోజులపాటు ప్రత్యేకంగా సన్నద్ధమయ్యారు. శ్రీలీల తెలుగమ్మాయే. చిన్నప్పుడే డాక్టర్‌, యాక్టర్‌ కావాలనుకుందట. ఆ అమ్మాయి చదువులోనూ, డ్యాన్స్‌లోనూ, మోటివేషనల్‌ స్పీకర్‌గానూ... ఇలా అన్నింట్లోనూ నెంబర్‌ వన్నే. రోషన్‌, శ్రీలీల ప్రేక్షకులకు ప్రత్యేకంగా గుర్తుండిపోయేలా చేస్తుందీ చిత్రం.

మీరు అన్ని రకాల సినిమాలూ చేశారు. దర్శకత్వం పరంగా ఇంకా చేయాలనుకున్న కథలేమైనా ఉన్నాయా?

ప్రత్యేకంగా డ్రీమ్‌ ప్రాజెక్టులంటూ ఏమీ లేవు కానీ...ఈమధ్య రాక్‌లైన్‌ వెంకటేష్‌ ఓ ప్రాజెక్ట్‌తో నన్ను కలిశారు. అన్నీ కుదిరితే ఆ సినిమా చేయాలనిపించింది. ఇలాంటి సినిమా చేయడం అదృష్టం అనిపించే ప్రాజెక్టులు అనిపిస్తే తప్ప దర్శకత్వం చేయను. నా దగ్గర ఓ బృందం ఉంది. వాళ్లు చేస్తున్న ఓటీటీ ప్రాజెక్టులు,  సీరియళ్లకి సంబంధించి సలహాలు సూచనలు ఇస్తుంటా.


అప్పట్లో అగ్ర కథానాయకులతో సినిమాలు చేస్తున్న మీరు, ‘పెళ్లిసందడి’లాంటి ఓ చిన్న సినిమాని తీయడానికి కారణమేమిటి?

అప్పట్లో అశ్వనీదత్‌, అల్లు అరవింద్‌తో ఎక్కువ సినిమాలు చేశా. సరదాగా మనమందరం కలిసి ఓ చిన్న సినిమా చేద్దామని రంగంలోకి దిగాం. రచయిత సత్యానంద్‌ కూడా ఆ సినిమా నిర్మాణంలో ఓ భాగం వేశారు. మేం నలుగురం రూ.కోటి పెట్టి తీసిన సినిమా అది. రూ.17 కోట్లు వసూలు చేసింది. ‘అన్నమయ్య’ని ఎలాగైతే నా జీవితంలో మరిచిపోలేనో, ‘పెళ్లిసందడి’ని కూడా అంతే. ఈ సినిమాకి కూడా మొదటి వారం రోజులు స్పందన అంతంత మాత్రమే.  వారం తర్వాత ఊపందుకుంది. కొన్ని థియేటర్లలో సినిమాని తీసేసి మళ్లీ వేశారు. పెద్దవాళ్లు చిన్న సినిమా తీయడం ఓ బాధ్యత అనుకునేవాళ్లం.


‘‘యువకులతో కూడిన ఓ ఫ్రెండ్స్‌ బ్యాచ్‌ ఉంది నాకు. వాళ్లతో కలిసి ప్రపంచంలోని పలు దేశాలు చుట్టి వస్తుంటా. పరిశ్రమలోని యువ దర్శకులు చాలా మంది నాతో సన్నిహితంగా ఉంటారు. అనిల్‌ రావిపూడి, సుకుమార్‌, హరీష్‌ శంకర్‌, కొరటాల శివ, క్రిష్‌... ఇలా యువ దర్శకులంతా నా దగ్గరికొస్తుంటారు. సరదాగా వాళ్ల ఆలోచనలు పంచుకుంటుంటారు. అప్పట్లో మేమెలా చేశామో అడిగి తెలుసుకుంటుంటారు. వాళ్ల ఆలోచనలు చాలా బాగుంటాయి. మంచి సినిమాలు చేస్తున్నారు. తనికెళ్ల భరణి శిష్యుడు జనార్ధన మహర్షి నాకొక కథ చెప్పాడు. అందులో నటించమని కోరాడు. కథ నచ్చింది. ఒక గాడ్‌ఫాదర్‌, ఓ మెంటార్‌ తరహా పాత్ర. ఆలోచన బాగుంది కానీ... ప్రస్తుతానికి పెండింగ్‌లో ఉంచాను’’.


 


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని