
Bheemla nayak: పిడుగులొచ్చి మీదపడితె కొండగొడుగునెత్తినోడు
కథా రచయితగా. దర్శకుడిగా సినీప్రియులపై చెరగని ముద్ర వేశారు త్రివిక్రమ్. ఇప్పుడాయన ‘భీమ్లా నాయక్’ కోసం తనలోని పాటల రచయితను మేల్కొలిపారు. పవన్ కల్యాణ్ టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రమిది. సాగర్ కె.చంద్ర తెరకెక్కిస్తున్నారు. రానా మరో హీరో. తమన్ స్వరాలందించారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోన్న ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, సంభాషణలు సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడాయనే ఈ చిత్ర టైటిల్ గీతానికి సాహిత్యం అందించారు. ‘‘లాలా భీమ్లా.. అడవి పులి.. గొడవపడి’’ అంటూ సాగే ఈ పాటను త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం విడుదల చేశారు. భీమ్లా నాయక్ పాత్ర వ్యక్తిత్వాన్ని.. ఆ పాత్రలోని హీరోయిజాన్ని ఈ పాటతో చూపించే ప్రయత్నం చేశారు. ‘‘పదిపడగల పాముపైన పాదమెడితె సామితోడు.. పిడుగులొచ్చి మీదపడితె కొండగొడుగునెత్తినోడు.. లాలా భీమ్లా’’ అంటూ పాటలో వినిపించిన త్రివిక్రమ్ సాహిత్యం శక్తిమంతంగా ఉంది. దీనికి తగ్గట్లుగా పవన్‌ను చూపించిన విధానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పాటను అరుణ్ కౌండిన్య ఆలపించగా.. ఫల్గుని బంగేరా నృత్యరీతులు సమకూర్చారు. మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పానుమ్ కోశియుమ్’కు రీమేక్‌గా రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో పవన్ సరసన నిత్యామేనన్ నటిస్తుండగా.. రానాకు జోడీగా సంయుక్త మేనన్ కనిపించనుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.