Raja Vikramarka: కార్తికేయ కెరీర్‌లో గుర్తుండిపోయేలా...

‘‘వ్యాపారంలో మేం పదేళ్లుగా భాగస్వాములం. సినిమాల పరంగా మా ఇద్దరి అభిరుచులు ఒక్కటే. అందుకే మేం కలిసి విజయవంతంగా సినిమాని నిర్మించాం’’ అన్నారు ఆదిరెడ్డి, 88 రామారెడ్డి.

Updated : 01 Nov 2021 07:28 IST

‘‘వ్యాపారంలో మేం పదేళ్లుగా భాగస్వాములం. సినిమాల పరంగా మా ఇద్దరి అభిరుచులు ఒక్కటే. అందుకే మేం కలిసి విజయవంతంగా సినిమాని నిర్మించాం’’ అన్నారు ఆదిరెడ్డి, 88 రామారెడ్డి. ఈ ఇద్దరూ కార్తికేయ కథానాయకుడిగా నిర్మించిన చిత్రం ‘రాజా విక్రమార్క’. శ్రీసరిపల్లి దర్శకత్వం వహించారు. నవంబర్‌ 12న చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు ఆదిరెడ్డి, 88 రామారెడ్డి  ఆదివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...

ఆదిరెడ్డి: ‘‘తూర్పు గోదావరి జిల్లా, వెదురుపాక మా ఊరు. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ది మా ఊరే. ఉత్తరాంధ్రలో నేను ‘బాద్‌షా’, ‘గబ్బర్‌సింగ్‌’, ‘గ్యాంబ్లర్‌’ తదితర సినిమాల్ని పంపిణీ చేశా. ఆ తర్వాత ధనుష్‌, కీర్తిసురేష్‌ జంటగా నటించిన ‘రైల్‌’ సినిమాని తెలుగులో విడుదల చేశా. నిర్మాతగా ‘రాజా విక్రమార్క’ నా రెండో చిత్రం. సినిమా రంగంతో ఎప్పట్నుంచో అనుబంధం ఉన్నా... ఓ మంచి సినిమా తీయాలనే ఇన్నాళ్లూ ఎదురు చూశా. నేను, 88 రామారెడ్డి స్నేహితులం. తన ద్వారా వచ్చిన ఈ కథ నచ్చి సినిమా చేశాం. కొత్తతరం స్టైలిష్‌ యాక్షన్‌ చిత్రమిది. హీరో కార్తికేయ ఎన్‌.ఐ.ఎ అధికారిగా కనిపిస్తారు. సినిమాలో వినోదం, ప్రేమ ఉంటాయి. సినిమా విడుదల తర్వాత కార్తికేయ నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడతారు. ఆయన కెరీర్‌లోనే గుర్తుండిపోయేలా సినిమాని నిర్మించాం. అన్నీ కుదిరితే ‘రాజా విక్రమార్క’ విజయోత్సవంలోనే మా కొత్త   సినిమాని ప్రకటిస్తాం’’.

88 రామారెడ్డి: ‘‘మాది తూర్పు గోదావరి జిల్లా, కొంకుదురు గ్రామం. ఎస్వీ కృష్ణారెడ్డి మా ఊరివాసులే. నేను, ఆదిరెడ్డి వ్యాపారంలోనే కాదు, మా ఇద్దరి సినిమా అభిరుచులు ఒక్కటే. మాకు ఇష్టమైన కథానాయకుడు చిరంజీవి, ఇష్టమైన నిర్మాత డి.రామానాయుడు.  200కిపైగా సినిమాలు పంపిణీ చేసిన వినోద్‌ రెడ్డి ద్వారా నా దగ్గరకు ఈ కథ వచ్చింది. ఆదిరెడ్డికీ, నాకూ నచ్చడంతో సినిమాని ప్రారంభించాం. శ్రీసరిపల్లి హాలీవుడ్‌ సినిమాలకి పనిచేశాడు. ఆ అనుభవంతో మన  తెలుగు ప్రేక్షకుల అభిరుచుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేశాడు. ఇప్పటివరకు కార్తికేయ చేసిన సినిమాలు ఓ ఎత్తు, ఈ సినిమా మరో ఎత్తు. కరోనా రెండుసార్లు అడ్డంకులు సృష్టించినా సినిమా ఇంత బాగా వచ్చిందంటే కారణం కార్తికేయే’’.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని