Sandhya raju: ఆ శక్తేమిటో అప్పుడు అర్థమైంది

‘‘పదేళ్ల వయసులోనే నా జీవితాన్ని కళలకి అంకితం చేయాలని నిర్ణయించుకున్నా. ప్రేక్షకుల ప్రోత్సాహం దక్కితే భవిష్యత్తులోనూ కళల నేపథ్యంలో మరిన్ని సినిమాలు చేస్తా’’ అన్నారు ప్రముఖ కూచిపూడి

Updated : 21 Oct 2021 08:16 IST

‘‘పదేళ్ల వయసులోనే నా జీవితాన్ని కళలకి అంకితం చేయాలని నిర్ణయించుకున్నా. ప్రేక్షకుల ప్రోత్సాహం దక్కితే భవిష్యత్తులోనూ కళల నేపథ్యంలో మరిన్ని సినిమాలు చేస్తా’’ అన్నారు ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి, నటి సంధ్యారాజు. ఆమె ప్రధాన పాత్రధారిగా నటిస్తూ, స్వయంగా నిర్మించిన చిత్రం ‘నాట్యం’. రేవంత్‌ కోరుకొండ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సంధ్యారాజు బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

‘‘చిన్నప్పట్నుంచి నాకు నాట్యం అంటే ప్రాణం. రోజూ ఉదయం లేవగానే నాకు నాట్యం గురించి తప్ప మరో ఆలోచన ఉండదు. ఈ కళ కోసం ఏం చేయొచ్చు? ఇంకా ఎక్కువ మందికి ఎలా చూపించొచ్చు? అనే ఆలోచిస్తుంటా. ఇంకా ఎక్కువ మందికి నాట్య కళని చేరువ చేయొచ్చనే అభిప్రాయంతో ఈ సినిమా చేశా. వెయ్యికిపైగా నాట్య ప్రదర్శనలు చేశా. ఎప్పుడూ కొంత మంది ప్రేక్షకులకే పరిమితం అవుతున్నామేమో, చూసినవాళ్లే మళ్లీ చూస్తున్నారేమో అనిపిస్తుంటుంది. ‘నాట్యం’ పేరుతోనే ఓ లఘు చిత్రం చేశాం. అది చాలా మందికి చేరువైంది. ఎంతోమంది ఫోన్‌ చేసి మాలోని స్ఫూర్తిని రగిలించిందని చెప్పారు. అప్పుడు అర్థమైంది సినిమా మాధ్యమానికి ఉన్న శక్తి ఏమిటో! అందుకే ‘నాట్యం’ పేరుతోనే ఈ చిత్రం తీశాం. లఘు చిత్ర కథకీ, ఈ సినిమాకీ ఎలాంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా వేరే కథతో తెరకెక్కింది. నటిగానే కాకుండా నిర్మాతగా, కొన్ని పాటలకి నృత్య దర్శకురాలిగా వ్యవహరించా. ఇన్ని బాధ్యతలు చూసుకోవడం కష్టంగా అనిపించింది. అన్నిటికంటే థియేటర్‌ వరకు సినిమాని తీసుకు రావడం ఇంకా కష్టంగా అనిపించింది’’. 


‘‘మా గురువుగారు వెంపటి చినసత్యం. ఆయన్ని చూసి, ఎలా నేర్పిస్తున్నారో చూసి, ఆయన చేసిన డ్యాన్స్‌ డ్రామాలు, బాలేస్‌ చూసి ఎంతో స్ఫూర్తి పొందా. ఏం చేస్తున్నా నా మనసు మాత్రం నృత్యంలోనే ఉండిపోయింది. ఇది మన సంస్కృతి, మన సంస్కారం అనే గర్వంతో ఇంట్లోవాళ్లు ప్రోత్సహించారు. పెళ్లి వరకూ ఇది నేనొక హాబీలాగే తీసుకున్నా అనుకున్నారు. పెళ్లి తర్వాత నృత్యం పరంగా నేనెంత సీరియస్‌గా ఉన్నానో అర్థమైంది. నా భర్త, మా అత్తమామలు అర్థం చేసుకుని వెన్నుతట్టారు’’.


‘‘సినిమా అనగానే వాణిజ్యాంశాలే గుర్తుకొస్తాయి. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఓ విభిన్నమైన కథనంతో తీర్చిదిద్దాం. అంతర్లీనంగా ఇందులో మూడు కథలు ఉంటాయి. గురుశిష్యుల మధ్య బంధంతోపాటు, క్లాసికల్‌ - వెస్ట్రన్‌ డ్యాన్స్‌ మధ్యనున్న సారూప్యతలు ఏమిటి? అలాగే నాట్యం అనే ఓ ఊరు, అందులోని ప్రజలమధ్యనున్న నమ్మకాలు, వాళ్లలో మార్పుని ఆవిష్కరిస్తూ ఈ చిత్రం సాగుతుంది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సర్‌ కోసం దిల్లీలో ప్రత్యేకంగా ప్రదర్శన ఏర్పాటు చేశాం. అనారోగ్య కారణాలవల్ల ఐదు నిమిషాలే సినిమాని చూస్తానని చెప్పారు. కానీ ఆయన సినిమా పూర్తయ్యేవరకు చూసి నన్ను ఆయన కార్యాలయానికి తీసుకెళ్లి భారతీయ జెండా ముందు నిలబెట్టి ప్రత్యేకంగా సత్కరించారు. పుస్తకం కానుకగా ఇచ్చారు’’.  

భవిష్యత్తులోనూ కళల నేపథ్యంలో సినిమాలు చేస్తా. ఇతరత్రా సినిమాల్లో అవకాశాలు వచ్చినా నటిస్తా. కాకపోతే ఆ పాత్రలో ప్రత్యేకత ఉండాలి, అంతే కానీ డబ్బే ధ్యేయంగా నటించను. ఫలానా హీరోతో చేస్తే మార్కెట్‌ పెరుగుతుందనే లెక్కలతో చేయను. మలయాళంలో ‘యూ టర్న్‌’ రీమేక్‌లో నటించా. కానీ అది అంతగా మెప్పించలేదు. ఆ తర్వాత ‘నాట్యం’పై దృష్టిపెట్టా. సినీ పరిశ్రమ గురించి బయట రకరకాలుగా మాట్లాడుకుంటారు.  మంచి కథతో, మంచి ప్రయత్నంతో వస్తే తప్పకుండా ప్రోత్సాహం దక్కుతుందనే విషయం ‘నాట్యం’తో నాకు అర్థమైంది. చిరంజీవి, రామ్‌చరణ్‌తోపాటు చాలామంది కథానాయకులు మమ్మల్ని ప్రోత్సహించారు’’.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని