Pushpaka Vimanam: అందుకే విజయ్‌ దేవరకొండ ప్రచారం చేశాడు: ఆనంద్‌

‘పుష్పక విమానం’ హీరో ఆనంద్‌ దేవరకొండ ఇంటర్వ్యూ. దామోదర దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబరు 12న విడుదలకానుంది.

Published : 10 Nov 2021 20:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘దొరసాని’, ‘మిడిల్‌క్లాస్‌ మెలొడీస్‌’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి కొత్త అనుభూతి పంచాడు ఆనంద్‌ దేవరకొండ. ప్రముఖ నటుడు విజయ్‌ దేవరకొండ సోదరుడిగా ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘పుష్పక విమానం’తో నవ్వులు పంచేందుకు సిద్ధమయ్యాడు. దామోదర తెరకెక్కించిన చిత్రమిది. గీత్‌ షైనీ, శాన్వీ మేఘన కథానాయికలు. కింగ్ అఫ్ ది హిల్, టాంగా ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రం నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఆనంద్‌ మీడియాతో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.

పరువు పోతుందని..

ఈ చిత్ర దర్శకుడు దామోదర, మా అన్నయ్య (విజయ్ దేవరకొండ) స్నేహితులు. అలా నాకు ఈ కథ వినిపించారాయన. ముందుగా ఈ సినిమాలో నటించేందుకు సందేహించా. ఎందుకంటే.. ఈ కథలో పెళ్లయిన కొన్ని రోజులకే కథానాయకుడి భార్య అతన్ను వదిలేసి ఎక్కడికో వెళ్లిపోతుంది. ఇలాంటి పాత్రని ప్రేక్షకులు అంగీకరిస్తారా? అనుకున్నా. టెస్ట్‌ షూట్ అయిన తర్వాత కొంత నమ్మకం వచ్చింది. దామోదరకి ఇది తొలి సినిమానే అయినా చాలా క్లారిటీతో తెరకెక్కించారు. నటుడిగా ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాను. ట్రైలర్‌లో కామెడీ మాత్రమే కనిపించింది. సినిమాలో కామెడీతోపాటు ఎమోషన్‌ కూడా ఉంటుంది. ఈ సినిమా ద్వారా వివాహబంధం గురించి గొప్పగా చెప్పబోతున్నాం.

చిట్టిలంక సుందర్‌ కథ ఇది..

ఈ సినిమాలో నేను చిట్టిలంక సుందర్‌ అనే పాత్ర పోషించా. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కనిపిస్తా. పెళ్లి గురించి ఎన్నో ఊహించుకుంటా. తీరా వివాహమయ్యాక నా ఆశలన్నీ అడియాసలవుతాయి. భార్య వదిలేసి వెళ్లిపోతుంది. పరువు పోతుందనే ఉద్దేశంతో పోలీసులకు ఫిర్యాదు ఇవ్వకుండా తనెక్కడికి వెళ్లిందో నేనే ఆరా తీస్తా. ఈ క్రమంలో నాకు చెప్పలేనంత కోపం వస్తుంది. చూసే ప్రేక్షకులకు నాపై జాలి కలుగుతుంది. మరి నా భార్య నన్నొదిలి ఎందుకు వెళ్లిపోయింది? ఆమెను వెతికి పట్టుకున్నానా? సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. నేను చాలా సైలెంట్‌గా కనిపిస్తే, శాన్వీ చాలా హుషారుగా కనిపిస్తుంది. సునీల్‌ పోలీస్‌ అధికారిగా నవ్విస్తూ భయపెడతారు.

ఆయన వల్లే ఎక్కువమందికి చేరువైంది..

నా సినిమా కథల ఎంపికలో విజయ్‌ ప్రమేయం ఉండదు. నేనే స్టోరీని సెలెక్ట్‌ చేసుకుంటుంటా. అలా నేను చేసిన ‘పుష్పక విమానం’ చిత్రం అన్నయ్యకు బాగా నచ్చింది. అందుకే తనెంత బిజీగా ఉన్నా ఈ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు ప్రచారంలో పాల్గొన్నాడు. ఈ సినిమా ఈవెంట్‌కు వచ్చిన ప్రముఖ నటుడు అల్లు అర్జున్ అన్నకు మరోసారి థాంక్స్ చెబుతున్నా. ఆయన సపోర్ట్‌ వల్ల మా చిత్రం ఎక్కువమందికి రీచ్‌ అయింది.

ఓటీటీకి వెళ్తుందేమో అనుకున్నా..

రొటీన్‌కి భిన్నంగా సాగాలనేది నా లక్ష్యం. హీరోయిజం కాకుండా నటనకు ప్రాధాన్యమున్న కథలవైపే మొగ్గుచూపుతున్నా. నా తొలి సినిమా ‘దొరసాని’ సమయంలో అంత అవగాహన లేదు. సినిమా అనుకున్నంత విజయం అందుకోలేదు. అయినా ఓ మంచి ప్రయత్నం చేశాననుకుంటున్నా. రెండో సినిమా ‘మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌’పై ముందు నుంచే నమ్మకం ఉంది. ప్రేక్షకులకి బాగా నచ్చింది. కొవిడ్‌ మహమ్మారి కారణంగా ఓటీటీలోనే విడుదలైందా చిత్రం. ‘పుష్పక విమానం’కి అదే పరిస్థితి ఏర్పడుతుందేమోననుకున్నా. కానీ, దర్శకనిర్మాతలు ఎంత ఆలస్యమైనా థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టుగానే చేస్తున్నారు. అందుకు చాలా సంతోషంగా ఉంది.

తదుపరి చిత్రాలు..

కేవీ గుహన్‌ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నా. సాయి రాజేశ్ అనే దర్శకుడితో ఓ చిత్రం చేస్తున్నా. ఈ రెండు చిత్రాల్లోనూ చాలా సహజమైన పాత్రల్నే పోషిస్తున్నా. 

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు