Akhanda: నన్ను అంకుల్‌ అని పిలవడం నచ్చలేదు: బాలకృష్ణ

తాను హీరోగా నటించిన ‘అఖండ’ చిత్రాన్ని నటుడు బాలకృష్ణ నగరంలోని ఓ థియేటర్‌లో చూశారు. అనంతరం మీడియాతో ముచ్చటించారు.

Published : 03 Dec 2021 01:37 IST

హైదరాబాద్‌: తాను హీరోగా నటించిన ‘అఖండ’ చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ నగరంలోని ఓ థియేటర్‌లో చూశారు. అనంతరం మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రానికి అఖండ విజయం అందించిన ప్రేక్షకులకు, నా అభిమానులకు ముందుగా కృతజ్ఞతలు. కొత్తదనాన్ని వారు ఎప్పుడూ ఆదరిస్తారనడానికి ఈ చిత్ర విజయమే నిదర్శనం. చిన్నపిల్లలకూ ఈ సినిమా బాగా నచ్చింది. వారు నా దగ్గరకు వచ్చి ‘అంకుల్‌.. సినిమా అద్భుతంగా ఉంది’ అని చెప్పారు. అంతా బాగానే ఉంది కానీ వారు నన్ను అంకుల్‌ అనడం నాకు నచ్చలేదు (నవ్వుతూ). ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇది కేవలం మా విజయం మాత్రమే కాదు చలన చిత్ర పరిశ్రమ విజయం. చిత్ర బృందం సమష్టి కృషి ఇది. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు. ఎన్నో నిజాల్ని ఈ సినిమాలో చూపించాం. చరిత్ర సృష్టించాలన్నా మేమే.. దాన్ని తిరగరాయాలన్నా మేమే. ‘లెజెండ్‌’ సినిమాకి పనిచేస్తున్నప్పుడు ‘సింహా’ గురించి ఆలోచించలేదు. ‘అఖండ’ చిత్రానికి పనిచేస్తున్న సమయంలో ‘లెజెండ్‌’ గురించి ఆలోచించలేదు. పనిలో దేవుడున్నాడు. అందుకే పనినే మేం నమ్ముతాం’ అని తెలిపారు. బాలకృష్ణతోపాటు చిత్ర దర్శకుడు, సంగీత దర్శకుడు, నిర్మాత తదితరులు ఈ సినిమాను తిలకించారు. 

బాలకృష్ణ హీరోగా ‘సింహా’, ‘లెజెండ్‌’ తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రమిది. ప్రగ్యా జైస్వాల్‌ కథానాయిక. శ్రీకాంత్‌, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమన్‌ సంగీతం అందించారు. ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై రవీందర్‌ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ తొలి ఆట నుంచే మంచి స్పందన అందుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని