Updated : 30 Nov 2021 20:28 IST

sirivennela: ‘సిరివెన్నెల’ మనకిక లేదు.. సాహిత్యానికి ఇది చీకటి రోజు: చిరంజీవి

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి పట్ల నటుడు చిరంజీవి సంతాపం ప్రకటించారు. సామాజిక మాధ్యమాల వేదికగా సిరివెన్నెలతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ‘‘సిరివెన్నెల మనకిక లేదు.. సాహిత్యానికి ఇది చీకటి రోజు’ అని భావోద్వేగానికి గురయ్యారు.

‘‘సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఆస్పత్రిలో చేరేముందు ఆయనతో మాట్లాడా. తన ఆరోగ్యం బాగోలేదని తెలిసి మద్రాసులో ఓ మంచి హాస్పిటల్‌ ఉందని, అక్కడకు ఇద్దరం కలిసి వెళ్దామన్నా. ‘మిత్రమా.. ఈరోజు ఇక్కడ జాయిన్‌ అవుతా. నెలాఖరులోపు వచ్చేస్తా. అప్పటికీ ఉపశమనం పొందకపోతే నువ్వు చెప్పినట్టుగానే అక్కడి వెళ్దాం’ అని అన్నారు. అలా వచ్చేస్తానని వెళ్లిన మనిషి ఈ విధంగా జీవంలేకుండా వస్తారని ఊహించలేదు. చాలా బాధాకరమైన విషయం ఇది. ఆయనకు అన్ని రకాల మెరుగైన వైద్యం అందివ్వాలనే ఉద్దేశంతో ఆరోజు ఆయనకు ఫోన్‌ చేస్తే ఎంతో హుషారుగా మాట్లాడారు. అంత ఉత్సాహంగా దాదాపు 20 నిమిషాలపాటు మాట్లాడటంతో కచ్చితంగా ఆయనకు ఏం జరగదనుకున్నా. అదే సమయంలో వారి కుమార్తెతోనూ మాట్లాడా. నాతో మాట్లాడిన తర్వాత సిరివెన్నెల చాలా ఉత్సాహంగా ఉన్నారని ఆమె తెలిపారు. వారి కుటుంబ సభ్యులు నన్నెంతగా అభిమానిస్తున్నారో చెప్పారు. సిరివెన్నెల నేనూ ఒకే వయసు వాళ్లం. ఎప్పుడు కలిసినా చాలా ఆప్యాయంగా మిత్రమా అంటూ పలకరించేవారు’’.

‘‘తెలుగు సినీ కళామతల్లికి ఎనలేని సేవలు అందించారు. వేటూరిగారి తర్వాత అంత గొప్ప రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఆయన భాషను అర్థం చేసుకోవడానికి మనకున్న పరిజ్ఞానం సరిపోదు. అంతటి మేధావి ఆయన. తన కెరీర్లో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న ఆయనకు 2019లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని అందించిన రోజు నేను వారింట్లోనే చాలా సేపు గడిపా. ఓ బంధువుని, చాలా దగ్గరి ఆత్మీయుడ్ని కోల్పోయినట్టే అనిపిస్తోంది. గుండె తరుక్కుపోతుంది. గుండెంతా బరువెక్కిపోతోంది. తెలుగు సినీ పరిశ్రమలో ఆయన స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరు. ఎంతో మందిని శోక సంద్రంలో ముంచి దూరమైన ఆయన మనందరికీ, సాహిత్యలోకమంతటికీ అన్యాయం చేశారు. ముఖ్యంగా మాలాంటి మిత్రులకు అన్యాయం చేసి వెళ్లిపోయారు’’.

‘‘నేను నటించిన చిత్రం ‘రుద్రవీణ’లో ‘తరలిరాద తనే వసంతం.. తన దరికిరాని వనాల కోసం’ అంటూ ఓ పాట రాశారు. ఇప్పుడు ఆయనే మనందరినీ వదిలి వెళ్లిపోయారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, సిరివెన్నెలగారు ఇలా అర్థాంతరంగా వెళ్లిపోవడం చిత్ర పరిశ్రమకు ఎవరూ పూరించలేని లోటు. భౌతికంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి దూరమయ్యారు. కానీ, తన పాటలతో ఆయన ఇంకా బతికే ఉన్నారు. తన పాట బతికున్నంతకాలం సిరివెన్నెల సీతారామశాస్త్రి బతికే ఉంటారు. ఆయన సాహిత్యంలో శ్రీశ్రీ గారి పదును కనపడుతుంది. ఈ సమాజాన్ని మేలుకొల్పే శక్తి ఉంటుంది. ఈ సమాజంలోని తప్పును ఎత్తి చూపేలా చేస్తుంది. సమాజానికి పట్టిన కుళ్లును కడిగిపారేసేలా చేస్తుంది. అంతటి పవర్‌ ఆయన సాహిత్యంలోనే కాదు ఆయన మాటల్లో, ఆయన కలంలో, ఆయన మనసులో ఉంటుంది. అలాంటి గొప్ప వ్యక్తి, గొప్ప కవి మళ్లీ మనకు తారసపడటం కష్టమే. ఆయన సరస్వతీ దేవి ఒడిలో సేద తీరుతున్నట్లుగా అనిపిస్తుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’.

 

Read latest Cinema News and Telugu News

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని