Mohan Babu: రాయలసీమవాడివి.. భాష తెలియదు అన్నారు..!

‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన మోహన్‌ బాబు పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Updated : 23 Sep 2021 02:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాయలసీమ ప్రాంతానికి చెందిన తనకి భాష తెలియదన్నారని ప్రముఖ నటుడు మోహన్ బాబు గత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు. ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి, పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ షో 250వ ఎసిసోడ్‌కి చేరుకుంది. ఎంతో ప్రత్యేకమైన ఈ ఎపిసోడ్‌ సెప్టెంబరు 27న ప్రసారంకానుంది. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఆ సంగతులేంటంటే..

‘ఆలీ.. గతాన్ని నెమరువేసుకుంటుంటే తెలియని దుఃఖం వస్తుంది’ అంటూ మోహన్‌ బాబు భావోద్వేగానికి గురయ్యారు. తన తల్లికి చెవులు వినిపించవని, అయినా తమ (ఐదుగురు తోబుట్టువులు)కి ఏ కష్టం కలగకుండా పెంచారని తెలిపారు. ప్రముఖ నటులు కృష్ణతో ఉన్న పరిచయం, చిరంజీవితో ఉన్న స్నేహాన్ని వివరించారు. ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌వర్మని మెచ్చుకున్నారు. తాను నటిస్తోన్న ‘సన్నాఫ్‌ ఇండియా’ చిత్రంలోని పవర్‌ఫుల్‌ డైలాగ్‌ చెప్పి అలరించారు. ధ్రువపత్రాల్లో కులం అనే కాలాన్ని తొలగించిన తొలి భారతీయుడినని పేర్కొన్నారు.

‘నటుడవుతానని అనుకున్నా. కానీ, ఇన్నేళ్లు ఉంటానని అనుకోలేదు. నా తొలి సినిమా ‘స్వర్గం నరకం’. భక్తవత్సలం నాయుడు అయిన నన్ను మోహన్‌బాబుగా దాసరి నారాయణరావు మార్చారు. నటనలో నాకు అన్నగారు (ఎన్టీఆర్‌) స్ఫూర్తి’ అని తెలిపారు. అనంతరం ‘మీ డిక్షన్‌ బాగుంటుంది. ఇది పుట్టుకతో వచ్చిందా? ఎవరైనా నేర్పించారా’ అని ఆలీ ప్రశ్నించగా ‘రాయలసీమవాడివి.. నీకు భాష తెలియదు అన్నారు. అన్నగారి సినిమాలు చూసి, కొన్నిచోట్ల చదువుకుని ఎస్‌.. నాకు భాష తెలుసు అని నిరూపించా’ అన్నారు. మరి అలా అన్నదెవరు? మోహన్‌ బాబు ఇంకా ఏం విశేషాలు చెప్పారు? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని