Sai Dharam Tej: సాయిధరమ్‌ తేజ్‌ ప్రమాదంపై మరోసారి స్పందించిన నరేశ్‌

సినీ నటుడు సాయిధరమ్‌ తేజ్‌ ప్రమాదంపై సీనియర్‌ నటుడు నరేశ్‌ మరోసారి స్పందించారు. బైక్‌ రేసింగ్‌ విషయాన్ని ప్రస్తావిస్తూ నరేశ్‌ ఈరోజు ఉదయం ఓ వీడియో విడుదల చేశారు.

Published : 12 Sep 2021 01:08 IST

హైదరాబాద్‌: సినీ నటుడు సాయిధరమ్‌ తేజ్‌ ప్రమాదంపై సీనియర్‌ నటుడు నరేశ్‌ మరోసారి స్పందించారు. బైక్‌ రేసింగ్‌ విషయాన్ని ప్రస్తావిస్తూ నరేశ్‌ ఈ రోజు ఉదయం ఓ వీడియో విడుదల చేశారు. దీనిపై విమర్శలు రావడంతో తాజాగా మరోసారి వివరణ ఇస్తూ సాయంత్రం వీడియో విడుదల చేశారు. ‘‘నేను ఉదయమే సాయితేజ్‌ గురించి ప్రార్థించాను. చాలా ఫాస్ట్‌గా రికవరీ అవుతున్నాడు. త్వరలో సాధారణ స్థితికి వస్తాడు. నేను వీడియోలో స్పష్టంగా చెప్పాను. వీళ్లిద్దరూ కలిసి బయలుదేరిన మాట వాస్తవమే.. కానీ, ఇద్దరూ ఓ చాయ్‌ దుకాణం ప్రారంభోత్సవానికి వెళ్లారు. ఆ తర్వాత ఎవరికి వారు తిరిగి వస్తున్నప్పుడు రోడ్డుపై ఉన్న మట్టి కారణంగా జారి ప్రమాదానికి గురయ్యాడు. ఆ సమయంలో 60-70 కిలోమీటర్ల స్పీడ్‌లో ఉన్నట్టు సీసీ టీవీ ఫుటేజీ చూస్తే తెలుస్తోంది. ఇది నిర్లక్ష్యం కాదు.. కేవలం ప్రమాదం మాత్రమే. ప్రమాదాలు జరుగుతుంటాయి. బిడ్డలు బాగుండాలని కోరుకుంటాం తప్ప మరో ఆలోచన లేదు. సాయితేజ్‌ క్షేమంగా బయటపడినందుకు చాలా సంతోషంగా ఉంది. తర్వగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’’ అని నరేశ్‌ వీడియోలో తెలిపారు. 

ఉదయం విడుదల చేసిన వీడియోలో నరేశ్‌ ఏమన్నారంటే...
‘సాయిధరమ్‌ తేజ్‌ నా బిడ్డలాంటివాడు. తను కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. నా కుమారుడు నవీన్‌ విజయ కృష్ణ-సాయి మంచి స్నేహితులు. అన్నదమ్ముల్లా ఉంటారు. నిన్న సాయంత్రం వాళ్లిద్దరూ ఇక్కడి నుంచే బయలుదేరారు. బైక్‌పై స్పీడ్‌గా వెళ్లొద్దని చెప్పాలనుకుని బయటకు వచ్చేసరికే.. వాళ్లు బయలుదేరిపోయారు. నాలుగు రోజుల క్రితం కూడా వీళ్లిద్దరికీ కౌన్సెలింగ్‌ ఇవ్వాలనుకున్నాను. కానీ కుదరలేదు. పెళ్లి-కెరీర్‌తో జీవితంలో సెటిల్‌ కావాల్సిన వయసు ఇది. ఇలాంటి సమయంలో ఈ విధమైన రిస్క్‌లు తీసుకోకుండా ఉండటమే మంచిది. గతంలో నేను కూడా బైక్‌ డ్రైవింగ్‌కు వెళ్లి ప్రమాదానికి గురయ్యాను. మా అమ్మ ఒట్టు వేయించుకోవడంతో ఆనాటి నుంచి బైక్స్ జోలికి పోలేదు. ఆస్పత్రికి వెళ్లి పరామర్శించాలనుకున్నాను. కాకపోతే పరిస్థితుల దృష్ట్యా అక్కడికి వెళ్లలేకపోతున్నాను. త్వరలోనే కలుస్తాను’ అని నరేశ్‌ వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని