Naga Shourya: తొమ్మిది రోజులు నీళ్లు తాగలేదు

‘నేను ఏ కథ విన్నా.. నటుడిగా నా వైపు నుంచి వందశాతం ఇవ్వాలనుకుంటా. ప్రతి సినిమాకీ ఓ కొత్త నాగశౌర్యను చూపించాలనుకుంటా’’ అన్నారు కథానాయకుడు నాగశౌర్య. వైవిధ్యభరిత కథలకు చిరునామాగా నిలిచే ఆయన.. ఇటీవలే ‘వరుడు కావలెను’ సినిమాతో

Updated : 10 Dec 2021 10:58 IST

‘‘నేను ఏ కథ విన్నా.. నటుడిగా నా వైపు నుంచి వందశాతం ఇవ్వాలనుకుంటా. ప్రతి సినిమాకీ ఓ కొత్త నాగశౌర్యను చూపించాలనుకుంటా’’ అన్నారు కథానాయకుడు నాగశౌర్య. వైవిధ్యభరిత కథలకు చిరునామాగా నిలిచే ఆయన.. ఇటీవలే ‘వరుడు కావలెను’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు. ఇప్పుడు ‘లక్ష్య’గా వినోదాలు పంచేందుకు సిద్ధమయ్యారు. సంతోష్‌ జాగర్లమూడి తెరకెక్కించిన చిత్రమిది. కేతిక శర్మ కథానాయిక. ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు నాగశౌర్య. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..

మళ్లీ ఆ విద్యను గుర్తు చేద్దామని..

‘‘ఆర్చరీ మనకు తెలియంది కాదు. పురాణాల నుంచి చూస్తూనే ఉన్నాం. మన వీరుల చేతుల్లో విల్లు ఉంటుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోనూ రామ్‌చరణ్‌ బాణంతో కనిపించారు. మనం అన్నింటినీ ఆటలు అంటాం కానీ, ఒక్క ఆర్చరీనే విలువిద్య అని అంటాం. దాన్ని ఓ గొప్ప విద్యగా గౌరవిస్తాం. అయితే మన వాళ్లు దాన్ని మరచిపోతున్నారు. అందుకే ఆ విద్యను గుర్తు చేద్దామని ఈ సినిమా తీశాం’’.  
ఆర్చరీ అనుకున్నంత సులువు కాదు.. ‘‘ఏ ఆటైనా సరే ప్రొఫెషనల్‌గా వెళ్లాలంటే చాలా కష్టమే. అయితే ఈ సినిమా కోసం విలువిద్యలో కొన్నిరోజులు శిక్షణ తీసుకున్నా. ఆర్చరీ అంటే అంత కష్టమేముంది అనుకుంటారు కానీ, 35 కేజీల బరువును వెనక్కి లాగడం మామూలు విషయం కాదు. ఎన్నో గాయాలవుతుంటాయి. సినిమాలో పార్థు మారాడు అని చెప్పడానికే శరీరాకృతిలో మార్పులు చూపించాను. ఇందుకోసం ప్రత్యేకంగా ఎయిట్‌ ప్యాక్‌ చేశా. శరీరంలో నీరు నిల్వ తక్కువగా ఉన్నప్పుడే కండరాలు అలా స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే ఈ సినిమాలో ఎయిట్‌ ప్యాక్‌ లుక్‌తో కనిపించే సన్నివేశాల కోసం దాదాపు తొమ్మిది రోజులు నీళ్లు ముట్టుకోలేదు’’.


‘‘ప్రస్తుతం మా ఐరా ప్రొడక్షన్స్‌లో ఓ సినిమా చేస్తున్నాను. ఇందులో బ్రాహ్మణ కుర్రాడిగా కనిపిస్తాను. అవసరాల శ్రీనివాస్‌తో ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ చిత్రం చేస్తున్నా. నా మనసుకు ఎంతో దగ్గరైన సినిమా అది.’’


‘‘గత లాక్‌డౌన్‌లో పెళ్లి పెళ్లి అంటూ ఇంట్లో చంపేశారు. ఇంకోసారి లాక్‌డౌన్‌ వస్తే తప్పకుండా పెళ్లి చేసుకుంటా. అలాగని లాక్‌డౌన్‌ రావాలనైతే కోరుకోవడం లేదు (నవ్వుతూ)’’.


‘సై’ స్ఫూర్తితోనే...

‘‘దేశంలోనే ఆర్చరీ నేపథ్యంలో వస్తున్న తొలి చిత్రమిది. ఈ విషయంలో నాకు ‘సై’ సినిమానే స్ఫూర్తి. ఇక్కడ ఎవరికీ తెలియని ఆ ఆటను తీసుకొని.. వాణిజ్యాంశాలు మేళవించి అద్భుతంగా చూపించారు రాజమౌళి. ఆ స్ఫూర్తితోనే కొత్తదనం చూపించేందుకు ఈ సినిమా చేశాం. ఇందులో నేను పార్థు అనే పాత్రలో కనిపిస్తాను. ప్రపంచానికి తానేంటో చూపించాలన్న బలమైన కోరిక ఉంటుంది. మరి దీనికోసం ముందుగా తనలోని చెడును ఎలా గెలిచాడు.. చివరకు ప్రపంచాన్ని ఎలా గెలిచాడు? అన్నదే ‘లక్ష్య’ కథ’’.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని