Published : 25/11/2021 23:50 IST

Akhanda: ‘అఖండ’ విలన్‌ పాత్ర విని భయపడ్డా: శ్రీకాంత్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: దర్శకుడు బోయపాటి శ్రీను చిత్రాల్లో విలన్‌ పాత్రకు ఓ ప్రత్యేకత ఉంటుంది. హీరోకి సమానమైన పాపులారిటీ వస్తుంది. అందుకే కథానాయకులూ ఆయన చిత్రాల్లో ప్రతినాయకుడిగా కనిపించేందుకు సిద్ధమవుతుంటారు. అలా శ్రీకాంత్‌ ‘అఖండ’ సినిమాలో విలన్‌గా నటించారు. ప్రేక్షకుల స్పందన కోసం ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రమిది. ప్రగ్యా జైస్వాల్‌ కథానాయిక. జగపతిబాబు, పూర్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ మీడియాతో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

అలా మొదలైంది..

నా కెరీర్‌ ప్రారంభంలో విలన్‌ పాత్రలు పోషించాను. తర్వాత హీరో అయ్యాను. ఒకానొక దశలో మళ్లీ ప్రతినాయకుడిగా మారాను. దీన్ని గమనించిన దర్శకుడు బోయపాటి శ్రీను ‘మీరు ఏది పడితే అది చేయకండి’ అని సూచించారు. ఇది చెప్పిన కొన్నాళ్లకు.. ఆయన దర్శకత్వం వహించిన ‘సరైనోడు’ చిత్రంలో నాకో మంచి పాత్ర ఇచ్చారు. ఆ సినిమా, నా పాత్ర ప్రేక్షకుల్ని మెప్పించింది. ఆ తర్వాత ‘మీ కోసం నెగెటివ్ క్యారెక్టర్‌ రాస్తా.. నటిస్తారా?’ అని అడిగారు. తప్పకుండా నటిస్తా. నేనక్కడి నుంచే కదా వచ్చింది అని బదులిచ్చా. చెప్పినట్టుగానే ‘అఖండ’ చిత్రంలోని విలన్‌ పాత్రలో నటించే అవకాశం ఇచ్చారు.

అది ప్రేక్షకుల నిర్ణయం..

వరదరాజులు అనే ఈ పాత్ర తీరుని వినగానే భయపడ్డా. బోయపాటి శ్రీను- బాలకృష్ణ కాంబినేషన్‌లో విలన్‌ ఎలా ఉంటాడో తెలిసిందే కదా. ఇందుకు నేను న్యాయం చేయగలనా? అని ముందుగా సందేహించా. తర్వాత ధైర్యంతో ముందడుగేశా. పాత్రలో క్రూరత్వం కనిపించేందుకు వివిధ రకాల లుక్స్‌ ప్రయత్నించాం. అవేవీ సెట్‌ కాలేదు. చివరకు సింపుల్‌గా ఉంటేనే బెటర్‌ అనుకున్నాం. అలా గుబురు గడ్డంతో నటించా. నాకు తెలిసిన చాలామంది గెటప్‌ బాగుందని ప్రశంసించారు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కిన ‘లెజెండ్’ సినిమా నటుడిగా జగపతిబాబుని ఓ స్థాయికి తీసుకెళ్లింది. ‘అఖండ’ ద్వారా నాకూ అంతటి పేరొస్తుందని నేను అంచనా వేయను. ఎందుకంటే అది ప్రేక్షకుల నిర్ణయం.

బాలకృష్ణ సలహాలు..

బాలకృష్ణతో కలిసి గతంలో ‘శ్రీరామరాజ్యం’ సినిమాలో నటించా. అందులో ఆయన సోదరుడిగా లక్ష్మణ పాత్రలో కనిపించా. ‘అఖండ’లో రావణాసురుడిని పోలిన పాత్రలో కనిపిస్తా. బాలకృష్ణతో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరంగా ఎప్పుడూ ప్రోత్సాహిస్తుంటారు. ‘శ్రీకాంత్‌ పాత్ర చాలా బాగా రావాలి. అప్పుడే నా పాత్ర అద్భుతంగా వస్తుంది’ అని దర్శకుడికి సూచించేవారు. ‘ఈ సినిమా విడుదలయ్యాక నీకు వరుస అవకాశాలొస్తాయి. అన్నింటికీ ఒకే చెప్పకు’ అని నాకు సలహాలిచ్చేవారు.

అవన్నీ ఉన్నాయి..

బాలకృష్ణ అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ముఖ్యంగా సంభాషణలు విశేషంగా అలరిస్తాయి. ప్రకృతితో సంబంధమున్న కథని డీల్‌ చేయడం చాలా కష్టం. కానీ, బోయపాటి శ్రీను చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా కోసం మేమంతా చాలా శ్రమించాం. ఓ పోరాట సన్నివేశం కోసం బాలకృష్ణ నేనూ తొమ్మిది రోజులు మైనింగ్‌ ప్రాంతంలో కష్టపడ్డాం. అది ఎప్పటికీ మర్చిపోలేను.

ఇతర ప్రాజెక్టులు..

కన్నడ నటుడు దివంగత పునీత్‌ రాజ్‌కుమార్‌ హీరోగా చేసిన ఓ సినిమాలో విలన్‌గా నటించా. శంకర్‌, రామ్‌ చరణ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నా. 

Read latest Cinema News and Telugu News


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్