అండర్‌లైన్‌ చేసుకోండి.. నేను రొటీన్‌ సినిమాలు చేయను: సుధీర్‌ బాబు

‘‘నా గత చిత్రం ‘సమ్మోహనం’ ప్రచారాన్ని ప్రముఖ నటుడు చిరంజీవి ప్రారంభించారు. ఆ సినిమా మంచి విజయం అందుకుంది. ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ ప్రమోషనూ ఆయన చేతుల మీదుగానే మొదలైంది. ఇదీ మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అని నటుడు సుధీర్‌ బాబు అన్నారు.  

Published : 22 Aug 2021 21:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘‘నా గత చిత్రం ‘సమ్మోహనం’ ప్రచారాన్ని ప్రముఖ నటుడు చిరంజీవి ప్రారంభించారు. ఆ సినిమా మంచి విజయం అందుకుంది. ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ ప్రమోషనూ ఆయన చేతుల మీదుగానే మొదలైంది. ఇదీ మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అని నటుడు సుధీర్‌ బాబు అన్నారు. కరుణకుమార్‌ దర్శకత్వంలో సుధీర్‌ హీరోగా నటించిన చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్‌’. ఆనంది కథానాయిక. విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ముందస్తు విడుదల వేడుకని చిత్ర బృందం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో సుధీర్‌ మాట్లాడారు. ‘అడిగిన వెంటనే ఈ సినిమాలోని ‘మందులోడా’ పాటని విడుదల చేసిన చిరంజీవి గారికి థ్యాంక్స్‌. ‘సమ్మోహనం’లానే ఈ సినిమా ప్రచారాన్ని ఆయన ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ప్రభాస్‌కీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆయనతో చేసిన ఇంటర్వ్యూ త్వరలోనే మీ ముందుకు వస్తుంది. మర్యాద, మంచితనంతో ప్రభాస్‌ ఎప్పుడూ జనాల్ని చంపేస్తుంటాడు. వారానికోసారి వాళ్లింటికి వెళ్తే చాలు ఫిట్‌నెస్‌, సిక్స్‌ప్యాక్‌ అంటూ ఏం ఉండవు. అన్నీ ఫట్టే.  ట్రైలర్‌ విడుదల చేసిన మహేశ్‌ బాబుకి థ్యాంక్స్‌ చెప్పి ఆయన్ను దూరం చేసుకోవాలనిపించట్లేదు.

సినిమా విషయానికొస్తే.. దర్శకుడు కరుణ కుమార్ బలమున్న కథల్నే చెబుతుంటారు. ఆయన తొలి చిత్రం ‘పలాస’ ట్రైలర్‌ లాంటిది. అసలైన బొమ్మ  ‘శ్రీదేవి సోడా సెంటర్’. పండగలాంటి సినిమా ఇది. ఈ చిత్రంతో థియేటర్ల దగ్గర జాతర మళ్లీ మొదలవుతుందనుకుంటున్నా. ట్రైలర్‌ విడుదలయ్యాక ఆ కథలా ఉంది, ఈ సినిమాల ఉంది అని కొంతమంది అన్నారు. అండర్‌లైన్ చేసుకోండి... సుధీర్‌ రొటీన్‌ సినిమాలు చేయడు. అభిమానులంతా కాలర్‌ ఎగిరేసేలా ఈ సినిమా ఉంటుంది. నిర్మాతలు విజయ్‌, శశి ఇప్పటికే తమని తాము నిరూపించుకున్నారు. ఈ సినిమాకి మణిశర్మగారు మంచి సంగీతం అందించారు. ఆయనతో పనిచేయడం మంచి అనుభూతి పంచింది. కథానాయిక ఆనంది మీ అందరినీ మెప్పిస్తుంది’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకులు అనిల్‌ రావిపూడి, బుచ్చిబాబు, నటుడు కార్తికేయ తదితరులు పాల్గొన్నారు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని