Suriya: మరోసారి ఉదారత చాటుకున్న సూర్య.. రియల్‌ ‘చిన్నతల్లి’కి ఆర్థిక సాయం

వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల జీవితగాథల్ని ప్రేక్షకులకి పరిచయం చేస్తూ స్ఫూర్తినివ్వడంలో నటుడు సూర్య ఎప్పుడూ ముందుంటారు.

Published : 15 Nov 2021 16:51 IST

చెన్నై: వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల జీవితగాథల్ని ప్రేక్షకులకి పరిచయం చేస్తూ స్ఫూర్తినివ్వడంలో నటుడు సూర్య ఎప్పుడూ ముందుంటారు. అలా ఈ ఏడాది ఆయన నటించిన చిత్రం ‘జై భీమ్‌’. తమిళనాడుకు చెందిన జస్టిస్‌ చంద్రు కెరీర్‌లో కీలకంగా నిలిచిన ఓ కేసు ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. త. శె.జ్ఞాన్‌వేల్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలోని మణికందన్‌ (రాజన్న), లిజో మోల్‌ జోసే (చిన్నతల్లి) పాత్రలు ప్రేక్షకుల హృదయాల్ని హత్తుకున్నాయి. చేయని తప్పునకు జైలుపాలై, మరణించిన రాజన్న దుస్థితి ఎవ్వరికీ రాకూడదని చిన్నతల్లి చేసిన పోరాటం కట్టిపడేస్తుంది. నిజజీవితంలో ఆ పోరాటం చేసిన వ్యక్తి పార్వతి అమ్మాళ్‌. ఆమె పరిస్థితి చూసి సూర్య చలించిపోయి ఆర్థిక సాయం అందించారు. ఆమె పేరుమీద రూ.10 లక్షలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి, ఆ మొత్తంపై ప్రతినెలా వచ్చే వడ్డీ ఆమెకు అందేలా చేశారు. ఇంతకుముందు.. గిరిజనుల సంక్షేమానికి సూర్య రూ. కోటి విరాళం అందించిన సంగతి తెలిసిందే. మరోవైపు, నటుడు, కొరియోగ్రాఫర్‌, దర్శకుడు రాఘవ లారెన్స్‌ పార్వతికి అమ్మాళ్‌కు ఇల్లు కట్టిస్తానని ఇటీవల ప్రకటించారు. వాస్తవ సంఘటనల ఆధారిత కథల్లో నటించి, సంబంధిత వ్యక్తులకు సాయం చేస్తున్న సూర్యపై ఆయన అభిమానులు, నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని