Sushanth: ‘ఇచ్చట’ విషయంలో నాకు దక్కిన గొప్ప ప్రశంస అదే..!

నటుడు సుశాంత్‌ ఇంటర్వ్యూ .. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ ..

Updated : 07 Dec 2022 17:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమా ప్రివ్యూ చూసిన అందరూ కొత్త సుశాంత్‌ని చూశామన్నారు. అదే నాకు దక్కిన గొప్ప ప్రశంస’’ అని యువ నటుడు సుశాంత్‌ చెప్పారు. ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో గతేడాది అలరించిన ఆయన ఇప్పుడు ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే చిత్రంతో ప్రేక్షకుల  ముందుకొస్తున్నారు. ఈ చిత్రానికి దర్శన్‌ దర్శకుడు. మీనాక్షి చౌదరి కథానాయిక. ఈ శుక్రవారమే థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో గురువారం విలేకర్లతో సుశాంత్‌ సంభాషించారు.

కొవిడ్‌ వల్ల అది సాధ్యపడలేదు..

‘నూటొక్క జిల్లాల అందగాడు’ దర్శకుడు సాగర్, నిర్మాత హరీశ్‌ ద్వారా దర్శన్‌ పరిచయం అయ్యారు. ‘చి.ల.సౌ’ సినిమా విడుదలకు ముందు దర్శన్ ‘ఇచ్చట’ కథ వినిపించారు. తన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రాసుకున్న కథ ఇది. నాకు చాలా బాగా నచ్చింది. నేను అప్పటి వరకు ఇలాంటి కథ వినలేదు. వాస్తవికతతో కూడిన ఈ చిత్రం మంచి వినోదం పంచుతుంది. కమర్షియల్‌ హంగులూ ఉన్నాయి. ‘చి.ల.సౌ’ తర్వాత ఇదే చేద్దాం అనుకున్నా. కానీ, ‘అల వైకుంఠపురములో’ అవకాశం రావడంతో వెంటనే చేయలేకపోయా. ‘అల వైకుంఠపురములో’, ‘ఇచ్చట వాహనములు’.. రెండూ ఒకే ఏడాది విడుదలవుతాయి అనుకున్నా. కానీ, కొవిడ్‌ వల్ల అది సాధ్యపడలేదు.

అందరూ బాగుందన్నారు..

ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలు వేరు, ఇది వేరు. ఇందులో చాలా కష్టపడి నటించా. కథానాయకుడి పాత్రే కాదు ప్రతి పాత్రకూ ప్రాధాన్యం ఉంటుంది. సినిమా పూర్తయ్యాక సుమారు 50 మందికి ప్రివ్యూ చూపించాం. అందరి నుంచీ మంచి స్పందన లభించింది. ఈ సినిమాలో కొత్త సుశాంత్‌ కనిపించాడు అని అన్నారు. అది నేను ఎప్పటికీ మరిచిపోలేని ప్రశంస.

అనుకున్నట్టుగానే బిజీ అయింది..

ఈ సినిమా టైటిల్‌ విశేషంగా ఆకట్టుకుంది. ముందుగా ఈ కథకి ‘నో పార్కింగ్’ అనే పేరు అనుకున్నాం. కానీ, తెలుగు వారందరికీ అర్థం అవ్వాలని ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అని ఖరారు చేశాం. ముందు అనుకున్న ‘నో పార్కింగ్‌’ను ట్యాగ్‌లైన్‌గా పెట్టాం. సుకుమారన్ తన కెమెరాతో ప్రతి ఫ్రేమ్‌నీ చక్కగా బంధించారు. ప్రవీణ్‌ లక్కరాజు అందించిన సంగీతం అత్యద్భుతం. హీరోయిన్‌ విషయానికొస్తే.. నటి రుహానీ శర్మ చెప్పిన ఓ వర్క్‌ షాప్‌ కోసం ముంబయి వెళ్లా. అక్కడే ఈ సినిమా కథానాయిక మీనాక్షి చౌదరిని తొలిసారి చూశా. ఆమె మిస్‌ ఇండియా అని అప్పుడు నాకు తెలియదు.. నేను నటుడినని ఆమెకు తెలియదు. ఆ వర్క్‌షాప్‌లో ఆమె నటనని చూసి ఫిదా అయిపోయా. వెంటనే తెలుగు సినిమాల్లో అవకాశం వస్తే చేస్తారా? అని అడిగా. తర్వాత చర్చలు జరిగాయి. ఆమె ఎంట్రీ ఖరారైంది. మేం అనుకున్నట్టుగానే ఈ సినిమా విడుదలకు ముందే పలు చిత్రాల్లో నాయికగా ఎంపికై, బిజీగా ఉంది.

వాళ్లిద్దరి నుంచి చాలా నేర్చుకున్నా..

గతంలో నేను నటించిన ‘చి.ల.సౌ’ చిత్రాన్ని అల్లు అర్జున్‌ చూసి, తనకు నచ్చడంతో ఆ చిత్రాన్ని చూడమని దర్శకుడు త్రివిక్రమ్‌కి చెప్పాడు. అలా త్రివిక్రమ్‌ నా నటనని ఇష్టపడి ‘అల వైకుంఠపురములో’ సినిమాలో అవకాశం ఇచ్చారు. ‘కథల ఎంపికలో సొంతగా నిర్ణయం తీసుకో. సినిమా విజయం అందుకున్నా పరాజయం పాలైనా ఫర్వాలేదు’ అని మామయ్య నాగార్జున ఓ సందర్భంలో చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత ఏ అనుమానాలూ లేకుండా నేను ఒప్పుకున్న కథ ‘చి.ల.సౌ’. ఎలాంటి ఒత్తిడీ లేకుండా నటించిన చిత్రమిది. అదే పద్ధతిని ‘అల వైకుంఠపురములో’ అనుసరించా. ఇప్పుడు ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చేశా. ‘అల వైకుంఠపురములో’ చిత్రీకరణ సమయంలో అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా.

మహమ్మారి నేర్పిన పాఠాలు..

కుటుంబం, స్నేహితులు.. మన జీవితంలో ఎంత ముఖ్యమో కొవిడ్‌ మహమ్మారి వల్ల తెలుసుకున్నా. ఒత్తిడి అధిగమించేందుకు లాక్‌డౌన్‌ సమయం నుంచి ధ్యానం చేయడం ప్రారంభించా. పియానో నేర్చుకున్నా. అప్పుడప్పుడు వంటలూ చేశా.

పెళ్లి గురించి ఏం అనుకోలేదు..

అలాంటి అమ్మాయిని చేసుకోవాలని, ఇలాంటి అమ్మాయిని వివాహమాడాలని ఏం అనుకోలేదు. నాకు సరైన జోడీ ఎక్కడో ఓ చోట ఉండే ఉంటుంది. తను కనిపిస్తే చేసుకుంటా. కుటుంబ సభ్యులూ పెళ్లి గురించి నన్ను ఇబ్బంది పెట్టరు.

తదుపరి చిత్రాలు..

చాలా కథలు విన్నాను. వాటిల్లో ఓ కథ బాగా నచ్చింది. ఇప్పుడే దానికి సంబంధించి వివరాలు చెప్పలేను. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని