Cinema News: కాలికి సర్జరీ.. అయినా 20 రోజులు శ్రమించా: తనీశ్‌

యువ నటుడు తనీశ్‌ ఇంటర్వ్యూ. ఆయన నటించిన ‘మరో ప్రస్థానం’ ఈ నెల 24న విడుదల కానుంది.

Updated : 07 Dec 2022 19:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పలు చిత్రాల్లో బాలనటుడిగా కనిపించి, విశేషంగా అలరించిన తనీశ్‌ ‘నచ్చావులే’తో హీరోగా మారాడు. ప్రేమకథలతో మెప్పించాడు. ఇప్పుడు ‘మరో ప్రస్థానం’ అనే ఓ ప్రయోగాత్మక చిత్రంతో కొత్త అనుభూతి పంచనున్నాడు. దర్శకుడు జానీ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబరు 24న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ‘ఈటీవీ- ఈనాడు’తో తనీశ్‌ ప్రత్యేకంగా ముచ్చటించారు. సినిమా గురించి, వ్యక్తిగత విషయాల గురించి తనీశ్‌ ఏమన్నారంటే...

* మీ గత చిత్రాల కంటే ‘మరో ప్రస్థానం’ ఎలా ప్రత్యేకంగా ఉండబోతుంది?

తనీశ్: నేను నటించే ప్రతి చిత్రమూ నాకు ప్రత్యేకమే. ఈ సినిమా సాంకేతికత పరంగా చాలా విభిన్నంగా ఉంటుంది. ఇదొక ప్రయోగాత్మక చిత్రం. సాధారణంగా యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమాలంటే ఏదో ఒక సమస్య, దాన్ని పరిష్కరించే మార్గాలు గుర్తొస్తాయి. అలాంటి కథని ఇప్పటి వరకూ ఎవరూ చూడని విధంగా.. సింగిల్‌ షాట్‌ ఫార్మాట్‌లో దర్శకుడు జానీ తెరకెక్కించారు. అతి చిన్న కెమెరాతో సన్నివేశాల్ని షూట్‌ చేశారు. ఈ విధానంలో నటించడం చాలా కష్టం. కానీ, విజువల్‌గా మాత్రం కొత్త అనుభూతి కలుగుతుంది. మనం వీడియో గేమ్‌ ఆడేటప్పుడు ఎలాంటి ఫీలింగ్‌ ఉంటుందో ఈ సినిమా చూసేటప్పుడు అలాంటి ఫీలింగే ఉంటుంది.

ఈ చిత్రం కోసం ఎలా సన్నద్ధమయ్యారు?

తనీశ్: నా కాలికి శస్త్ర చికిత్స జరగడంతో కొన్నాళ్లు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలోనే దర్శకుడు జానీ ఈ కథని చెప్పారు. విన్న వెంటనే నాకు బాగా నచ్చింది. ఎలాగైనా ఈ చిత్రాన్ని త్వరగా ప్రారంభించాలనుకున్నాం. అలా అనుకున్న పది రోజుల్లోనే ఫైట్‌ రిహార్సల్స్‌కి వెళ్లా. ఇందులో కథానాయకుడి పాత్ర ఏ ఆయుధం లేకుండా చేత్తోనే పోరాటం చేస్తుంది. దానికి తగ్గట్టు 20 రోజులు రిహార్సల్స్ చేశా. ఆ సమయంలో చాలా కష్టమనిపించింది. కన్నీళ్లు వచ్చేవి. సవాలు విసిరే పాత్రలో నటించి, ప్రేక్షకులకి కొత్త అనుభూతి పంచాలంటే ఇలాంటివి తప్పదు అనుకుంటూ ముందుకు సాగా.

ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది?

తనీశ్: ఈ సినిమాలోని ముగ్గురు అమ్మాయిల పాత్రలు మినహా మిగిలినవన్నీ నెగెటివ్‌ పాత్రలే. అందరం గ్యాంగ్‌స్టర్లుగా కనిపిస్తాం. నా పాత్ర విషయానికొస్తే రెండు కోణాలుంటాయి. లోలోపల ఏదో చేయాలనే తపన ఉన్నా బయటికి మరోలా ప్రవర్తించే క్యారెక్టర్‌ నాది. సామాజిక అంశాలు ఈ చిత్రంలో చాలా ఉన్నాయి. ప్రస్తుత సమాజంలో నెలకొన్న టెర్రరిజం, అత్యాచార ఘటనలు తదితర అంశాల్ని ప్రస్తావించాం.

ఈ నెల 24 తర్వాత మీ జీవితం ఎలా మారబోతుంది?

తనీశ్: సినిమా విడుదలైన తర్వాత ఫలితం ఎలా ఉన్నా నేనిదే పరిశ్రమలో కొనసాగుతా. సినిమాలు చేస్తూనే ఉంటా. అనుకున్న ఫలితం వస్తే ఆనందిస్తా. మరింత ఉత్సాహంతో తదుపరి చిత్రాలు చేస్తా. అలా అవకపోతే ఇతర సినిమాలకి ఇంకా కష్టపడతా. విజయం అనేది మేం పడిన కష్టానికి ఓ అవార్డులాంటిది. థియేటర్లకి విచ్చేసి ప్రేక్షకులు ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నా.

మీ కెరీర్‌లో ఎదురయ్యే సమస్యల్ని ఎలా ఎదుర్కొంటారు?

తనీశ్: ఎవరికైనా కుటుంబ సభ్యుల ప్రోత్సాహమే ప్రధాన బలం. పరాజయం అనేది ముగింపు కాదని, ఎవరో ఏదో అన్నంత మాత్రాన నిరూత్సాహపడకూడదని మా నాన్న ఎప్పుడూ చెబుతుంటారు. వీటిని ఫేస్‌ చేసే దానిపైనే మన జీవితం ఆధారపడి ఉంటుంది. మనకొచ్చిన ఆటంకాల్ని అధిగమించినదాన్ని బట్టే మనం చరిత్రలో కలిసిపోతామా? చరిత్రలో మిగిలిపోతామా? అనేది డిసైడ్‌ అవుతుంది. ఈ మాటని నేను బాగా నమ్ముతా. మనిషికి కష్టాలు రాకపోతే సుఖం విలువ ఎలా తెలుస్తుంది!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని