Pushpaka Vimanam: ఒక్కోసారి ఇది అవసరమా అనిపిస్తుంటుంది: విజయ్‌ దేవరకొండ

‘కొత్తవారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నిర్మాతగా ముందడుగేశా. నిర్మాణ పనులు చూసుకోవడం చాలా కష్టమైన పని. ఒక్కోసారి ఇది అవసరమా అనిపిస్తుంటుంది’ అని యువ నటుడు విజయ్‌ దేవరకొండ తన ప్రొడక్షన్‌ హౌజ్‌ గురించి చెప్పారు.

Updated : 30 Aug 2022 15:54 IST

విశాఖపట్నం: ‘కొత్తవారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నిర్మాతగా ముందడుగేశా. నిర్మాణ పనులు చూసుకోవడం చాలా కష్టమైన పని. ఒక్కోసారి ఇది అవసరమా అనిపిస్తుంటుంది’ అని యువ నటుడు విజయ్‌ దేవరకొండ అన్నారు. ఆయన ముఖ్య అతిథిగా ఆదివారం విశాఖపట్నంలో ‘పుష్పక విమానం’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కార్యక్రమం జరిగింది. విజయ్‌ సోదరుడు ఆనంద్‌ కథానాయకుడిగా దర్శకుడు దామోదర రూపొందించిన చిత్రమిది. గీత్‌ సైని, శాన్వి మేఘన కథానాయికలు. గోవర్ధనరావు దేవరకొండ, విజయ్‌ మట్టపల్లి, ప్రదీప్‌ ఎర్రబెల్లి నిర్మాతలు. విజయ్‌ దేవరకొండ సమర్పకులు. ఈ సినిమా నవంబర్‌ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ వేడుకని ఉద్దేశించి విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ.. ‘ఈ చిత్ర విడుదల సమయంలో నేను ఇక్కడ ఉండను. ‘లైగర్‌’ చిత్ర షూటింగ్‌ కోసం యూఎస్‌ వెళ్తున్నా. నేను నిర్మించిన ఈ సినిమాని మీరే చూసుకోవాలి. విజయవంతం చేయాలి. కెరీర్‌ ప్రారంభంలో నేను పడిన కష్టాలు మరొకరు పడకూడదనే ఉద్దేశంతో కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకు నిర్మాణ సంస్థని ప్రారంభించా. కానీ, నిర్మాణ పనులు చూసుకోవడం చాలా కష్టంగా ఉంది. నటుడిగా సినిమా కథలు ఎంపిక చేసుకోవడం, పాత్రల కోసం శిక్షణ తీసుకోవడం, సినిమాని ప్రచారం చేసుకోవడం.. ఇలా నా పని నాకే సరిపోతుంది. అలాంటిది ఇంకో సినిమాని నిర్మించి, దాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడమంటే మాటలు కాదు. ఒక్కోసారి ఇది మనకు అవసరమా అనిపిస్తుంటుంది. ఆత్మవిశ్వాసం, మీరు నాపై పెట్టిన నమ్మకంతో ముందుకెళ్తా. ఐదారేళ్ల క్రితం నేనెవరో మా గల్లీ వారికే తెలియదు. ఇప్పుడిలా మీ అందరి ముందుకొచ్చి నటుడిగా, నిర్మాతగా మాట్లాడగలుగుతున్నా. ఈ ప్రయాణాన్ని అసలు ఊహించలేదు. మీ అభిమానానికి ధన్యవాదాలు. ఈ చిత్ర దర్శకుడితో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. తనలో మంచి రచయిత ఉన్నాడు. ఈ సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ఆనంద్‌ నటన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. కథానాయికలిద్దరూ చాలా చక్కగా నటించారు. నవంబరు 12న విడుదలవుతున్న కార్తికేయ ‘రాజా విక్రమార్క’ చిత్రం విజయంవంతం కావాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.

ఆనంద్‌ దేవరకొండ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో హీరోయిజం ఉండదు. సుందర్‌ అనే పాత్రలో నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కనిపిస్తా. ఇది కామెడీ థ్రిల్లర్‌ సినిమా. పెళ్లితో ముడిపడి ఉంటుంది. సునీల్‌, హర్ష వర్థన్‌, నరేశ్‌ వంటి సీనియర్‌ నటుల నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా. మా నాన్న నటుడవ్వాలనే లక్ష్యంతో 35 ఏళ్ల క్రితం హైదరాబాద్‌ వచ్చారు. కొన్ని కారణాల వల్ల ఆయన యాక్టర్‌ కాలేకపోయారు. అన్నయ్య (విజయ్‌), నేనూ నటులయ్యాం. ఇప్పుడు ఆయన చాలా సంతోషంగా ఉన్నారు’ అని అన్నారు. 


 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని