Updated : 27 Dec 2021 13:26 IST

Aakanksha Singh: పెళ్లి తర్వాతా రాణించడానికి కారణం అదే: నటి ఆకాంక్షసింగ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌, ప్రత్యేకం: పెళ్లితో కథానాయిక కెరీర్‌ ముగిసిపోతుందని చాలామంది అభిప్రాయపడుతుంటారు. అందులో నిజంలేదని, వివాహమయ్యాకే తాను ఎక్కువ అవకాశాలు అందుకున్నానని ఆకాంక్షసింగ్‌ తెలిపారు. ‘మళ్లీరావా’, ‘దేవదాస్‌’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ నటి ఇప్పుడు ‘పరంపర’ అనే వెబ్‌ సిరీస్‌తో సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘ఈనాడు.నెట్‌’తో ప్రత్యేకంగా సంభాషించారు. వ్యక్తిగత, వృత్తిపర విషయాలెన్నో పంచుకున్నారు.

చాలాకాలం తర్వాత తెలుగు ప్రేక్షకుల్ని పలకరించారు. ఈ విరామానికి కారణమేంటి?

ఆకాంక్ష: గ్యాప్‌ ఇవ్వలేదు.. వచ్చింది (నవ్వులు). దానికి కారణం కొవిడ్‌/లాక్‌డౌన్‌. నా సినిమాల విడుదల విషయంలో ఆలస్యమవుతుందేమో గానీ అవకాశాల్ని అందుకోవటంలో కాదు. ఆది పినిశెట్టితో కలిసి నటించిన ‘క్లాప్‌’, ‘శివుడు’ (తమిళం, తెలుగు), అజయ్ దేవ్‌గణ్‌- అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి నటించిన ‘రన్‌వే 34’ (హిందీ), దీప్తి (నటుడు నాని సోదరి) దర్శకత్వంలో నటించిన ‘మీట్‌ క్యూట్‌’ (తెలుగు) చిత్రాలన్నీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటిల్లో రెండు సినిమాలు ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొవిడ్‌ కారణంగా వాయిదా పడ్డాయి. ఆ లోటును ‘పరంపర’ తీర్చిందనుకుంటున్నా. ఈ క్రైమ్ డ్రామా వెబ్‌ సిరీస్‌లో నేను రచన అనే శక్తిమంతమైన పాత్ర పోషించా. మహిళలకు స్ఫూర్తిన్నిచ్చే క్యారెక్టర్‌ ఇది. కచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా.

శరత్‌కుమార్‌, జగపతిబాబు, మురళీమోహన్‌ వంటి సీనియర్‌ నటులతో పనిచేయడం ఎలా అనిపించింది?

ఆకాంక్ష: శరత్‌కుమార్‌, జగపతిబాబు, మురళీమోహన్‌.. ముగ్గురూ దిగ్గజ నటులే. వారు లివింగ్‌ లెజెండ్స్‌. అలాంటి వీరు ‘పరంపర’ కోసం కలిసి పనిచేయటం గొప్ప విషయం. నటిగా వీరి నుంచి ఎన్నో విషయాల్ని నేర్చుకున్నా. ఈ క్రేజీ ప్రాజెక్టులో భాగస్వామినైనందుకు చాలా ఆనందంగా ఉంది. వీరితోపాటు నవీన్‌చంద్ర నటనా నన్నెంతగానో ఆకట్టుకుంది. చాలా అద్భుతమైన నటుడతను.

అన్ని చలన చిత్ర పరిశ్రమల్లోనూ పనిచేశారు. భాష పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు?

ఆకాంక్ష: భాష అనేది ఓ మాధ్యమం మాత్రమే. మనం చెప్పాలనుకున్నది హావభావాలతో చెప్పేందుకు ఎలాంటి భాష అవసరంలేదు. ఎమోషన్‌ పండించటమే నటిగా నా బాధ్యత. దాని కోసం నా టీమ్‌ సహాయం చేస్తుంది. నాకు అర్థమయ్యే భాషలో అనువదిస్తుంది. అంతేకాదు, దేన్నైనా త్వరగా గ్రహించే లక్షణం నాలో ఉంది. అందుకే నాకు అంత కష్టమనిపించదు..

నటిగా అసలు మీ ప్రయాణం ఎలా మొదలైంది?

ఆకాంక్ష: నాకు చిన్నప్పటి నుంచే నటన అంటే చాలా ఇష్టం. అయితే నేనెప్పుడూ నటినవుతానని అనుకోలేదు. అందరిలానే నేనూ బాత్‌రూమ్‌, అద్దం ముందు సరదాగా ట్రయల్స్‌ వేసేదాన్ని. మా అమ్మ థియేటర్‌ ఆర్టిస్ట్‌ కావడంతో నేనూ స్టేజ్‌లపై ప్రదర్శనలు ఇచ్చేదాన్ని. అలా నన్ను చూసిన ఒకరు ఓ ధారావాహికకు ఆడిషన్‌ ఇవ్వమన్నారు. నటనపై ఉన్న ఆసక్తితో ఆ ప్రయత్నం చేశా. ‘నా బోలే తుమ్‌ నా మైనే కుచ్‌ కహా’ అనే హిందీ ధారావాహిక కోసం తొలిసారి కెమెరా ముందుకొచ్చా. ఫిజియోథెరపిస్ట్‌ విద్యనభ్యసించిన నేను నటిగా మిమ్మల్ని అలరిస్తారని ఎప్పుడూ ఊహించలేదు.

నటిగా బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్న మీరు సినిమాల్లోకి రావటానికి కారణం?

ఆకాంక్ష: నాకెప్పుడూ కొత్త కొత్త పాత్రలో నటించాలనుంటుంది. అందుకే సినిమాల్లోకి వచ్చా. సినిమా సినిమాకీ పాత్రలు మారుతుంటాయి. విభిన్న గెటప్‌లతో ప్రేక్షకుల్ని అలరించవచ్చు. అదే ధారావాహికలైతే ఒకే పాత్రలో ఏళ్ల తరబడి నటించాలి. ఇప్పటికీ టీవీ నుంచి ఆఫర్లొస్తున్నాయి. ప్రస్తుతం సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో బిజీగా ఉండటంతో ఆ ఆలోచన మానుకున్నా. భవిష్యత్‌లో మళ్లీ బుల్లితెరపై కనిపిస్తానో లేదో ఇప్పుడు చెప్పలేను.

టీవీ, సినిమా, ఓటీటీ.. వీటిల్లో ఏది మీకు కంఫర్ట్‌?

ఆకాంక్ష: నాకే కాదు నటులెవరికీ కంఫర్ట్‌ జోన్‌ అంటూ ఏమీ ఉండదు. ఎంపిక చేసుకున్న పాత్రకు న్యాయం చేయగలమా? ప్రేక్షకుల్ని మెప్పించగలమా? అనేదే ఆలోచిస్తా తప్ప అది ఏ మాధ్యమంలో విడుదలవుతుందనే విషయాన్ని పట్టించుకోను.

నటనలో మీకు స్ఫూర్తి ఎవరు?

ఆకాంక్ష: ఎంతోమంది నటులు నన్ను ఇన్‌స్పైర్‌ చేశారు. ఫలానా వారని చెప్పలేను. నాకు నచ్చిన సినిమాల్లోని పాత్రలన్నీ నాకెంతో స్ఫూర్తినిస్తుంటాయి.

ఏ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమాల్ని ఎంపిక చేసుకుంటుంటారు?

ఆకాంక్ష: పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారనో, ఇంకేవో ఆకర్షించే అంశాలున్నాయనో నేనే ప్రాజెక్టును ఓకే చేయను. కథ, నా పాత్ర నచ్చితేనే ఏ సినిమాలోనైనా నటిస్తా.

డ్రీమ్‌ రోల్స్‌ ఏమైనా ఉన్నాయా?

ఆకాంక్ష: ముఖ్యంగా రెండు డ్రీమ్‌ రోల్స్‌ ఉన్నాయి. ఒకటి.. యువరాణిగా నటించాలని, రెండు.. బయోపిక్స్‌లో కనిపించాలనేది నా కోరిక. 

పెళ్లి తర్వాతే వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తున్నారు. అదెలా సాధ్యమవుతోంది?

ఆకాంక్ష: పెళ్లి అయ్యాక కూడా మగవారు నటిస్తూనే ఉంటారు. ‘ఎందుకింకా నటిస్తున్నారు’ అని ఎవరూ వారిని ప్రశ్నించరు. అదే అమ్మాయిల విషయంలో అయితే కెరీర్‌ ముగిసిపోయిందంటుంటారు. నేను అలాంటి మాటల్ని నమ్మను. ఎందుకంటే సినిమాకు నటన ముఖ్యం. వ్యక్తిగత విషయాలైన వయసు, పెళ్లి అనేవి కాదు. ఎవరికైతే నా నటన నచ్చుతుందో వారు తమ సినిమాల్లో నన్ను ఎంపిక చేసుకుంటారు. నా భర్త కునాల్‌ సపోర్ట్‌ నాకెప్పుడూ ఉంటుంది. ఆయన వల్లే నేను రాణించగలుగుతున్నా. నిజం చెప్పాలంటే నేను పెళ్లికి ముందుకు నటించింది కేవలం ధారావాహికలోనే. వివాహం అనంతరమే సినిమాల్లోకి వచ్చా.

మీది ప్రేమ వివాహమా..?

ఆకాంక్ష: కునాల్‌ నేనూ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌. ఒకరిపై ఒకరం చాలా ఆరాధన భావంతో ఉండేవాళ్లం. కొన్నాళ్లకు మా ప్రేమ విషయం కుటుంబ సభ్యులతో చెప్పి పెళ్లి చేసుకున్నాం.

తెలుగు ప్రేక్షకుల గురించి ఏం చెబుతారు?

ఆకాంక్ష: తెలుగు ప్రేక్షకుల్ని ఎప్పటికీ మరిచిపోలేను. జైపుర్‌ నుంచి వచ్చిన నన్ను ఎంతగానో ఆదరించారు. తొలి పరిచయం (మళ్లీరావా)లోనే నాపై ప్రేమ కురిపించారు. వారి వల్లే నేనీ స్థానంలో ఉన్నా. వారిని అలరించేందుకు ఇంకా కష్టపడతా.

తెలుగులో మీకు నచ్చిన నటుడు?

ఆకాంక్ష: నాకు నచ్చిన నటుల జాబితా చాలా పెద్దది. ప్రత్యేకంగా ఒకరి పేరు చెప్పలేను (నవ్వులు).

హైదరాబాద్‌ నగరంతో మీకున్న అనుబంధం?

ఆకాంక్ష: నాకు నచ్చిన సిటీల్లో హైదరాబాద్‌ ఒకటి. నా సొంతూరిలా భావిస్తా. హైదరాబాద్‌ ప్రజల్ని, ఇక్కడ దొరికే ఆహారాన్ని చాలా ప్రేమిస్తా.

లాక్‌డౌన్‌ మీకేం నేర్పింది?

ఆకాంక్ష: ఒకటీ రెండూ కాదు లాక్‌డౌన్‌ సమయంలో ఎన్నో విషయాల్ని నేర్చుకున్నా. నన్ను నేను తెలుసుకున్నా. కుటుంబ సభ్యులతో ఎక్కువ సేపు గడిపే అవకాశం లభించింది.

వెల కట్టలేని క్షణాలవీ..

‘రన్‌వే 34’ సినిమాలోని నా నటన మెచ్చిన అమితాబ్‌ బచ్చన్‌ తానే స్వయంగా ఓ లెటర్‌ రాసిచ్చారు. నా జీవితంలో మరిచిపోలేని సంఘటనది. వెల కట్టలేని క్షణాలవి. ఆ లెటర్‌ను ఫ్రేమ్‌ చేసి ఇంట్లో పెట్టుకున్నా. ఇదే చిత్రంలో అజయ్‌దేవ్‌గణ్‌తో కలిసి నటించటం మంచి అనుభూతినిచ్చింది. ఆయనలో నటుడే కాదు మంచి దర్శకుడూ ఉన్నాడు.

నాగార్జున స్వీట్‌హార్ట్‌..

నాగార్జున్‌ సర్‌ చాలా స్వీట్‌హార్ట్‌. ఓ స్టార్‌ అనే ఫీలింగ్‌ ఆయనకు ఉండదు. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం ఆయనది. ‘దేవదాస్‌’ సినిమా చిత్రీకరణలో బాగా ఎంజాయ్‌ చేశా.

మరికొన్ని..

* నచ్చిన దుస్తులు: ట్రెండీ, ట్రెడిషనల్‌.. అన్ని రకాల దుస్తుల్ని ఇష్టపడతా.

* ఇష్టమైన ప్రదేశం: కెమెరా ఎక్కడుంటే అదే నాకిష్టమైన స్థలం.

* నచ్చిన వంటకం: పానీపూరి.

* హాబీ: గుర్రపు స్వారీ, కథలు, కవితలు రాయటం.

Read latest Cinema News and Telugu News




Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్