Updated : 21 Jul 2021 13:44 IST

Raj Kundra: నగ్నంగా ఆడిషన్‌ అడిగాడు: నటి

బీటౌన్‌లో ప్రకంపనలు

ముంబయి: బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా అరెస్ట్‌ బీటౌన్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. వ్యాపారవేత్తగా పేరు ప్రఖ్యాతలు పొందిన రాజ్‌ను అశ్లీల చిత్రాలు నిర్మించి పలు యాప్‌ల ద్వారా వాటిని విడుదల చేస్తున్నారన్న ఆరోపణలతో సోమవారం ముంబయి పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం విదితమే. రాజ్‌కుంద్రా అరెస్ట్‌తో ఆయనకు సంబంధించిన ఎన్నో విస్తుపోయే విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇందులో భాగంగా ఒక బాలీవుడ్‌‌ నటి పాత వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. రాజ్‌ కుంద్రా మంచివాడు కాదంటూ.. అతన్ని వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

‘నేను ఒక మోడల్‌ని. నటిగా రాణించాలనే ఉద్దేశంలో సుమారు నాలుగేళ్ల క్రితం పరిశ్రమలోకి అడుగుపెట్టాను. ఎక్కువ సినిమాల్లో నటించలేదు. లాక్‌డౌన్‌ సమయంలో నేను ఎదుర్కొన్న సమస్య మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. గతేడాది ఆగస్టులో ఉమేశ్‌ కామత్‌ నుంచి నాకో ఫోన్‌ కాల్‌ వచ్చింది. రాజ్‌కుంద్రా నిర్మిస్తున్న వెబ్‌సిరీస్‌లో నాకు అవకాశమిస్తున్నట్లు చెప్పారు. ఇంతకీ రాజ్‌ కుంద్రా ఎవరని నేను ప్రశ్నించాను. నటి శిల్పాశెట్టి భర్త అని ఉమేశ్‌ సమాధానమిచ్చారు’

‘ఒకవేళ నేను కనుక వెబ్‌సిరీస్‌లో నటిస్తే అవకాశాలు వరుస కడతాయని.. కెరీర్‌లో ఉన్నత స్థాయికి వెళ్తానని నమ్మించాడు. కెరీర్‌పై ఆశతో ఆ సిరీస్‌లో నటిస్తానన్నాను. వెంటనే ఆయన ఆడిషన్‌ చేయాలని సూచించారు. కొవిడ్‌ వల్ల ఆడిషన్‌కి రాలేనని సమాధానమిచ్చాను. వీడియో కాల్‌ ద్వారా ఆడిషన్‌ తీసుకుంటామని అన్నాడు. నేను దానికి అంగీకరించాను. అయితే, ఆయన చెప్పిన సమయానికి ఆడిషన్‌ కోసం వీడియో కాల్‌లో జాయిన్‌ కాగానే.. నగ్నంగా ఆడిషన్‌ ఇవ్వమని చెప్పారు. నేను షాకయ్యాను. అలాంటివి నేను చేయనని ఆ కాల్‌ నుంచి వైదొలగాను. అయితే, నన్ను ఆడిషన్‌ చేసిన వారిలో ముగ్గురు వ్యక్తులున్నారు. అందులో ఒకరు ముఖానికి ముసుగు వేసుకున్నారు. నాకు తెలిసి ఆ వ్యక్తి రాజ్‌కుంద్రానే. అమ్మాయిల జీవితాలతో వ్యాపారం చేస్తున్న అలాంటి వ్యక్తుల్ని అరెస్ట్‌ చేయాలి’ అని గతంలో ఆ నటి ఆరోపించారు.

మూడు నెలలు దేశం వదిలి వెళ్లిపోయా..

రాజ్‌కుంద్రా అరెస్ట్‌పై బీటౌన్‌ నటి పూనమ్‌ పాండే హర్షం వ్యక్తం చేశారు. ఓ యాప్‌ లావాదేవీల విషయంలో రాజ్‌ తనని మోసం చేశాడని పేర్కొంటూ 2019లో పూనమ్‌ బాంబే హైకోర్టులో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి న్యాయం కోసం ఎదురుచూస్తున్న పూనమ్‌ తాజాగా.. రాజ్‌కుంద్రాను ముంబయి పోలీసులు అరెస్ట్‌ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థపై తనకి నమ్మకం ఉందని.. తప్పకుండా ఈసారి న్యాయం గెలిచితీరుతుందని ఆమె అన్నారు. ‘2019లో నేనూ, రాజ్‌కుంద్రా కలిసి భాగస్వాములుగా ఓ యాప్‌ని ప్రారంభించాం. అయితే, రెవెన్యూ విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని గ్రహించిన నేను ఆ భాగస్వామ్యం నుంచి వైదొలగుతున్నట్లు మెయిల్‌ పంపించాను. దాంతో రాజ్‌, అతని బృందం.. నా పర్సనల్‌ ఫోన్‌ నంబర్‌, ఫొటోలను కొన్ని ప్రైవేట్‌ యాప్‌లలో ఉంచారు. ఎంతోమంది నుంచి అసభ్య సందేశాలు, వీడియోలు వచ్చేవి. వాటిని తట్టుకోలేక మూడు నెలలపాటు దేశం వదిలి వెళ్లిపోయాను’ అని పూనమ్‌ తెలిపారు.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని