Romantic: పక్కా పూరి జగన్నాథ్‌ మార్క్‌ కనిపిస్తుంది: ‘రొమాంటిక్‌’ నటి కేతిక

ఫస్ట్‌లుక్‌తోనే కుర్రకారుని కట్టిపడేసింది. టీజర్‌, ట్రైలర్‌లతో హీటెక్కించింది. తొలి చిత్రం విడుదలకి ముందే మరికొన్ని సినిమాల్లో అవకాశం దక్కించుకుంది.

Published : 27 Oct 2021 22:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫస్ట్‌లుక్‌తోనే కుర్రకారును కట్టిపడేసింది. టీజర్‌, ట్రైలర్‌లతో హీటెక్కించింది. తొలి చిత్రం విడుదలకు ముందే మరికొన్ని సినిమాల్లో అవకాశం దక్కించుకుంది. అందరి చూపు తనవైపు నిలిచేలా చేసింది దిల్లీ ముద్దుగుమ్మ కేతికా శర్మ. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ హీరోగా రూపొందిన ‘రొమాంటిక్‌’తో వెండి తెరకు పరిచయమవుతోంది. పూరి కనెక్ట్స్‌ పతాకంపై పూరి జగన్నాథ్‌, ఛార్మి నిర్మించిన ఈ చిత్రానికి అనిల్‌ పాడూరి దర్శకత్వం వహించారు. అక్టోబరు 29న విడుదలకానుంది. ఈ సందర్భంగా కేతిక తన గురించి చెప్పుకొచ్చింది.

అలా అడుగుపెట్టాను..

హాయ్‌.. నా పేరు కేతిక శర్మ. నా స్వస్థలం దిల్లీ. మాది డాక్టర్స్‌ ఫ్యామిలీ. కుటుంబ సభ్యులు, బంధువుల్లో చాలామంది వైద్యులే. కానీ, నాకేమో సంగీతం, నృత్యం, సినిమానే ప్రపంచం. నటిని కావాలని చిన్నప్పుడే ఫిక్స్‌ అయ్యా. తగిన ప్రయత్నాలు చేస్తుండగా ఓసారి ‘పూరి కనెక్ట్స్‌’ నిర్మాణ సంస్థ నుంచి ఆహ్వానం అందింది. ఇన్‌స్టాగ్రామ్‌లో నేను పోస్ట్‌ చేసిన ఫొటోలు, వీడియోలు మెచ్చిన సంస్థ ఆడిషన్‌కి పిలిచింది. కట్‌ చేస్తే, హీరోయిన్‌గా సెలెక్ట్‌ అయ్యాను. అలా ఈ రంగుల ప్రపంచం (సినిమా రంగం)లోకి అడుగుపెట్టాను.

కల నెరవేరబోతుంది..

‘పూరి కనెక్ట్స్‌’ బ్యానర్‌లో వెండితెరకి పరిచయమవుతుండటం చాలా ఆనందంగా ఉంది. పూరి జగన్నాథ్‌గారు చాలా మంచి మనిషి. ఆయన నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా. నటిగా అడుగులు వేస్తుండగానే నన్ను గాయకురాలిని చేశారు. నాకు సింగింగ్‌ అంటే ఇష్టమని తెలియడంతో ఈ చిత్రంలో ఓ పాటని పాడే అవకాశం ఇచ్చారు. వారి ప్రోత్సాహంతో ‘నా వల్లే కాదే’ అనే గీతాన్ని ఆలపించా. ఈ సినిమాలో నేను మౌనిక అనే పాత్ర పోషించా. సమాజం గురించి పట్టించుకోకుండా తనకు నచ్చినట్టు బతికే అమ్మాయిగా కనిపిస్తా. మరికొన్ని గంటల్లో తెరపై నన్ను నేను చూసుకోవాలనే కల నెరవేరబోతుంది.

మంచి ఫ్రెండ్‌ అయ్యాడు..

ఆకాశ్‌, రమ్యకృష్ణ మేడమ్‌తో కలిసి నటించడం సవాలుగా అనిపించింది. నటన విషయంలో ఆకాశ్‌ సహాయం చేసేవాడు. కొన్నాళ్లకి మేం మంచి స్నేహితులయ్యాం. అద్భుతమైన ఔట్‌పుట్‌ అందించాలనే తపనతో నా పాత్రకు సంబంధించిన ప్రతి సన్నివేశాన్ని దర్శకుడు అనిల్‌తో చర్చించేదాన్ని. ఇది ఫుల్‌ మాస్‌ చిత్రం. పక్కా పూరి జగన్నాథ్‌గారి మూవీలా ఉంటుంది. పాటలు, సంభాషణలు మెప్పిస్తాయి. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది.

నా కోరిక అదే..

‘రొమాంటిక్‌’ విడుదలకి ముందే నాకు అవకాశాలొచ్చాయి. నాగశౌర్యతో ‘లక్ష్య’, వైష్ణవ్ తేజ్‌ సరసన ఓ సినిమాలో నటిస్తున్నా. బయోపిక్స్‌లో నటించాలనేది నా కోరిక. తెలుగు నేర్చుకునే పనిలో ఉన్నా. త్వరలోనే నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటా. సాయి పల్లవిని అభిమానిస్తా.

ప్రభాస్‌.. సర్‌ప్రైజ్‌

నన్నూ ఆకాశ్‌ని ప్రభాస్‌ ఇంటర్వ్యూ చేయడాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. ఎంత ఎదిగినా ఒదిగే ఉండి మనస్తత్వం ప్రభాస్‌ది. కొత్తవారితోనూ ఆయన చాలా సరదాగా మాట్లాడతారు. ఆయన మా సినిమాను ప్రచారం చేయడం ఆనందంగా ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని