Republic: ఆ విషయాన్ని నేను పట్టించుకోను: ఐశ్వర్య రాజేశ్‌

ఐశ్వర్య రాజేశ్‌ ఇంటర్వ్యూ. ‘రిపబ్లిక్‌’ సినిమా విశేషాలు పంచుకున్న నటి...

Updated : 27 Sep 2021 00:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘పాత్ర నిడివిని పట్టించుకోను. దాని ప్రాధాన్యతనే చూస్తా’ అంటోంది ఐశ్వర్య రాజేశ్‌. ఆమె నటించిన ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’, ‘టక్‌ జగదీష్‌’ తదితర చిత్రాలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తాయి. ఇప్పుడు ‘రిపబ్లిక్‌’ చిత్రంతో మరోసారి ప్రతిభని చాటుకోబోతుంది. సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా దేవ కట్టా రూపొందించిన చిత్రమిది. అక్టోబరు 1న విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఐశ్వర్య రాజేశ్‌ మీడియాతో ముచ్చటించింది.

ఫోన్‌లోనే స్క్రిప్టు విన్నా..

దర్శకుడు దేవ కట్టా నాకోరోజు ఫోన్‌ చేసి, ఈ సినిమాలో నటిస్తారా? అని అడిగారు. కొవిడ్‌ కారణంగా ఫోన్‌లోనే ‘రిపబ్లిక్‌’ స్క్రిప్టు వినిపించారు. నేను ఇందులో ఎన్‌ఆర్‌ఐగా నటించాను. అన్ని సినిమాల్లో చూపించిన విధంగా ప్రేమ అనగానే రొమాంటిక్‌ గీతాలు, డ్యాన్స్‌లు ఇందులో ఉండవు. కనీసం ఒకరిపై ఒకరు ప్రేమని వ్యక్తం చేసే సన్నివేశమూ లేదు. హీరోహీరోయిన్‌ అని కాకుండా ప్రతి పాత్రకీ మంచి గుర్తింపు ఉంటుంది. జగపతి బాబు, రమ్యకృష్ణ ఇలా ప్రతి ఒక్కరూ తన నటనతో కట్టిపడేస్తారు.

సాయిధరమ్‌ తేజ్‌ సింగిల్ టేక్‌..

‘రిపబ్లిక్‌’ పక్కా కమర్షియల్‌ చిత్రం కాదు. వాస్తవ సంఘటల్ని ఆధారంగా తీసుకుని దేవ కట్టా తనదైన మార్క్‌ చూపించారు. ఓ బలమైన కథని అందరికీ అర్థమయ్యేలా రూపొందించారు. ఆయన విజన్‌ ఉన్న వక్తి. తాను అనుకున్నది అనుకున్నట్టుగా తెరపైకి వచ్చేందుకు ఎంతో శ్రమిస్తారు. అతి తక్కువ సమయంలో నా పాత్రకి సంబంధించిన చిత్రీకరణ, డబ్బింగ్‌ పూర్తయింది. సాయిధరమ్‌ తేజ్ మంచి నటుడు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. కలెక్టరు పాత్రలో ఒదిగిపోయాడు. చిన్నపిల్లాడిలా పెన్ను పేపర్‌ పట్టుకుని సంభాషణలు ప్రాక్టీస్‌ చేశాడు. కోర్టు నేపథ్యంలో సాగే సన్నివేశాన్ని సింగిల్‌ టేక్‌లో పూర్తి చేశాడు. సుమారు పది నిమిషాలు ఉంటుందా సీన్‌.

వాళ్లంటే అభిమానం..

కొత్త దర్శకులు మంచి కథల్ని ఆవిష్కరిస్తున్నారు. ‘ఉప్పెన’ చిత్ర దర్శకుడు బుచ్చిబాబుని ఇటీవల కలిశాను. నా నటన బాగుంటుందని, నాతో పనిచేయాలనునుందని చెప్పారు. ఈ సినిమా కమర్షియల్ హంగులతో వచ్చిందని కథానాయిక కృతిశెట్టి స్టార్‌గా మారలేదు. తన నటన వల్ల పేరు తెచ్చుకుంది. అలా అని కమర్షియల్‌ చిత్రాల్లో నాయికగా చేయడం తేలికైన విషయం కాదు. నాకు స‌మంత, అనుష్క, సౌందర్య అంటే అభిమానం.

సువర్ణలా గుర్తుండిపోవాలి..

తెలుగు సినిమా అవకాశాలు వ‌స్తున్నాయి. పాత్ర నిడివి తక్కువైనా సరే నటనకి ప్రాధాన్యం ఉన్న కథల్నే ఎంపిక చేసుకోవాలనుకుంటున్నా. సినిమా ఫలితాన్ని పక్కనపెడితే నేను పోషించిన పాత్ర అందరికీ చేరువవ్వాలి. ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రంలో సువర్ణ పాత్రలా! కిర‌ణ్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నా. త‌మిళంలో పలు ప్రాజెక్టుల్లో నటిస్తున్నాను.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు