ఏం జరిగినా ఆత్మహత్య చేసుకోనని లేఖ రాశా..!
ఆయన పాట వింటే మౌనంగా ఉన్న మదిలో కూడా ప్రేమలు పుట్టేలా చేస్తుంది. ఆమె మాట నిత్యం బుల్లితెర వేదికగా మనల్ని పలకరిస్తుంది. మాటపాటలతో ప్రారంభమైన వీరి సంగీత ప్రయాణం..
ఎస్పీబీని కలిసిన ఆ క్షణం కన్నీళ్లు ఆగలేదు: విజయ్ ప్రకాశ్
ఆయన పాట మౌనంగా ఉన్న మదిలో కూడా ప్రేమ పుట్టేలా చేస్తుంది. ఆమె మాట నిత్యం బుల్లితెర వేదికగా మనల్ని పలకరిస్తుంది. మాటపాటలతో ప్రారంభమైన వీరి సంగీత ప్రయాణం.. ప్రేమతో ఒక్కటైంది. వాళ్లే సెన్సేషనల్ సింగర్ విజయ్ ప్రకాశ్, ఆయన సతీమణి మహతి. తాజాగా వీళ్లిద్దరూ ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతోన్న ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో పాల్గొని ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారు. ఆ విశేషాలివే..
విజయ ప్రకాశ్ అనగానే గుర్తొచ్చే పాట ఏది?
విజయ్ ప్రకాశ్: తెలుగులో ‘వీడు ఆరడుగుల బుల్లెట్’ మంచి ఫేమస్. పవన్‌కల్యాణ్ సినిమాకి పాడటం చాలా ఆనందంగా అనిపించింది. ఈ పాట పాడకముందు నేను 5 అడుగుల 9 అంగుళాలు ఉండేవాడిని పాట కోసం 6 అడుగుల 1 అంగుళానికి కాళ్లు పట్టుకుని లాగారు(నవ్వులు)
ఆ పాట సూపర్ హిట్.. ఒక గాయనిగా మీకెలా అనిపించింది?
మహతి: ఎక్కువ పాటలు పాడకపోయినా, గుర్తుండిపోయే పాటలు పాడారన్న సంతోషం, గర్వం ఉంది.
మీ సొంతూరు ఏది?
మహతి: నేను గుడివాడలో పుట్టాను. పెరిగిందంతా ముంబయి. (మధ్యలో విజయ్ మాట్లాడుతూ.. అక్కడి నుంచి 500 కి.మీ. వెళ్తే మా ఊరు మైసూర్ వస్తుంది)
మీరిద్దరూ మొదట ఎక్కడ కలిశారు?
మహతి: మేము ముంబయిలో కలిశాం. అక్కడ నేను తెలుగు ప్రకటనలకు వాయిస్ చెప్పేదాన్ని. తొలిసారి అక్కడే కలిశాం.
విజయ్ ప్రకాశ్: మ్యూజిక్‌లో ఏదో సాధించాలని ముంబయి వెళ్లా. భగవంతుడి దయ వల్ల ఏదో కాస్త గుర్తింపు వచ్చింది. నేను కూడా అప్పుడప్పుడు డబ్బింగ్ చెబుతుండేవాడిని. అప్పట్లో డబ్బింగ్ చెప్పాలంటే కాస్త భయం ఉండేది. పైగా ‘మహతి వస్తోంది. మహతి వస్తోంది’ అని అందరూ హడావుడి చేసేవాళ్లు. నేను ఎవరో పెద్దావిడ అనుకున్నా. తీరా చూస్తే చైల్డ్ ఆర్టిస్ట్. 18 ఏళ్లు ఉంటాయనుకుంటా. వాళ్ల అమ్మతో వచ్చి డబ్బింగ్ చెప్పి వెళ్లిపోయేది. అప్పట్లో నన్ను చూసి ఓ లుక్ ఇచ్చింది. అంతే నేను తనని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను.
మహతి: 2001లో మా వివాహమైంది. ఈ విషయాలన్నీ ఆయనకు గుర్తుండవు(నవ్వులు)
మొదటిసారి మీరు ఏ భాషలో పాట పాడారు?
విజయ్ ప్రకాశ్: ‘చీనీకమ్ హై.. చీనీకమ్ హై’ అమితాబ్ గారి కోసం తొలిసారి పాడా. మంచి గుర్తింపొచ్చింది. తెలుగులో ‘చింతకాయల రవి’లో ‘బాగుందే బాగుందే’ పాట పాడా. దీనికి కూడా మంచి పేరొచ్చింది.
మరి మీరు ఏ సినిమాకు పాట పాడారు?
మహతి: నేను నేపథ్య గాయనిని కాదు. కేవలం ప్రకటనలకు డబ్బింగ్ చెప్పేదాన్ని. ప్రతి యాడ్ ముంబయిలో డబ్ అవుతుంది. 25 ఏళ్ల నుంచి డబ్బింగ్ చెబుతున్నా. దాదాపు 15వేల ప్రకటనలకు డబ్బింగ్ చెప్పి ఉంటా. నాన్న కూడా ఇండస్ట్రీలో ఉన్నారు. దీంతో తెలుగులో డబ్బింగ్ చెప్పేవారి కోసం చూసేవారు. అలా నాకు అవకాశం వచ్చింది. నేను నా తమ్ముడు సెలక్ట్ అయ్యాం. పాటలు పాడలేదు కానీ, జింగిల్స్ పాడా. (బ్రూ కోసం పాడా)
రైల్వేస్టేషన్‌లో పడుకుని ఉంటే ఒక పోలీస్ కాలితో తన్ని లేచి ఇక్కడి నుంచి వెళ్లిపో అన్నారట నిజమేనా?
విజయ్ ప్రకాశ్: 12వ తరగతి చదువుకున్న తర్వాత నా దృష్టి సంగీతంవైపు మళ్లింది. అయితే, ఏం చేయాలో తెలియదు. దాంతో అమ్మానాన్నలకు ఒక లెటర్ రాశా ‘నేను సంగీతంలో ఏదో ఒకటి నేర్చుకోవాలనుకుంటున్నా. అందుకు ఇంటి నుంచి వెళ్లిపోతున్నా. మీకు తెలిస్తే, నన్ను వెళ్లనివ్వరు. అయితే నేను ఏదీ సాధించలేకపోతే ఆత్మహత్య మాత్రం చేసుకోను. ఇంటికి తిరిగి వస్తా’ అని రాశా. అలా ఎందుకు చేశానో ఇప్పటికీ తెలియదు. బస్టాండ్‌కు వెళ్తే తిరుపతి బస్సు కనపడింది. స్వామి దర్శనం చేసుకున్నా. ఆ రోజు నుంచి ఇప్పటివరకూ ఏటా తిరుపతి వెళ్తూనే ఉన్నా. మళ్లీ వచ్చి ముంబయి బస్సు ఎక్కా. రైల్వేస్టేషన్‌లో పడుకునేవాడిని. సురేశ్‌వాడ్కర్ అనే గురువుగారు దొరికారు. రాధాకృష్ణ ఆలయంలో ఏడు నెలలు ఉన్నా. మరొక ఇంట్లో పేయింగ్ గెస్ట్‌గా ఉన్నా. మహతి నన్ను ఒప్పుకోకపోయుంటే నేను నథింగ్.
మహతి: నేనంటే ఇష్టమని చెప్పడానికి వచ్చి, ఏవో కథలు చెప్పడం మొదలు పెట్టారు. అనవసర విషయాలన్నీ చెబుతున్నారు కానీ, అసలు విషయం చెప్పడం లేదు. 15 నిమిషాలు వెయిట్ చేశా. ‘ఏంటి. నేనంటే ఇష్టమా’ అని అడిగా. ‘అవును ఇష్టం’ అన్నారు. మరి ఈ విషయం చెప్పడానికి ఇదంతా అవసరమా? అని అడిగాను.
విజయ్ ప్రకాశ్: ఎక్కడ ‘నో’ చెబుతుందోనని భయపడుతూ ఉండేవాడిని.
ఆయనను ఇష్టపడటానికి మూడు కారణాలు చెప్పండి?
మహతి: స్వభావం. ఎంతో టాలెంట్ ఉన్న వ్యక్తి. చాలా మంది గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ, ఈయన ఎంత ఎదిగినా ఒదిగే ఉంటారు. ఇప్పటికీ అంతే. ఆయన వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం. బాగా ఎత్తుగా ఉన్నారని ఇష్టం ఏర్పడిందేమో. నాన్న ఆర్‌బీఐ ఉద్యోగం చేసేవారు. పార్ట్‌టైమ్ సింగర్ కూడా. ఆర్టిస్ట్ జీవితం ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు. పైగా విజయ్‌పై సదభిప్రాయం ఉంది. నేను ఆర్టిస్ట్‌ను కావడంతో ఇద్దరి మధ్య కుదురుతుందా? అని ఆలోచించారు. అయితే, విజయ్‌ను పెళ్లిచేసుకోవడానికి రెండు కండీషన్లు పెట్టారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలి. ముంబయిలో ఇల్లు కట్టుకోవాలి.
విజయ్ ప్రకాశ్: రికార్డింగ్ అయిపోయిన తర్వాత మహతి వాళ్ల ఇంటికి వెళ్లేవాడిని. అక్కడ వాళ్ల నాన్న పాదాలకు నమస్కారం చేసేవాడిని. ఒక రోజు ఆయన ‘నువ్వు రోజూ వచ్చి మహతిని కలవవచ్చు. కానీ, ఈ నమస్కారాలు వద్దు’ అన్నారు. భగవంతుడి దయతో 1996లో ముంబయికి వెళ్లాను. రైల్వేస్టేషన్‌లో నిద్రపోయాను. 1999లో అంధేరీలో ఇల్లు కొన్నాను. అదంతా కర్మఫలం అనే అనుకుంటున్నాను. 2001లో మేము పెళ్లి చేసుకున్నాం.
మీ ప్రేమ గురించి ఇంట్లో చెప్పగానే రియాక్షన్ ఏంటి?
విజయ్ ప్రకాశ్: సంగీత సాధన చేస్తాను. జీవితంలో ఏదో సాధిస్తాను అని ఓ లెటర్ రాసి పెట్టి 1996లో ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. 1997లో మహతితో ప్రేమలోపడ్డాను. తనకి ప్రపోజ్ చేసిన రోజే ఇంటికి ఫోన్ చేసి ఇంట్లోవాళ్లకి మా ప్రేమ గురించి చెప్పాను. ‘సంగీత ప్రపంచంలో సాధన చేస్తున్నానని ఓ లెటర్ రాసి పెట్టావు. ఏరా ఇదేనా నీ సాధన’ అని నాన్న చాలా కోపంతో ఫోన్ పెట్టేశారు. కానీ మా అమ్మ మాత్రం.. ‘నో ప్రాబ్లమ్. మేము వచ్చి ఆ అమ్మాయి వాళ్ల ఫ్యామిలీతో మాట్లాడతాం’ అని చెప్పారు. మా అమ్మవాళ్లది కూడా ప్రేమ వివాహమే. నేను ఫోన్ చేసిన వెంటనే అమ్మవాళ్లు మైసూర్ నుంచి వచ్చి.. మహతి వాళ్ల కుటుంబసభ్యుల్ని కలిశారు. అలా ప్రేమ పెళ్లి పీటలెక్కింది. ఇప్పుడు మాకు ఒక అమ్మాయి. తను యూరప్‌లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదువుకుంటుంది.
మీ ఇద్దరిలో పాప ఎవరితో ఎక్కువగా క్లోజ్‌గా ఉంటుంది?
విజయ్ ప్రకాశ్: మా అమ్మాయికి నాతో ఉంటే ధైర్యంగా ఉంటుంది. అదే వాళ్లమ్మ అంటే తనకెంతో నమ్మకం.
మీ భర్తపై మీకున్న కంప్లయింట్స్ ఏంటి?
మహతి: ఆయనపై సీరియస్ కంప్లయింట్స్ ఏమీ లేవు. కానీ, ఎప్పుడైనా మేము హాలీడే కోసం విదేశాలకు వెళ్లినప్పుడు.. అక్కడ ఏ ప్రాంతాలు చూడాలి? అనేదానిపై నేను ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తాను. కానీ ఆయన మాత్రం ఎక్కడికి వెళ్లినా సరే.. రిలాక్స్ కావడానికి ఆసక్తి కనబరుస్తారు.
సింగర్స్‌లో మీకు స్ఫూర్తి ఎవరు?
విజయ్ ప్రకాశ్: సింగర్స్ అందరికీ వన్ అండ్ ఓన్లీ ఇన్‌స్పిరేషన్ ఎస్పీబాలు గారు. మైసూర్‌లో నేను పుట్టి పెరిగిన ఆ రోజుల్లో రేడియోలో ప్రతిరోజూ చిత్రగీతిక అనే కార్యక్రమం వచ్చేది. అందులో చాలా పాటలు ఎస్పీబాలు గారివే. మహతి వల్లే మొదటిసారి ఆయన్ని కలిశాను. ఆయన షేక్‌హ్యాండ్ ఇవ్వగానే నాకు షాక్ కొట్టినట్లు అయ్యింది. చిన్నప్పటి నుంచి ఆయన్ని నేను ఎంతగానో ఆరాధించాను. ఆయన్ని కలిసిన ఆ క్షణం తర్వాత పక్కకు వెళ్లి కన్నీళ్లు పెట్టుకున్నాను. కొంతసేపటి తర్వాత మరలా ఆయన వద్దకు వెళ్లి.. ‘సారీ సర్.. ఇందాక మీతో మాట్లాడలేకపోయాను’ అని చెప్పాను. దాంతో ఆయన కొంత సమయంపాటు నాతో మాట్లాడారు. ఆరోజు ఆయనతో నాకు ఏర్పడిన అనుబంధం ఎన్నో సంవత్సరాలపాటు కొనసాగింది. 2019 అక్టోబర్‌లో ప్రధాని మోదీ నివాసంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి ఈటీవీ వారి సహకారంతో నేను, బాలుగారు వెళ్లాం. ఆరోజే చివరిసారి ఆయన్ని కలిశాను. చనిపోవడానికి మూడు నెలల ముందు నేను పాడిన ఓ పాటకు స్పందన తెలియజేస్తూ ఆయన నాకు ఓ ఆడియో కూడా పంపించారు. ఇప్పటికీ, ఆయనతో ఉన్న క్షణాలు గుర్తు చేసుకుంటే నా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. పాట రూపంలో ఆయన ఎప్పటికీ మన మధ్య బతికే ఉంటారు.
మీరు పాడిన ‘జయహో’ పాటకు రెండు ఆస్కార్ అవార్డులు వచ్చాయి. దానిపై మీ స్పందన ఏమిటి?
విజయ్ ప్రకాశ్: ఆరోజు నాకెంతో ఆనందంగా అనిపించింది. ఆస్కార్ మాత్రమే కాకుండా ‘జయహో’ పాటకు గ్రామీ అవార్డు కూడా వచ్చింది. దాంతో రెహమాన్‌తో కలిసి నేను, మహతి గ్రామీ అవార్డుల ప్రదానోత్సవానికి వెళ్లాం. రెహమాన్‌తోపాటు ఆ స్టేజ్‌పై ఉండడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మైసూర్‌లో ఓ చిన్న ఇంట్లో పుట్టిన నా గాత్రం ఆస్కార్ స్థాయి దాకా వెళ్లిందంటే ఇదంతా భగవంతుడు నాకోసం సృష్టించిన ప్రయాణంగా భావిస్తున్నాను.
కాశీలో స్వామివారికి హారతినిచ్చేటప్పుడు మీరు పాడిన పాటే ప్లే చేస్తున్నారని విన్నాం?
విజయ్ ప్రకాశ్: నా తల్లిదండ్రులు, భార్యాపిల్లల కారణంగా నేను ఈ స్థాయిలో ఉన్నాను. మనం నిత్యం కొలిచే ఆ దేవదేవుడి సన్నిధిలో హారతినిచ్చేటప్పుడు ‘ఓం శివోహం’ అంటూ నేను పాడిన పాటను ప్లే చేస్తున్నారని నాకెంతో మంది చెప్పారు. అది నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. రికార్డింగ్‌కి రమ్మని ఓసారి ఇళయరాజా గారి ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. దాంతో చెన్నైకి వెళ్లి సర్‌ని కలిశాను. ‘శివోహం’ వెర్షన్ ఆయన నాకు వినిపించారు. అది విన్నాక నాకు కొంచెం భయం వేసింది. ‘సర్. ఈ పాట నేను పాడగలనా’ అని అడిగాను. దాంతో ఆయన వెంటనే ‘వెళ్లు.. పాడు’ అని చెప్పారు. నాపై నాకంటే ఆయనకే ఎక్కువ నమ్మకం ఉంది. ఆ పాట సూపర్‌హిట్ అయ్యింది. ఈటీవీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ పాట పాడితే సుమారు కోటి మంది దాన్ని వీక్షించారు.
రెహమాన్‌తో మీ మ్యూజిక్ జర్నీ ఎలా ప్రారంభమైంది?
విజయ్ ప్రకాశ్: ‘రోజా’ సినిమా విడుదలైన సమయంలో మైసూర్ థియేటర్‌లో ఆ పాటలు విని.. ఎంత బాగుందో అనుకున్నాను. 1993లో చెన్నైలో జరిగిన ఓ మ్యూజిక్ కాన్సర్ట్‌కి కజిన్‌తో కలిసి వెళ్లాను. రెహమాన్ దగ్గర ఓ ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. ఆ తర్వాత సింగర్ కావాలనే ఉద్దేశంతో ముంబయికి వచ్చాను. ఎన్నో ప్రకటనలకు జింగిల్స్ పాడాను. బ్రిజ్ భూషణ్ అనే వ్యక్తి నా గురించి రెహమాన్ సర్‌కి చెప్పారు. ఓరోజు అశుతోష్ గోవారికర్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. ‘రెహమాన్ సర్ రికార్డింగ్‌కి రమ్మన్నారు’ అని చెప్పారు. నేను షాకయ్యాను. అలాగే ఎవరో కావాలని ఆటపట్టిస్తున్నారనుకున్నాను. కానీ, ఎందుకైనా మంచిది ఓసారి నిజమో.. కాదో.. చూసొద్దామని ఆయన చెప్పిన హోటల్‌కి వెళ్లాను. అలా మొదటిసారి రెహమాన్, షారుఖ్ ఖాన్, జావేద్ అక్తర్, అశుతోష్ గోవారికర్‌ని కలిశాను. షారుఖ్ ‘స్వదేశ్’లో ‘పల్ పల్ హై’ సాంగ్ రికార్డ్ చేయించారు. రాత్రి నుంచి ఉదయం 7 గంటల వరకూ రికార్డింగ్‌లో బిజీగా ఉన్నాం. రికార్డ్ పూర్తయ్యిందనుకున్న వెంటనే రెహమాన్ సర్.. ఏదైనా ఒక పాట పాడమన్నారు. ఆయన మాటలతో నిద్ర ఎగిరిపోయింది. అలా, ఆయనతో నా ప్రయాణం మొదలైంది. ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నాను.
రెహమాన్‌తో వరల్డ్ టూర్‌కి వెళ్లినప్పుడు ఏదో జరిగింది అంట?
విజయ్ ప్రకాశ్: ‘జయహో’ పాటకు ఆస్కార్ అవార్డులు పొందిన తర్వాత రెహమాన్ వరల్డ్ టూర్ చేశారు. ఆయనతోపాటు నేను కూడా ఆ టూర్‌లో ఉన్నాను. అలా మేము మొదటగా న్యూజెర్సీ వెళ్లాం. అక్కడ అందరూ తెలుగువారే. షోలో భాగంగా ‘ఓ చెలియా నా ప్రియ సఖియా’ పాట పాడాను. ఆడిటోరియం మొత్తం చప్పట్లు కొట్టారు. అనంతరం కెనడా వెళ్లాం.. అక్కడ కూడా అదే పాట పాడాను. ఇద్దరు లేదా ముగ్గురు మినహాయించి ఎవ్వరూ చప్పట్లు కొట్టలేదు. ఎందుకంటే, అక్కడ ఎక్కువగా పంజాబీవాళ్లు ఉంటారు.
విజయ్ ప్రకాశ్ డే ఏమిటి?
విజయ్ ప్రకాశ్: నార్త్ కరోలినా (North Carolina)లోని CHARLOTTE సిటీలో 2019 మే 12న నా కాన్సర్ట్ ఒకటి జరిగింది. అది ఫుల్ సక్సెస్ అయ్యింది. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కాన్సర్ట్‌ని ఫుల్ ఎంజాయ్ చేశారు. అయితే ఆ కార్యక్రమానికి వాళ్ల మేయర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రజలందరూ అంత సంతోషంగా ఉండడం చూసిన ఆయన.. మే 12వ తేదీని ‘విజయ్ ప్రకాశ్ డే’ అని ప్రకటించారు. వాళ్లు ఇప్పుడు ఆ డే చేసుకుంటున్నారో లేదో తెలియదు కానీ మేము మాత్రం ప్రతి ఏడాది ఆ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం.
రెమ్యునరేషన్ ఇస్తే అది చూసి లోన్ అనుకున్నారంట?
విజయ్ ప్రకాశ్: ముంబయికి వెళ్లిన కొత్తలో నేను ఓ ఆలయంలో బస చేశాను. అక్కడ ఉన్నందుకు వాళ్లకి ప్రతి నెలా రూ.200 ఇవ్వాలి. నాకు చూస్తే సరిగ్గా ఆదాయం ఉండేది కాదు. అలాంటి సమయంలో ఓ వ్యక్తి నా వాయిస్ విని.. వాయిస్ ఓవర్లు ప్రారంభించు అని సలహా ఇచ్చారు. వర్డ్స్ అండ్ వాయిసెస్ అని ముంబయిలో పెద్ద కంపెనీ ఉండేది అందులో మన తెలుగాయన వనమాలి గారు ఉండేవారు. ఓరోజు ఆయన్ని కలిశాను. ఎన్ని భాషలు వచ్చు అని అడిగారు. నేను సమాధానం ఇచ్చాను. తర్వాత రోజు రికార్డింగ్ ఉంది రమ్మన్నారు. ఓ వాణిజ్య ప్రకటనకు వాయిస్ ఇవ్వమన్నారు. ఇచ్చాను. అందరూ ఫుల్ హ్యాపీగా ఫీలయ్యారు. స్టూడియో నుంచి నేను వచ్చేస్తుంటే రెమ్యునరేషన్ తీసుకువెళ్లు అని చేతిలో రూ.2700 చెక్ పెట్టారు. అది చూసి నేను షాకయ్యాను. ‘సర్ నాకు లోన్ వద్దు సర్. రెమ్యునరేషన్ చాలు’ అన్నాను. దానికి ఆయన ఇది నీ రెమ్యునరేషనే అన్నారు. అలా ఆయన నుంచి ఇప్పటివరకూ నా ప్రయాణం కొనసాగుతోంది. ఇప్పటివరకూ సుమారు ఐదు వేల పాటలు పాడాను.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Canada: కెనడాలో ఓ పెళ్లివేడుకలో పంజాబీ గ్యాంగ్‌స్టర్ హత్య..!
-
India News
Wrestlers Protest: రెజ్లర్ల ఫొటోలు మార్ఫింగ్.. మండిపడ్డ సాక్షి మలిక్
-
Crime News
Kurnool: భర్తకు ఇంట్లోనే దహన సంస్కారాలు చేసిన భార్య
-
Sports News
Dhoni - CSK: ‘ఇంపాక్ట్ ప్లేయర్ రూల్’ ధోనీకి వర్తించదట.. కారణం చెప్పిన సెహ్వాగ్!
-
India News
IAF: వాయుసేన అపాచీ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్