MohanBabu: పరిటాల రవి నా సోదరుడు.. భావోద్వేగానికి గురైన మోహన్‌బాబు

పరిటాల రవి గొప్ప వ్యక్తి అని.. తనకో మంచి సోదరుడని నటుడు మోహన్‌బాబు అన్నారు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతోన్న ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి...

Published : 01 Oct 2021 16:26 IST

హైదరాబాద్‌: పరిటాల రవి గొప్ప వ్యక్తి అని.. తనకో మంచి సోదరుడని నటుడు మోహన్‌బాబు అన్నారు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతోన్న ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి మోహన్‌బాబు ముఖ్య అతిథిగా విచ్చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గతవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో మోహన్‌బాబు తన సినీ కెరీర్‌కు సంబంధించి ఎన్నో విశేషాలు చెప్పారు. నటుడిగా తన కెరీర్‌ ఎలా ప్రారంభమైంది? ఇండస్ట్రీలోకి రావడానికంటే ముందు తాను ఎలాంటి ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నాను? ఇలా చాలా విషయాలు మోహన్‌బాబు తెలియజేశారు.

కాగా, వచ్చే సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ఓ సరికొత్త ప్రోమో విడుదలైంది. ఇందులో మోహన్‌బాబు.. తన వ్యక్తిగత జీవితాన్ని కొంతమేర తెలియజేశారు. పరిటాల రవితో ఉన్న అనుబంధం గురించి చెప్పాలని ఆలీ కోరగా.. ‘ఆలీ నేను నా జీవిత చరిత్ర రాయాలనుకుంటున్నాను. కానీ, ఇప్పుడు నువ్వు నా జీవితం మొత్తాన్ని ఇక్కడే అడిగేస్తున్నావు. పరిటాల రవి గొప్ప వ్యక్తి. నాకో మంచి సోదరుడు. అతని అకాల మరణం వల్ల నేనొక మంచి సోదరుడిని కోల్పోయాను’ అంటూ మోహన్‌బాబు ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం ఆయన ‘పెదరాయుడు’ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో నా తండ్రి పాత్ర (పాపారాయుడు) చేయడానికి రజనీకాంతే ఆసక్తి కనబరిచారు. అతడో గొప్ప స్నేహితుడు’ అని మోహన్‌బాబు అన్నారు. ‘మేజర్‌ చంద్రకాంత్‌’తోపాటు ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధం గురించి మోహన్‌బాబు ఏం చెప్పారో తెలియాలంటే వచ్చే సోమవారం వరకూ వేచి చూడాల్సిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని