Allu Arjun: కెరీర్‌లోనే పుష్ప ప్రత్యేకమైంది

ఎప్పుడూ స్టైల్‌గా కనిపించే అల్లు అర్జున్‌ ఒక్కసారిగా తన అవతారాన్నే మార్చేశారు. అదంతా ‘పుష్ప’రాజ్‌ మహిమే! సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’... అల్లు అర్జున్‌లోని మాస్‌ అవతారాన్ని డిమాండ్‌ చేసింది. ‘నా దృష్టిలో ఇది ఊర మాస్‌ కాదు, నేల మాస్‌’ అంటున్నారు అల్లు అర్జున్‌.

Updated : 15 Dec 2021 07:14 IST

ఎప్పుడూ స్టైల్‌గా కనిపించే అల్లు అర్జున్‌ ఒక్కసారిగా తన అవతారాన్నే మార్చేశారు. అదంతా ‘పుష్ప’రాజ్‌ మహిమే! సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’... అల్లు అర్జున్‌లోని మాస్‌ అవతారాన్ని డిమాండ్‌ చేసింది. ‘నా దృష్టిలో ఇది ఊర మాస్‌ కాదు, నేల మాస్‌’ అంటున్నారు అల్లు అర్జున్‌. ఆయన కథానాయకుడిగా నటించిన ‘పుష్ప’ ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...

‘పుష్ప’ అసలు ఎలా మొదలైంది?

నేను, సుకుమార్‌ మంచి స్నేహితులం. వ్యక్తిగత విషయాలు పంచుకునేంత చనువు మా మధ్య ఉంది. మేం ‘ఆర్య’ తర్వాత ‘ఆర్య2’ చేశాం. ఆ తర్వాతే చాలా విరామం వచ్చింది. మధ్యలో కలిసినప్పుడంతా మనం సినిమా చేద్దాం అనుకునేవాళ్లం. పది నిమిషాలే ఈ స్క్రిప్ట్‌ చెప్పారు. వెంటనే చేసేద్దాం అని చెప్పా. మాకు మైత్రీ మూవీ మేకర్స్‌ తోడైంది. అలా మొదలైందీ చిత్రం. సుకుమార్‌ కథ చెప్పేటప్పుడే ఇది ఒక సినిమాలో చెప్పలేమేమో అనిపించింది. దాదాపు 4 గంటల కథలా అనిపించింది. ఈ సినిమా ప్రయాణంలోనే మేం రెండు భాగాలుగా తీసుకురావాలని నిర్ణయించాం.

ఈ ప్రయాణం ఎలా సాగింది?

23 నెలల ప్రయాణం ఈ సినిమా. లాక్‌డౌన్‌లోనూ నా మనసులో ఈ సినిమానే తిరిగింది. మా చిత్రబృందం అంతా వీడియో కాల్స్‌లో మాట్లాడుకుంటూ పనిచేశాం. నేను చిత్తూరు యాసపై మరింత పట్టు సంపాదించా. కరోనా అంతరాయం కలిగించినా సినిమాని ఎలాగైనా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించాం. ఎందుకంటే మరో భాగం సినిమా ఉంటుంది కదా, రెండూ ఒకే ఏడాదిలో వస్తే బాగోదని మేం పనిచేశాం. అనుకున్నట్టుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం.

మీకు ఎదురైన సవాళ్లేంటి?

అతి పెద్ద సవాల్‌ అంటే మారేడుమిల్లి అడవుల్లో చిత్రీకరణ చేయడమే. మన పక్కనే అంత మంచి అడవి, అంత మంచి లొకేషన్‌ ఉందని ఇన్నాళ్లూ  తెలుసుకోలేకపోయాం. ఎవరూ వెళ్లని, రహదారులు లేని ప్రాంతాలకి అడవిలో ఒకట్రెండు కిలోమీటర్లు లోపలికి వెళ్లి చిత్రీకరణ చేశాం. మేం వెళ్లడానికి ప్రత్యేకంగా రోడ్డు వేసినా, వర్షాలు పడటంతో అది కొట్టుకుపోయేది. రోజూ 400 వరకు మా వాహనాలు ఆ రోడ్డుమీదుగా వెళ్లి, చిత్రీకరణ చేసుకుని ఒక దాని తర్వాత మరొకటి తిరిగొచ్చేవి. ఈ ప్రయాణం మాకో సవాల్‌ అనే కాదు, ఇదొక అందమైన అనుభవం కూడా. చిత్రీకరణ చేసినన్నాళ్లూ అడవిని పరిశుభ్రంగా ఉంచే ప్రయత్నం చేశాం. మనం పాడు చేయకపోతే చాలు, అవి సహజంగానే అందాన్ని సంతరించుకుంటాయి.

పాత్ర కోసం చాలా మారిపోయినట్టున్నారు..?

నాకే బోర్‌ కొట్టింది. మారాలని అనిపించింది. పుష్పరాజ్‌ అనేది ఓ కల్పితమైన పాత్ర. కూలీగా, రవాణా చేసే వ్యక్తిగా, స్మగ్లర్‌గా... ఇలా మూడు కోణాల్లో కనిపిస్తా. ఆ పాత్రకి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు మారేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. మేకప్‌కే రెండు గంటల సమయం పట్టింది. తొలగించడానికి అర గంటపైనే పట్టేది. ఈ స్థాయి మేకోవర్‌తో నేనే సినిమా చేయలేదు. హాలీవుడ్‌లో ప్రాస్థెటిక్‌ మేకప్‌ ఎలా చేస్తారు? ఆ ప్రయాణం ఎలా ఉంటుందో ఈ సినిమాతో తెలిసొచ్చింది. యాస గురించి చాలా కసరత్తులే చేశా. స్క్రిప్ట్‌లో ఉన్న సంభాషణల్ని పలకడమే కాదు, సహజంగా ఓ మాటని రాయలసీమ యాసలో ఎలా మాట్లాడతారో అలా మాట్లాడేంత పట్టు వచ్చేలా నేను కసరత్తులు చేశా. ఒక భుజం పైకి లేపి కనిపిస్తూ నటించాల్సి వచ్చింది. 2005, 2011లో నా భుజానికి గాయమైంది. శస్త్రచికిత్స జరిగింది. మళ్లీ ఈ సినిమా కోసం అదే భుజంపైకి లేపి నటించాల్సి రావడంతో చాలా నొప్పి వచ్చేది. ‘పుష్ప’కి నా కెరీర్‌లో చాలా ప్రత్యేకత ఉంది. ఈ సినిమాని చూసి ఎవరెలా స్పందిస్తారో తెలుసుకోవాలనే ఆత్రుత నాలో ఉంది. నా కెరీర్‌లో తొలిసారి ఇలాంటి ఓ అభిప్రాయం కలిగింది.

‘పుష్ప’తో పాన్‌ ఇండియా స్థాయికి వెళుతున్నారు. ఇది ముందే అనుకున్నదా?

ఇది పాన్‌ ఇండియా స్థాయి కావాలని చేసిన సినిమా కాదు. పక్కా తెలుగు సినిమాలాగే ప్రొడక్ట్‌ బాగుంటే చాలని చేశాం. అదే సమయంలో దీన్ని భిన్న భాషల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించాం. పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారనేది చూడాలి. అంతే కానీ ఇది ‘బాహుబలి’, ‘కేజీఎఫ్‌’ తరహా సినిమా కావాలనైతే చేయలేదు. నా చిత్రాలు మలయాళంలో బాగా ఆడతాయి. కన్నడలోనూ చూస్తుంటారు. తొలిసారి ఈ సినిమాని కన్నడ, తమిళం, హిందీల్లో అనువదించి తీసుకెళుతున్నాం. కథల ఎంపిక విషయంలో మరీ ఎక్కువగా ఆలోచించను. వేసే ఆ ఒక్క అడుగు గురించే ఆలోచిస్తాను తప్ప, మరీ ఎక్కువ దూరం ఆలోచించను. నేను, సుకుమార్‌ ఇది హిట్‌ కావాలని పనిచేశాం తప్ప, తను ఇదివరకు ఏం చేశాడో, నేను ఇదివరకు ఏం చేశానో అనే వాటి గురించి ఆలోచించలేదు. ఫహాద్‌ ఫాజిల్‌, రష్మిక తదితరులతో కలిసి నటించడం మంచి అనుభవం. రష్మిక చాలా అందమైన నటి. సమంత మాపై ఎంతో నమ్మకంతో ప్రత్యేక గీతం చేశారు. దేవిశ్రీప్రసాద్‌, చంద్రబోస్‌ కలిసి మరోసారి చాలా మంచి పాటలు ఇచ్చారు. ఛాయాగ్రాహకుడు క్యూబా ప్రత్యేకమైన కన్నుతో విజువల్స్‌ని చూశారా అనేలా ఉంటాయి సన్నివేశాలు.  

తదుపరి ‘పుష్ప2’ కోసమే రంగంలోకి దిగుతారా?

మొదటైతే నాకు ఒక నెల విరామం కావాలండీ (నవ్వుతూ). ఆ తర్వాతే మిగతా విషయాలు ఆలోచిస్తా.


ఏపీలో సినిమా టికెట్‌ ధరలపై కోర్టు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఇది మీకు కలిసొచ్చే విషయం కదా?

ఆ విషయం చాలా ఆనందాన్నిచ్చింది. ఇందులో ప్రభుత్వ సహకారం చాలా ఉంది. పరిశ్రమ ప్రభుత్వంతో పలుమార్లు చర్చలు జరుపుతూ వచ్చింది. సమస్యలన్నిటినీ వాళ్ల దృష్టికి తీసుకెళ్లింది. రెండేళ్లుగా ఇబ్బందులు పడుతున్న పరిశ్రమకి ఇది ఊరటనిచ్చే విషయం. ప్రభుత్వం అనుకోనిదే ఇలాంటి నిర్ణయాలు వెలువడేవి కావు.


‘‘ముందస్తు విడుదల వేడుకలో రాజమౌళి సర్‌ మాటలు నా మనసుని తాకాయి. ఆయనతో సినిమా చేయాలని ఏ హీరోకి ఉండదు? మీతో కలిసి సినిమా చేయాలనుందని నేనూ అడిగా. తప్పకుండా చేద్దాం, నేను చేయాలనుకునే హీరోల్లో నువ్వూ ఒకడివి’ అని చెప్పారు. కచ్చితంగా ఏదో ఒక రోజు ఇద్దరం కలిసి సినిమా చేస్తామని నమ్ముతున్నా’’.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు