Allu Arjun: మా మావయ్య చిరంజీవి సూపర్‌ డ్యాన్సర్‌: బన్నీ

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ అంటే తనకు అమితమైన అభిమానమని నటుడు అల్లుఅర్జున్‌ అన్నారు. ‘పుష్ప’ ప్రమోషన్స్‌లో భాగంగా గురువారం ఉదయం ఆయన ముంబయిలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పాల్గొని...

Updated : 16 Dec 2021 16:02 IST

అరవింద్‌గారూ.. మాతో కూడా సినిమా చేయండి : అల్లు అర్జున్‌

రీమేక్‌లు అంటే నాకు భయం

హైదరాబాద్‌ : బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ అంటే తనకు అమితమైన అభిమానమని నటుడు అల్లుఅర్జున్‌ అన్నారు. ‘పుష్ప’ ప్రమోషన్స్‌లో భాగంగా గురువారం ఉదయం ఆయన ముంబయిలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పాల్గొని పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. రష్మిక, దేవిశ్రీ ప్రసాద్‌తో కలిసి సినిమా గురించి ఆయన పంచుకున్న పలు విశేషాలివే..

‘‘ముంబయిలో మాకు భారీగా స్వాగతం పలికిన మీకు అందరికీ ధన్యవాదాలు. నటుడిగా ఇదే నా మొదటి జాతీయ మీడియా సమావేశం. ఇది నా జీవితంలో గర్వించదగ్గ రోజు. మా సినిమాలు ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ మరోసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. నేను ఇప్పటివరకూ వేరే భాషా చిత్రాల్లో నటించలేదు. కానీ నా సినిమాలు వేరే భాషల్లో అనువాదమై.. అక్కడి ప్రేక్షకులను కూడా అలరిస్తున్నాయి. అందుకు నేను అదృష్టవంతుడ్ని’’- అల్లు అర్జున్‌

ఒక ప్రాజెక్ట్‌ని ఓకే చేసేటప్పుడు మీరు ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారు..? 

అల్లు అర్జున్‌: కథ. అది ప్రేక్షకులకు నచ్చుతుందా? లేదా? అనేది ఎక్కువగా ఆలోచిస్తుంటాను.

‘పుష్ప’ లాంటి సినిమాలో తెరకెక్కించడంలో మీరు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా?

అల్లు అర్జున్‌: ‘పుష్ప’ నాలుగు సినిమాల కష్టం. ఈ సినిమా తెరకెక్కించడం ఎంతో శ్రమతో కూడుకున్నది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే సినిమా కావడం వల్ల షూటింగ్‌ ఎక్కువభాగం అటవీ ప్రాంతాల్లోనే జరిగింది. ప్రతిరోజూ సుమారు 500 మంది ఈ సినిమా కోసం పనిచేసేవాళ్లు. ఎలాంటి సౌకర్యాలు లేని మారుమూల ప్రాంతాల్లో వాళ్లకు కనీస వసతులు కల్పించడం కూడా సాధ్యమయ్యేది కాదు. ముఖ్యంగా కొవిడ్‌ పరిస్థితుల్లో అంత మంది టీమ్‌ని అన్నివిధాలుగా సంరక్షించుకోవడం సాధారణమైన విషయం కాదు. క్రెడిట్‌ మొత్తం దర్శకుడు, నిర్మాతలకే దక్కుతుంది. 

హాలీవుడ్‌ సినిమా ‘స్పైడర్‌మ్యాన్‌’ నేడే రిలీజ్‌ అయ్యింది. రేపు మీ సినిమా రిలీజ్‌ అవుతుంది కదా. బాక్సాఫీస్‌ వద్ద క్లాష్‌ ఉంటుందని మీరు అనుకుంటున్నారా?

అల్లు అర్జున్‌: సినిమాలకు భాష ఎప్పటికీ అడ్డంకి కాదు. బాలీవుడ్‌ చిత్రాలను దక్షిణాదిలో మేము స్వాగతిస్తున్నాం. అలాగే మా సినిమాలను ఇక్కడ ప్రేక్షకులకు ఆదరిస్తున్నారు. దక్షిణాది, ఉత్తరాది అనేది పక్కన పెడితే మనది ఇండియన్‌ సినిమా. ఇండియన్‌ సినిమాకి విదేశాల్లో మంచి మార్కెట్‌ ఉంది. అక్కడి సినిమాలకు ఇక్కడా మంచి మార్కెట్‌ ఉంది. నా ఉద్దేశం ప్రకారం సినిమా ఏ ప్రాంతానికి చెందినదైనా సరే.. మరలా మనం సినిమాని సెలబ్రేట్‌ చేసుకోవడమే నాకు కావాలి.

మీ తదుపరి చిత్రాలు పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేస్తారా?

అల్లు అర్జున్‌: ఇకపై నేను చేసే ప్రాజెక్ట్‌లన్నీ పాన్‌ ఇండియా సినిమాలయ్యేలా ప్రయత్నిస్తా. పాన్‌ ఇండియా అనే కాదు.. వివిధ దేశాల్లో ఉన్న ప్రేక్షకులకు సినిమా మరింత దగ్గరయ్యేలా ప్రయత్నించాలని నా ఉద్దేశం. అంటే వివిధ విదేశీ భాషల్లోనూ సినిమా అందుబాటులోకి వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా.

మీరు బాలీవుడ్‌ సినిమాలు చూస్తారా?

రష్మిక: సినీ పరిశ్రమలోకి రాకముందు నేను కూడా ఒక ప్రేక్షకురాలినే. కాబట్టి, థియేటర్‌కు వెళ్లి సినిమాలు సరదాగా చూసేదాన్ని.. ఎంజాయ్‌ చేసేదాన్ని. నటిని కావడం వల్ల సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సమయం దొరికినప్పుడు నచ్చిన సినిమా చూస్తుంటా.

అల్లు అర్జున్‌: పుట్టి పెరిగింది చెన్నై.. స్థిరపడింది హైదరాబాద్‌లో కావడంతో ఆయా భాషా చిత్రాలు చిన్నప్పుడు ఎక్కువగా చూసేవాడిని. నటుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టాక.. బెంగాళీ, హిందీ.. ఇలా అన్ని భాషా చిత్రాలను వీక్షిస్తున్నాను. ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాను.

మీకు ఇష్టమైన బాలీవుడ్‌ స్టార్‌ ఎవరు? ఒకవేళ మీరు రీమేక్‌ చేయాలనుకుంటే ఏ సినిమాని రీమేక్ చేస్తారు? ఎందుకు?

అల్లు అర్జున్‌: హిందీలో ఉన్న నటీనటులందరూ నాకు ఇష్టమే. బాలీవుడ్‌లో గొప్పనటీనటులు ఉన్నారు. ఎన్నో గొప్ప సినిమాలు ఈ పరిశ్రమ నుంచి వచ్చాయి. సాధారణంగా నేను రీమేక్‌ల జోలికి వెళ్లను. నాకు రీమేక్‌లు చేయడమంటే భయం. అందుకే ఏదీ రీమేక్‌ చేయాలని లేదు.

పాన్‌ ఇండియా స్టార్‌గా మిమ్మల్ని ఎంతోమంది స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. మరి, మీకు ప్రేరణ ఎవరు?

అల్లు అర్జున్‌: నేను అమితాబ్‌ బచ్చన్‌ నుంచి స్ఫూర్తి పొందాను. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఇన్నేళ్ల వయసులోనూ ఆయన వెండితెర వేదికగా ఎంతో మంది ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు.

ఈ సినిమాలో మీకు కష్టంగా అనిపించింది ఏమిటి?

రష్మిక: రోడ్లు సరిగ్గా లేని మారుమూల ప్రాంతాల్లో షూట్‌ చేయడం ఎంతో కష్టంతో కూడుకున్నది. టీమ్‌ మొత్తం కష్టపడి పనిచేయడం వల్లే మా సినిమా చక్కగా రూపుదిద్దుకుంది. ఇది చిత్రబృందం సమష్టి కృషి.

అల్లు అర్జున్‌: ఈ సందర్భంగా నేను ‘పుష్ప’ టీమ్ మొత్తానికి నా కృతజ్ఞతలు చెప్పాలి. అందరూ కలిసి వర్క్‌ చేయడం వల్లే ఈ సినిమా చక్కగా సిద్ధమైంది.

డీ గ్లామర్‌ రోల్‌ చేయడం వల్ల బాధపడ్డారా?

రష్మిక: శ్రీవల్లి అనేది డీగ్లామర్‌ రోల్‌ అని నాకు ముందే తెలుసు. సుకుమార్‌ డైరెక్షన్‌లో బన్నీతో నటించే అవకాశం రావడం.. కథ నచ్చడంతో ఓకే చేసేశాను. ఈ సినిమా షూటింగ్ అన్ని రోజులు ఒకటే ఆలోచన.. ఆయన పక్కన నేను బాగా చేయగలుగుతున్నానా? లేదా? ప్రతి సీన్‌ డైరెక్టర్‌ చెప్పినట్టే చేస్తున్నానా? లేదా? దీని గురించే నేను ఎక్కువగా ఆలోచించాను తప్ప డీగ్లామర్‌ రోల్‌ గురించి అస్సలు బాధపడలేదు.

అల్లు అర్జున్‌: రష్మికకు ఇది ఛాలెంజింగ్‌ రోల్‌. ఆమె ఈసినిమాలో అదరగొట్టేసింది. సినిమా విడుదలయ్యాక తప్పకుండా అందరూ మెచ్చుకుంటారు.

మీలో ఎక్కువగా రజనీకాంత్‌ మేనరిజమ్స్‌ కనిపిస్తున్నాయి దానిపై మీ కామెంట్‌?

అల్లు అర్జున్‌: నేను చెన్నైలో పుట్టి పెరగడం వల్ల దక్షిణాదికి చెందిన సూపర్‌స్టార్స్ నుంచి ఎక్కువగా ప్రేరణ పొందాను. అందరికీ తెలిసిన విషయమే మా మావయ్య చిరంజీవి. ఆయన సూపర్‌ డ్యాన్సర్‌. నేను కావాలని వాళ్లని ఇమిటేట్‌ చేయకపోవచ్చు కాకపోతే అవి సందర్భానుసారం అలా వచ్చేస్తాయేమో.

ఈ సినిమాని రెండు భాగాల్లో విడుదల చేయడానికి కారణమేమిటి?

అల్లు అర్జున్‌: ఇది చాలా పెద్ద కథ. రెండు గంటల్లో దాన్ని చూపించడం సాధ్యం కాని పని. అందుకే రెండు భాగాలుగా విడుదల చేస్తాం.

రెండో పార్ట్‌ గురించి ఏమైనా చెప్పగలరు?

అల్లు అర్జున్‌: మొదటి పార్ట్‌ విడుదలయ్యాక రెండో పార్ట్‌ గురించి మాట్లాడతాను. ఇప్పుడే ఆ సినిమా గురించి కామెంట్‌ చేయాలనుకోవడం లేదు.

పూర్తిస్థాయి డ్యాన్స్‌ జోనర్‌లో సినిమా చేయవచ్చు కదా?

అల్లు అర్జున్‌: డ్యాన్స్‌ జోనర్‌ సినిమా గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. సినిమాలో భాగమైనప్పుడు మాత్రమే డ్యాన్సని ఎంజాయ్‌ చేయగలమని నా భావన.

మీ నాన్న నిర్మాత కదా. మరి, డైరెక్ట్‌ హిందీ సినిమాలో ఎప్పుడు యాక్ట్‌ చేస్తారు?

అల్లు అర్జున్‌: మా నాన్న అల్లు అరవింద్‌ నిర్మాత. ఆయన బాలీవుడ్‌ స్టార్స్‌తో సినిమాలు ప్రొడ్యూస్‌ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ వేదికగా అడుగుతున్నా.. ‘‘అరవింద్‌ గారూ మాతో కూడా డైరెక్ట్‌ హిందీ సినిమా చేయండి’’ (నవ్వులు)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని