AlluArjun: పునీత్‌ ఫ్యామిలీని ఇప్పుడు కలవాలనుకోవడం లేదు: బన్నీ

‘పుష్ప’ ప్రమోషన్స్‌ జోరుగా సాగుతున్నాయి. తాజాగా అల్లు అర్జున్‌, రష్మిక ఇతర చిత్రబృందం బెంగళూరులో నిర్వహించిన స్పెషల్‌ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ప్రెస్‌మీట్‌ సుమారు రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభం కావడంపై...

Updated : 15 Dec 2021 15:02 IST

ప్రెస్‌మీట్‌ ఆలస్యమవడంపై మీడియా అసంతృప్తి... క్షమాపణలు చెప్పిన బన్నీ

బెంగళూరు: ‘పుష్ప’(Pushpa) చిత్రం కోసం ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా అల్లు అర్జున్‌, రష్మిక ఇతర చిత్రబృందం బెంగళూరులో నిర్వహించిన స్పెషల్‌ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ప్రెస్‌మీట్‌ సుమారు రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభం కావడంపై మీడియా అసంతృప్తి వ్యక్తం చేయడంతో బన్నీ క్షమాపణలు చెప్పారు. ఆ ప్రెస్‌మీట్‌ విశేషాలివే..!

‘‘పుష్ప’ ప్రమోషన్స్‌లో భాగంగా బెంగళూరు రావడం ఆనందంగా ఉంది. ఈ ప్రాంతంలో పుట్టకపోయినా చిన్నప్పుడు సెలవుల్లో ఎంజాయ్‌ చేయడానికి ఎక్కువగా ఇక్కడికే వస్తుండేవాళ్లం. బెంగళూరులో నా సినిమాలు విడుదలవుతాయని కలలో కూడా ఊహించలేదు. రష్మిక నాకు బాగా నచ్చిన అమ్మాయి. మంచి నటి. తెలుగు, హిందీ, ఇలా పలు ఇండస్ట్రీల్లో తన సత్తా చూపిస్తోంది. ఇక, నా స్నేహితుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణవార్త నన్ను కలచి వేసింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ‘పుష్ప’ బిజీ వల్ల నేను బెంగళూరు రాలేకపోయా. ఇప్పుడు బెంగళూరు వచ్చినప్పటికీ పునీత్‌ కుటుంబాన్ని కలవాలనుకోవడం లేదు. ఎందుకంటే, ‘పుష్ప’ ప్రమోషన్స్‌కి వచ్చి కలిశాననిపించుకోవడం నాకు నచ్చదు’’ అని బన్నీ తెలిపారు.

ఉదయం 11.15 గంటలకి ప్రెస్‌మీట్‌ అన్నారు. 1.15 గంటలకు ప్రారంభించారు. ఎందుకు ఆలస్యమైంది?

బన్నీ: ఆలస్యమైనందుకు క్షమించండి. మేము ప్రైవేటు ఫ్లైట్‌లో వచ్చాం. పొగమంచు కారణంగా ఫ్లైట్‌ టేకాఫ్‌లో ఇబ్బందులు తలెత్తాయి. అందుకే ఈ ప్రోగ్రామ్‌ ఆలస్యమైంది. మీడియా మొత్తానికి నా క్షమాపణలు. సారీ చెబితే మనిషి పెరుగుతాడు. ఎక్కడా తగ్గడని నా అభిప్రాయం.

ఈ సినిమా ట్రైలర్‌ చూస్తుంటే ఎర్రచందనం స్మగ్లర్‌ వీరప్పన్‌ గుర్తుకు వస్తున్నారు?ఈ కథకు ఆయనకు ఏమైనా సంబంధం ఉందా?

బన్నీ: ఈ సినిమా బ్యాక్‌డ్రాప్‌ ఎర్రచందనం స్మగ్లింగ్‌. ఇది ఒక ఫిక్షనల్‌ స్టోరీ.

ఈ సినిమాకి గానూ మీకు జాతీయ అవార్డు వస్తుందని దేవిశ్రీ ప్రసాద్‌ అన్నారు. దానిపై మీ అభిప్రాయం ఏమిటి?

బన్నీ: ఆయన నా స్నేహితుడు. ‘పుష్ప’కి గానూ బన్నీకి నేషనల్‌ అవార్డు వస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. వస్తుందని చెప్పలేదు. డీఎస్పీ కామెంట్‌ మీద నేను స్పందించకూడదు. ప్రేక్షకులు మాత్రమే స్పందించాలి.

చిత్తూరులో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కినట్లు సమాచారం. దానిపై మీ కామెంట్‌?

ధనుంజయ్‌: ఆ సంఘటనలకు ‘పుష్ప’ చిత్రానికీ ఎలాంటి సంబంధం లేదు. ఇది మొత్తం ఫిక్షనల్‌ మాత్రమే.

కర్ణాటకలో ఎంతవరకూ వసూళ్లు రాబడుతుందని భావిస్తున్నారు?

బన్నీ: కథ నచ్చితే ప్రేక్షకులు తప్పకుండా సినిమాని ఆదరిస్తారని నమ్ముతాను. ఎంత వసూళ్లు సాధిస్తుందనేది చెప్పలేను. మా సినిమా ప్రేక్షకులందరికీ నచ్చుతుందా? లేదా? అనేది మాత్రమే నేను చూసుకుంటా.

‘పుష్పరాజ్‌’ పాత్రలో నటించడంపై మీ అనుభవం ఎలా ఉంది?

బన్నీ: అటవీ ప్రాంతాల్లోనే ఈ సినిమా షూటింగ్‌ జరిగింది. ఈ సినిమా షూట్‌ ఎంతో కష్టతరమైంది.  ఇప్పటివరకూ నేను ఇలాంటి సినిమా చేయలేదు. అటవీ ప్రాంతంలో సౌకర్యాలు కూడా సరిగ్గా ఉండేవి కాదు. దానివల్ల 200 మంది టీమ్‌ సభ్యులకు బస ఏర్పాటు చేయడం కూడా కష్టంగా ఉండేది. ఈ క్రెడిట్‌ మొత్తం నిర్మాతలకే.

రష్మిక.. మీరు కన్నడలో ఎందుకు డబ్బింగ్‌ చెప్పించుకున్నారు?

బన్నీ: ఈ సినిమా కన్నడ డబ్బింగ్ తనే చెబుతానంది. కాకపోతే షూట్, తెలుగు డబ్బింగ్‌ పూర్తయ్యేసరికి సమయం లేకపోవడంతో మేము డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌తో ఆమె పాత్రకు వాయిస్‌ ఇప్పించాల్సి వచ్చింది.

రష్మిక: కన్నడలో డబ్బింగ్ చెప్పడానికి ట్రై చేశాను. కాకపోతే సమయం లేకపోవడంతో వేరే వాళ్లతో వాయిస్‌ ఇప్పించాల్సి వచ్చింది. తప్పకుండా పార్ట్‌-2కి నేనే డబ్బింగ్‌ చెప్తా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని