Bigg Boss Telugu 5: అలా ‘గుంటనక్క’గా పేరొచ్చింది.. ఆ ముగ్గురిలో ఒకరికి టైటిల్‌:రవి

యాంకర్‌ రవి ఇంటర్వ్యూ. ‘బిగ్‌బాస్‌’ గురించి రవి పంచుకున్న సంగతులివీ...

Published : 30 Nov 2021 01:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘యాంకర్‌ రవిగా కాదు జస్ట్‌ రవిగానే ‘బిగ్‌బాస్‌’ ఎంట్రీ ఇచ్చా. ఈ షో వల్ల చాలామంది తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యా’ అని రవి అన్నారు. అనూహ్య రీతిలో ‘బిగ్‌బాస్‌’ నుంచి ఎలిమినేట్‌ అయిన ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘బిగ్‌బాస్‌’ ఇంటి సభ్యుల గురించి తన అభిప్రాయాల్ని పంచుకున్నారు. ఆ ఆసక్తికర సంగతులివీ..

అప్పుడు ఫిక్స్‌ అయ్యా!

‘‘యాంకర్‌ రవిని ప్రేక్షకులు చూశారు. జస్ట్‌ రవిగానే పరిచయమవుదామనుకుంటున్నా’ అని షోలో అడుగుపెట్టక ముందే నాగార్జున సర్‌తో చెప్పా. నాకే ఎక్కువ ఓట్లు వస్తాయని నేను ఎప్పుడూ అనుకోలేదు. నా ఆటపై నాకు నమ్మకం ఉండేది. ఆ నమ్మకంతోనే టాప్‌ 5లో ఉంటాననుకున్నా. కానీ, అనుకోకుండా బయటికు వచ్చా. ‘బిగ్‌బాస్‌ హౌజ్‌ నుంచి నువ్వు ఎందుకు వెళ్తావ్‌. నువ్వు చాలా స్ట్రాంగ్‌. నేను వెళ్లిపోతానేమో’ అని కాజల్‌ నాతో చెప్పింది. సరే ఏం జరుగుతుందో చూద్దామన్నా. ఫ్రీ ఎవిక్షన్‌ పాస్‌ విషయం గుర్తొచ్చాక ఫిక్స్‌ అయిపోయా. ‘అయిపోయిందిరా మన జర్నీ.. గుండెను రాయి చేసుకో’ అని మనసులో నాతో నేనే అనుకున్నా’’

అందుకు ఫీల్‌ అవ్వలేదు

‘‘బిగ్‌బాస్‌ షో కన్నా ముందే నటరాజ్‌ మాస్టర్‌తో నాకు పరిచయం ఉంది. ఎన్నో ఈవెంట్స్‌, డ్యాన్స్‌ షోలు కలిసి చేశాం. అక్కడ చూసిన నటరాజ్‌ మాస్టర్‌ వేరు, బిగ్‌బాస్‌లో చూసిన నటరాజ్‌ మాస్టర్‌ వేరు. నేను ఆయన గేమ్‌ని చెడగొడతాననే ఉద్దేశంతో నాతో మాట్లాడేవారాయన. తనని నేను నామినేట్‌ చేసినప్పుడు ఈ విషయం చెప్పా. నేను ఎవరితోనైనా మాట్లాడుతూ తన వైపు చూస్తే చాలు ఆయన గురించే చెబుతున్నాననుకునేవారు. మేం వేరే విషయాల గురించి మాట్లాడుకుంటుంటే ఆయన తన గురించి అనుకునేవారు. అలా ‘గుంటనక్క’ అని నాకు పేరు పెట్టారు. దాన్ని నేను అంగీకరించలేదు. అందుకే నా ఎలాంటి ఫీలింగ్‌ లేదు. సన్నీ ఓసారి నన్ను ఫేక్‌ అన్నాడు. దానికీ నేను ఫీల్‌ అవలేదు. నేను సరదాగా చెప్పిన మాటలకు ఒకానొక సమయంలో షణ్ముఖ్‌ ప్రభావితమయ్యాడు. అంతేకానీ నేను కావాలని ఎవరినీ ఇన్‌ఫ్లూయెన్స్‌ చేయలేదు’’

అదేంటో నాకు తెలియదు

‘‘నాకు సేఫ్‌గేమ్‌ అంటే ఏంటో కూడా తెలియదు. నా ఆట నేను ఆడేవాడ్ని. నామినేట్‌ విషయంలోనూ నేను బాధ పడలేదు. ఒకర్ని నామినేట్‌ చేసేందుకు సరైన కారణం ఉన్నా స్నేహం వల్ల వారిని చేయలేక మరొకరిని చేయాల్సి వస్తుంది. అలా నేను మైండ్‌ ఎక్కువవాడతానని పింకీ నన్ను నామినేట్‌ చేసింది. తను చెప్పిన విధానం నాకు నచ్చింది. నేను స్ట్రాంగ్‌ అయినప్పుడు ఎందుకు ఫీలవుతా’’

ఈ ముగ్గురి గురించి..

‘‘బిగ్‌బాస్‌’ హౌజ్‌లో నా కన్నా అనర్హుడు మానస్‌ అని నా అభిప్రాయం. ఎందుకంటే ఆయన ధైర్యంగా ఆడటం లేదు. నాకు ఇష్టమైన వ్యక్తి లోబో. కాజల్‌ ఇంట్లో ఉంటే అనవసరమైన గొడవలు జరుగుతుంటాయి. కాజల్‌ నేనూ స్నేహితులం. ఆ చనువుతోనే ఓ సందర్భంలో ఆమె నా చొక్కా కాలర్‌లాగి నన్ను కొట్టింది. నన్ను ఎవరైనా కొడితే తట్టుకోలేను. విపరీతమైన కోపం వస్తుంది. అదే ఆమెపై చూపించా’’

ఒక్క మాటలో..

నా కన్నా వీక్‌ ప్లేయర్స్‌: పింకీ, మానస్‌.

ఒకవేళ నేను టాప్‌ 5లో ఉంటే: సిరి, శ్రీరామచంద్ర, షణ్ముఖ్‌, సన్నీ, నేను. ఇప్పుడు నా స్థానంలో కాజల్‌.

జెస్సీ: చాలా స్ట్రాంగ్‌. తనో ఫైటర్‌. తన ఆరోగ్యం బాగుండుంటే కచ్చితంగా టాప్‌ 5లో ఉండేవాడు.

నటరాజ్‌ మాస్టర్‌: ఆయన మనసులో ఏదో పెట్టుకుని హౌజ్‌లోకి వచ్చారు. ఏదైనా అనుకుంటే అది అయిపోవాల్సిందే.

ఉమ: బాగా నవ్వించారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు.

కాజల్‌: వెరీ స్వీట్‌.

షణ్ముఖ్‌: నా డార్లింగ్‌. నేను ఒకటి చెబితే తను మరోలా అర్థం చేసుకుంటాడు. సిరి, షణ్ముఖ్‌ మధ్య స్వచ్ఛమైన స్నేహం ఉంది. షణ్ముఖ్‌ టాప్‌ 5లో నిలుస్తాడు. ఫైనలిస్టు అవుతాడు.

సరయు: అన్నయ్య అంటుంది. తను టీ బాగా పెడుతుంది. తన గేమ్‌ ఎలా ఉంటుందో చూడకముందే వెళ్లిపోయింది.

ప్రియ: తనని అక్క అని పిలుస్తా. అందరితోనూ చాలా జాగ్రత్తగా మాట్లాడుతుంది.

సన్నీ: ఏది అనిపిస్తే అది అనేస్తాడు. చాలా స్మార్ట్‌. ఎంటర్‌టైన్‌ చేస్తాడు.

సిరి: తన బలమేంటో తనకి తెలియదు. చిన్న విషయాలకు ఎమోషన్‌ అయిపోతుంది.

అమ్ము(లహరి): ఎందుకి వెళ్లిపోయిందో ఇప్పటికీ అర్థంకాదు.

పింకీ: హౌజ్‌మేట్స్‌ అంతా తనని ఇష్టపడతారు. మంచి వ్యక్తి.

మానస్‌: చాలా సైలెంట్‌. నెమ్మదస్తుడు తనేం చేస్తాడో ఎవరికీ తెలియదు. అయితే, మానస్‌కు ధైర్యం తక్కువ.

విశ్వ: ఎక్కువగా ఎమోషనల్‌ అవుతాడు.

లోబో: మంచి స్నేహితుడు.

యానీ మాస్టర్‌: స్వీట్‌, స్ట్రాంగ్‌, ఎమోషనల్‌. ఏదైనా విషయం గురించి ఎంత వరకు స్పందించాలో ఆమెకు తెలియదు.

హమీదా: ఆమెను చూడగానే మరో అరియానా అవుతుందనిపించింది. ఆమె మాట్లాడితే ఎదుటివారు సైలెంట్‌ అవ్వాల్సిందే.

శ్రీరామచంద్ర: ఛాంపియన్‌. ఎప్పుడు దేనికి ఎలా స్పందించాలో తనకి బాగా తెలుసు.

‘బిగ్‌బాస్‌’ వల్ల  చాలామంది తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాను. విజేతగా నిలవలేకపోయాను. ఎలిమినేట్‌ అవడానికి కారణాలేంటో చెక్‌ చేసుకుంటా. ఎప్పటిలానే ప్రేక్షకుల్ని అలరిస్తా. సన్నీ, శ్రీరామచంద్ర, షణ్ముఖ్‌.. ఈ ముగ్గురిలో ఎవరు గెలిచినా నేను సర్‌ప్రైజ్‌ అవ్వను. ఎందుకంటే ఈ ముగ్గరిలో ఒకరు విజేతగా నిలుస్తారనే నమ్మకం ఉంది.

Read latest Cinema News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని