Arjuna Phalguna: సంక్రాంతి ముందే మొదలవుతోంది

‘‘నేను సినిమాల్లోకి ఉత్తి చేతులతో కళను నమ్ముకుని వచ్చాను. నాకీ రోజు కోట్ల కంటే ఎక్కువ విలువైన ఆస్తి ఉంది. ఆ ఆస్తి నేను పరిచయం చేసిన నా దర్శకులే’’ అన్నారు కథానాయకుడు శ్రీవిష్ణు. ఇప్పుడాయన

Updated : 31 Dec 2021 09:45 IST

- శ్రీవిష్ణు

‘‘నేను సినిమాల్లోకి ఉత్తి చేతులతో కళను నమ్ముకుని వచ్చాను. నాకీ రోజు కోట్ల కంటే ఎక్కువ విలువైన ఆస్తి ఉంది. ఆ ఆస్తి నేను పరిచయం చేసిన నా దర్శకులే’’ అన్నారు కథానాయకుడు శ్రీవిష్ణు. ఇప్పుడాయన నటించిన చిత్రం ‘అర్జున ఫల్గుణ’. తేజ మార్ని దర్శకుడు. మ్యాట్నీ ఎంటర్‌ టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించింది. అమృత అయ్యర్‌ కథానాయిక. ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘శ్రీవిష్ణుని హీరో అనాలో.. ఆరిస్ట్‌ అనాలో.. యాక్టర్‌ అనాలో నాకు తెలియదు. లీడ్‌ చేస్తున్నప్పుడు హీరోనే అంటాం. ఆర్టిస్ట్‌గా ప్రతి సినిమాను కొత్తగా ప్రయత్నిస్తుంటాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా మంచి చిత్రాలు చేస్తూ.. కొత్త దర్శకులకు అవకాశం ఇస్తున్నాడు. తేజ తీసిన ఈ చిత్రం చూశా. బాగుంది. ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు. ‘‘జోహార్‌’ చూసినప్పుడు తేజ అదరగొట్టాడనిపించింది. ఇప్పుడీ చిత్రం ఇంకా బాగా వచ్చింది. ఈ సినిమా చూశాక పండక్కి ఇంటికి వెళ్తే ఇంకో రెండు రోజులు ఎక్కువ ఉండి వస్తార’’న్నారు దర్శకుడు వివేక్‌ ఆత్రేయ. దర్శకుడు తిరుమల కిషోర్‌ మాట్లాడుతూ ‘‘ఇండస్ట్రీలో నా ప్రతి కథలో ఉండేవాడు విష్ణు. తేజ మాటలతోనే తనెలాంటి సినిమా తీశాడో అర్థమైంది. ట్రైలర్‌ చూశాక నా ఆలోచన నిజమని అనిపించింది’’ అన్నారు. ‘‘ఓవైపు ‘ఆచార్య’లాంటి పెద్ద చిత్రాలు చేస్తూ.. మరోవైపు ‘అర్జున ఫల్గుణ’ లాంటి చిన్న సినిమాలు తీసుకొస్తున్నందుకు మ్యాట్నీ వాళ్లకు థ్యాంక్స్‌’’ అన్నారు దర్శకుడు వెంకటేష్‌ మహా. హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ ‘‘సినిమా మొత్తం ఓ అందమైన పెయింటింగ్‌లా ఉంటుంది. జగదీష్‌ తన షాట్స్‌తో పిచ్చెక్కించాడు. ప్రియదర్శన్‌ మరో బుడ్డి తమన్‌ కానున్నాడు. తేజ మార్ని పెద్ద ఫైర్‌ బ్రాండ్‌. షూటింగ్‌లో షేక్‌ ఆడించాడు. నేను నిజంగా భయపడ్డా. తేజ సినిమాలోని మిగతా నటులకు ఏ కథ చెప్పాడో కానీ, ప్రతి ఒక్కరూ హీరోలా చేసేశారు. ఒకరిద్దరు తప్ప సినిమా చూసిన వాళ్లంతా కాలర్‌ ఎగరేసి ఇదిరా మా గోదావరి జిల్లాలు అని చెప్పుకొంటారు. గోదావరి జిల్లాలో కనిపించే మంచి మనుషులు, అమాయకత్వాలు, సంప్రదాయాలు.. ఇవన్నీ ఇందులో కనిపిస్తాయి. ఈసారి సంక్రాంతి పండగ డిసెంబర్‌ 31 నుంచి జనవరి 15వరకు ఉంటుంది’’ అన్నారు. ‘‘నాలాంటి కొత్త దర్శకులకు శ్రీవిష్ణు ఓ ధైర్యం. ఈ కథ రాస్తున్నప్పుడే ఆయన్ని అనుకున్నా. సినిమా చూశాక ఆ విషయం మీరే చెప్తారు. ఈ చిత్రం చూశాక.. మంచి యాక్షన్‌, అందమైన ఎమోషన్స్‌తో సంక్రాంతి ముందే వచ్చిందనుకుంటారు’’ అన్నారు చిత్ర దర్శకుడు తేజ. ఈ కార్యక్రమంలో బెక్కెం వేణుగోపాల్‌, అన్వేష్‌రెడ్డి, దర్శకులు సుధీర్‌ వర్మ, సాగర్‌ కె.చంద్ర, హసిత్‌ గోలి, నాయిక అమృత, నటుడు మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని