
Unstoppable: వెన్నుపోటంటూ తప్పుడు ప్రచారం చేశారు: బాలకృష్ణ భావోద్వేగం
ఇంటర్నెట్ డెస్క్: తాను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్’ కార్యక్రమంలో నందమూరి తారక రామారావుని గుర్తుచేసుకుని బాలకృష్ణ భావోద్వేగానికి లోనయ్యారు. తాను ఎన్టీఆర్ కొడుకుల్లో ఒకడినని, ఆయన అభిమానుల్లో ఒకడినని అన్నారు. బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘అఖండ’ ఇటీవల విడుదలై మంచి విజయం అందుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఈ షోకి విచ్చేసి సందడి చేసింది. దర్శకుడు బోయపాటి, నటులు శ్రీకాంత్, ప్రజ్ఞ జైస్వాల్‌తో కలిసి బాలకృష్ణ అల్లరి చేశారు. ‘అఖండ’ సినిమాలోని డైలాగ్ చెప్పి విశేషంగా అలరించారు. శ్రీకాంత్ విలన్ పాత్ర తనకు బాగా నచ్చడంతో ‘నేనూ విలన్‌గా నటించేందుకు సిద్ధంగా ఉన్నా’ అని ప్రకటించారు. అయితే ఆ సినిమాలో హీరో కూడా తానే అవ్వాలనే షరతు పెట్టారు. ‘మీరు ప్రపంచానికి ప్రశ్నేమో నాకు మాత్రం సమాధానం’ అని బోయపాటి శ్రీను బాలకృష్ణపై ఉన్న అభిమానాన్ని చాటారు. ఈ హంగామా పూర్తయ్యాక బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ గురించి మాట్లాడారు. ‘వెన్నుపోటు అంటూ అప్పట్లో తప్పుడు ప్రచారం చేశారు. దాని గురించి చెప్తుంటే కళ్లలో నీళ్లొస్తాయి. ఎందుకంటే నేను ఆయన కొడుకుల్లో ఒకడిని.. ఆయన అభిమానుల్లో ఒకడిని’ అంటూ హృదయాల్ని బరువెక్కించారు.
► Read latest Cinema News and Telugu News