MAA Elections: ‘మా’ వివాదంపై బండ్ల గణేశ్ స్పందన

‘మా’ వివాదంపై బండ్ల గణేశ్‌ స్పందించారు. తన అభిప్రాయాన్ని తెలిపారు.

Updated : 06 Sep 2021 05:58 IST

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా)లో ఎన్నికల వేడి మొదలైంది. అధ్యక్ష పదవికి పోటీ చేస్తోన్న ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెల్‌ నుంచి బండ్ల గణేశ్‌ తప్పుకోవడంతో అది ఇంకాస్త ఎక్కువైంది. ఆయన ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? తన ఎజెండా ఏంటి? తదితర అంశాల్ని ‘ఈటీవీ- ఈనాడు’తో పంచుకున్నారు. ఆ వివరాలివీ..

* ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెల్‌ నుంచి తప్పుకోవడానికి కారణమేంటి?

బండ్ల గణేశ్‌: ప్రత్యేక కారణమంటూ ఏం లేదు. జనరల్ సెక్రటరీగా పోటీ చేయాలనిపించింది. జీవిత రెండేళ్లు పదవిలో ఉన్నారు. ఈసారి నాకు అవకాశం ఇవ్వమని కోరుతున్నా. నేను ప్రకాశ్‌ రాజ్‌కి మద్దతు ఇచ్చిన సమయంలో ప్యానెల్‌లో జీవిత లేరు. తాజాగా ఆమె పేరు తెరపైకి వచ్చింది. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నా. నా మనస్సాక్షికి కట్టుబడే ఈ పని చేశా.

* జీవిత అంటే ఎందుకంత వ్యతిరేకత? మెగా ఫ్యామిలీని విమర్శించారనే ఉద్దేశంతో అని కొందరు అంటున్నారు. నిజమేనా?

బండ్ల గణేశ్‌: అవన్నీ అబద్దాలు. ఇంతకుముందే చెప్పినట్టు ఆమె రెండేళ్లు పదవిలో ఉన్నారు. అందుకే ఈసారి నేను పోటీ చేయాలనుకుంటున్నా.

* ఎన్నికలు అక్టోబరు 10న నిర్వహించనున్నారు. ఈలోపు మీ ఆలోచన మారే అవకాశం ఉందా?

బండ్ల గణేశ్‌: నా ఆలోచన మారే సమస్యే లేదు. తప్పకుండా పోటీ చేస్తా. ఒకవేళ జీవిత తప్పుకుంటే నేనూ తప్పుకుంటా.

* దీనిపై ప్రకాశ్‌ రాజ్‌ నిర్ణయం ఏంటి?

బండ్ల గణేశ్‌: ఆయన నిర్ణయం నాకెలా తెలుస్తుంది. నా నిర్ణయమే నా చేతిలో ఉంది.

* జీవితని ప్యానెల్‌లోకి తీసుకునే విషయం మీకు తెలియదా?

బండ్ల గణేశ్‌: తెలియదు.

* జనరల్ సెక్రటరీగా గెలిస్తే ఏం చేయాలనుకుంటున్నారు?

బండ్ల గణేశ్‌: సేవ చేస్తాం. అది చేస్తే మరోసారి గెలిపిస్తారు. చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓడిస్తారు. 100 మంది కళాకారులకి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇప్పించడమే లక్ష్యం. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దగ్గరికి వెళ్లి విన్నవించుకుంటాం.

* ఎన్నికల్లో ఇప్పటి వరకు ఎందుకు పోటీ చేయలేదు?

బండ్ల గణేశ్‌: ఇప్పుడు సేవ చేయాలనిపించింది. అందుకే పోటీ చేస్తున్నా.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని