Updated : 07 Sep 2021 13:01 IST

MAA Elections: అక్కా! నీ మీద గెలుస్తా.. నీ ఆశీస్సులు కావాలి: బండ్ల గణేశ్‌

ఇంటర్నెట్ డెస్క్: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల అంశం సర్వత్రా ఆసక్తి పెంచుతోంది. ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి బండ్ల గణేశ్‌ తప్పుకోవడంతో అది ఇంకాస్త హాట్‌ టాపిక్‌గా మారింది. జీవితా రాజశేఖర్‌తో తనకెలాంటి విభేదాలు లేవని, తన మనస్సాక్షి చెప్పడం వల్లే జనరల్‌ సెక్రటరీ పదవికి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నాని బండ్ల గణేశ్‌ తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఓ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. మరోసారి ‘మా’ ఎన్నికల గురించి మాట్లాడారు. ఇదే ఇంటర్వ్యూలో జీవిత ఫోన్‌కాల్‌ ద్వారా తన అభిప్రాయాన్ని తెలిపారు.

బండ్ల గణేశ్‌ మాట్లాడుతూ.. ‘వ్యక్తిగతంగా జీవితతో నాకు ఎలాంటి విభేదాలు లేవు. ఆమె నాకు అక్కలాంటిది. తనంటే ఎంతో గౌరవం. కానీ, నేను బాగా అభిమానించే వారిని ఆమె విమర్శించడం నాకు నచ్చలేదు. ఇప్పటికే తను ‘మా’ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. అలాంటి ఆవిడ ప్రకాశ్ రాజ్‌ ప్యానల్‌లోకి రావడం నాకు ఇష్టం లేదు. ఆవిడ బాగా పని చేసుంటే మళ్లీ ఎన్నికలు నిర్వహించడం ఎందుకు? అదే ప్యానల్‌ని కొనసాగించవచ్చు కదా. ప్రకాశ్ రాజ్‌ గారు ఇప్పుడు జీవిత స్థానంలో నన్ను తీసుకోవడం ఆయనకీ ధర్మం కాదు. నాకూ ధర్మం కాదు. ఆయన ప్యానెల్‌లో జీవితగారు ఉండాలి. నేను ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలవాలి. ఇది పదవి ఆకాంక్ష కాదు, న్యాయ పోరాటం. ఈసారి ఎన్నికలు ప్రత్యేకంగా నిలువనున్నాయి. దాదాపు 90 శాతం పోలింగ్‌ నమోదవుతుంది. దారిద్ర్య రేఖకి దిగువనున్న 100 మంది కళాకారులకి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టిస్తే వారు పడే ఆనందం.. ‘మా’ భవనం కంటే విలువైందని నా అభిప్రాయం. ఎవరు గెలిచినా మంచి పనులు జరగాలి’ అని బండ్ల అన్నారు.

పూరీ జగన్నాథ్‌ గురించి స్పందిస్తూ..  ‘తను సినిమాలతో బిజీగా ఉండటంతో పూరీ జగన్నాథ్‌ని నేను రెండేళ్లుగా కలవలేదు. 30 ఏళ్లుగా ఆయన నాకు మంచి స్నేహితుడు. అలాంటి మిత్రుడు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మనం కలవకపోతే ఏం బాగుంటుంది. అందుకే ఆరోజు ‘ఈడీ’ ఆఫీసుకి వెళ్లాను. కార్యాలయం లోపలికి ఇతరుల్ని పంపించరనే విషయం నాకు తెలియదు. అక్కడికి వెళ్లాకే తెలిసింది’ అని వివరించారు.

జీవితా రాజశేఖర్‌ మాట్లాడుతూ.. ‘బండ్ల గణేశ్‌కీ, నాకూ మధ్య వ్యక్తిగతంగా ఏం గొడవలు లేవు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. తను నన్ను అలా అనుకోవడంలో తప్పులేదు. ‘మా’ అభివృద్ధి గురించి మాట్లాడుంటే నేను సమాధానం చెప్పగలను. ఆయన సమస్య అది కాదు. మనస్పర్థల వల్ల ‘మా’లో వర్గాలు ఏర్పడ్డాయి. నరేశ్, శివాజీరాజా సమయంలో కో- ఆర్డినేషన్‌ మిస్‌ అయింది. జనరల్‌ సెక్రటరీగా నా బాధ్యత నేను నిర్వర్తించా. ప్యానల్‌ సభ్యులంతా ఒకే మాటపై ఉంటేనే ఏదైనా చేయగలం. నేను గెలిచినా, ఓడినా పనిచేస్తా. నాకూ రాజశేఖర్‌గారికి ఓ విజన్‌ ఉంది. గతంలో చేయలేని పనులు ఇప్పుడు చేయాలనుకుంటున్నాం. మా ఆలోచనలకి ప్రకాశ్‌ రాజ్‌ ఆలోచనలు కలిశాయి. అందుకే ఆయన ప్యానల్‌లోకి వచ్చా. అందరూ అనుకుంటున్నట్టు చిరంజీవి ఫలానా ప్యానెల్‌కి మద్దతిస్తున్నానని చెప్పడం నేను చూడలేదు. ఇక్కడ ప్యానల్‌ ముఖ్యం కాదు ‘మా’కి ఏం చేస్తే బాగుంటుందనేదే అందరి ఎజెండా’ అని జీవితా రాజశేఖర్‌ అన్నారు. ‘మంచి స్నేహపూర్వక వాతావరణంలో పోటీ చేస్తున్నాం. అక్కా నీ మీద నేను గెలుస్తా. నీ ఆశీస్సులు కావాలి నాకు’ అని బండ్ల గణేశ్‌ ఈ సందర్భంగా అన్నారు. దీంతో నవ్వులు విరబూసాయి. 


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని