
MAA Elections: ‘మా’ ఎన్నికల్లో పోటీకి బండ్ల గణేశ్ అనర్హుడు..
కీలక వ్యాఖ్యలు చేసిన యలమంచిలి రవిచందర్
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత బండ్ల గణేశ్‌కు లేదని నిర్మాత యలమంచిలి రవిచందర్ అన్నారు. గణేశ్ ఇప్పటికే నిర్మాతల మండలిలో సభ్యుడిగా ఉన్నారని.. ఒక సంఘంలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి మరో సంఘంలో పోటీ చేయకూడదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు బండ్ల గణేశ్ నామినేషన్ ఉపసంహరించుకోవడంపై రవిచందర్ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మా’ ఎన్నికల్లో పోటీ చేయడానికి బండ్ల గణేశ్ అనర్హుడు. అందుకే ఆయన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఈ విషయంపైనే ఆయన ఫిల్మ్ ఛాంబర్‌కు లేఖ రాశారు’ అని రవిచందర్ పేర్కొన్నారు.
ఈసారి జరగనున్న ‘మా’ ఎన్నికల్లో జనరల్ సెక్రటరీ పదవి కోసం తాను పోటీ చేస్తున్నట్లు గత కొన్నిరోజుల క్రితం బండ్ల గణేశ్ ప్రకటించారు. ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి అదే పదవి కోసం ఎన్నికల బరిలోకి దిగుతున్న జీవిత రాజశేఖర్‌పై పోటీ చేయడానికే తాను ఎన్నికల్లో నిల్చుంటున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే శ్రేయోభిలాషుల సూచన మేరకు జనరల్ సెక్రటరీ పోటీకి నామినేషన్ ఉపసంహరించుకుంటున్నానని శుక్రవారం మధ్యాహ్నం ఆయన ప్రకటించడం గమనార్హం.