MAA Elections: ‘మా’ ఎలా పుట్టింది? మొదట ఎంతమంది సభ్యులుండేవారు?

ప్రస్తుతం తెలుగు చిత్రసీమలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్‌టాపిక్‌ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలు. ఈ ఎన్నికలు రాష్ట్రస్థాయి

Updated : 09 Oct 2021 07:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం తెలుగు చిత్రసీమలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్‌టాపిక్‌ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలు. ఈ ఎన్నికలు రాష్ట్రస్థాయి ఎన్నికలను తలపిస్తుండటం విశేషం. ఈ విషయాన్ని నేరుగా సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులే చెబుతున్నారు. తాజా ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ ఒకవైపు, మంచు విష్ణు ప్యానెల్‌ మరోవైపు పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఇరు వర్గాలు హామీలు, ఆరోపణలు, సవాళ్లతో ‘మా’ ఎన్నికలు మరింత వేడెక్కాయి. అక్టోబరు 10న ‘మా’ ఎన్నికలు జరగనున్న వేళ అసలు మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఏర్పడటానికి కారణం ఏంటి? ఎప్పుడు మొదలైంది? తదితర విషయాలు తెలుసుకుందా!

తెలుగు సినీ రంగంలో నటీనటుల సంఘానిది దాదాపు పాతికేళ్ల చరిత్ర. నటీనటులకు సంబంధించిన సమస్యలు, వివాదాల పరిష్కారం, సభ్యుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ‘మా’ అసోసియేషన్‌ ఏర్పాటు చేశారు.  అసలే గ్లామర్‌ ఇండస్ట్రీ కావడంతో ‘మా’ ఉన్న నటులు ఏం మాట్లాడినా వైరల్‌ అయిపోతోంది. అసలు మా అసోసియేషన్ ఎలా ఏర్పాటైంది? దాని లక్ష్యాలేంటి? ఇంతకు ముందు అధ్యక్షులుగా ఎవరు పనిచేశారు? ఎలాంటి సేవలందించారు?

1993లో ‘మా’ ఏర్పాటు

తెలుగు సినిమా నటీనటుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సినీ పరిశ్రమ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసింది. వాస్తవానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఆకాశంలో అంకురించింది. పోలీసుశాఖ సహాయార్థం తెలుగు నటీనటులు విశాఖపట్నంలో క్రికెట్ మ్యాచ్ ఆడి నిధులు సమీకరించారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ వస్తున్న క్రమంలో అగ్రకథానాయకుడు చిరంజీవి, మురళీమోహన్.. నటీనటుల సంఘంపై ఆలోచన చేశారు. చిత్ర పరిశ్రమ మద్రాసులో ఉండగా తెలుగు చలన చిత్ర నటీనటులందరూ అక్కడి దక్షిణాది ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌లో సభ్యులుగా ఉండేవాళ్లు. నటీనటులకు దర్శకులు, నిర్మాతల నుంచి ఏదైనా సమస్య వస్తే అక్కడి అసోసియేషన్‌లో ఫిర్యాదు చేయాల్సి వచ్చేది. సినీ పరిశ్రమ హైదరాబాద్ తరలివచ్చాక నటీనటులకు ఎలాంటి అసోసియేషన్ లేకపోవడం ఆలోచన రేకెత్తించింది. కేరళ నటీనటులు ఏర్పాటు చేసుకున్న అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్(అమ్మ) తరహాలో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్​(మా) పేరుతో ఓ అసోసియేషన్ ఉంటే బాగుంటుందని భావించారు. వెంటనే పెద్దలందరిని కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, కృష్ణంరాజులాంటి పెద్దల సమక్షంలో కళాకారులకు అమ్మలాంటి మా సంస్థను ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించారు. అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకొన్నారు. చిరంజీవిని వ్యవస్థాపక అధ్యక్షుడిగా నియమించారు. అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, కృష్ణంరాజు, మురళీమోహన్ తదితర సీనియర్లు ముఖ్య సలహాదారులుగా వ్యవహరించారు. రెండేళ్లు మురళీమోహన్ నివాసంలోనే ‘మా’ కార్యకలాపాలు కొనసాగించారు. ఆ తర్వాత ఫిల్మ్‌నగర్‌లోని రామానాయుడు నిర్మించిన సొసైటీ భవనంలోని ఓ గదిలో 1993 అక్టోబర్ 4న అసోసియేషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.

‘మా’ ఉద్దేశం ఇదే

నటీనటులకు సంబంధించిన పారితోషికాలు, దర్శక-నిర్మాతలతో వివాదాలు, సభ్యుల సంక్షేమాన్ని చూసుకోవడం మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ ఉద్దేశం. నిర్మాతలెవరైనా నటీనటులకు పారితోషికం ఇవ్వకపోయినా, దర్శక నిర్మాతలకు నటీనటులకు గొడవలు జరిగినా మా జోక్యం చేసుకుని వాటిని పరిష్కరిస్తుంది. అలాగే నిరుపేద కళాకారులు, వృద్ధ కళాకారుల ఆరోగ్యం కోసం సహాయం చేయడం, అవకాశాలు లేని వారికి సినిమా అవకాశాలు ఇప్పించడం అసోసియేషన్ బాధ్యత. ఈ బాధ్యతలను అసోసియేషన్‌లోని కార్యవర్గ సభ్యులు చిన్న చిన్న కమిటీలుగా ఏర్పడి సభ్యుల సంక్షేమాన్ని చూసుకునేవారు.

150 మంది సభ్యులతో ప్రారంభం

‘మా’ అసోసియేషన్ ప్రారంభంలో 150 మంది సభ్యులుండేవారు. పెద్ద నటీనటులకు ఆర్థికంగా ఇబ్బందులు లేకపోయినా చిన్న చిన్న నటీనటుల కుటుంబాలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడేవి. ఈ విషయాన్ని గ్రహించిన అసోసియేషన్.. నటీనటుల కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే వెంటనే సహాయం చేసి ఆదుకునేది. ఆ తర్వాత సభ్యుల ఆరోగ్యంపై దృష్టి సారించి ఆరోగ్య బీమా, హెల్త్ కార్డులు ఇవ్వడం మొదలుపెట్టారు. చిరంజీవి తోడల్లుడు కేవీ రావు ఆస్పత్రితోపాటు బసవతారకం ఆస్పత్రిలోనూ ఉచితంగా చికిత్సలు చేయించేవారు. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌కు పరిమిత ఆదాయమంటూ లేకపోవడం వల్ల సభ్యుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధిని కూడా ఏర్పాటు చేశారు. అప్పట్లో విడుదలైన ‘గాంధీ’ సినిమా మంచి వసూళ్లలో కొంత మొత్తాన్ని వెల్ఫేర్ ఫండ్‌గా ఏర్పాటు చేసి దాని ద్వారా వచ్చే వడ్డీని సభ్యుల వైద్య ఖర్చులకు అందించేవాళ్లు. అగ్రహీరోల సినిమాలకు బెన్​ఫిట్ షోల ద్వారా వచ్చే డబ్బులను సభ్యుల సంక్షేమం కోసం ఖర్చుపెట్టేవాళ్లు. అంతేకాకుండా నటీనటులు వాళ్లు తీసుకునే పారితోషికాల్లోనూ కొంత మొత్తం అసోసియేషన్‌కు విరాళంగా ఇచ్చేవాళ్లు.  ప్రముఖ నటి, నిర్మాత, దర్శకురాలు విజయనిర్మల.. నిరుపేద కళాకారుల వైద్య ఖర్చుల కోసం ప్రతి నెల రూ.15 వేలు అసోసియేషన్‌కు విరాళంగా పంపించేవారు. అలా దాతల విరాళాలు, వినోద కార్యక్రమాలతో సేకరించిన డబ్బును సభ్యుల కోసం ఖర్చు చేస్తుండేవారు. ఈ క్రమంలో అసోసియేషన్ సభ్యుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అసోసియేషన్ సభ్యత్వ రుసుము కూడా పెట్టారు. మొదట రూ.5 వేలు ఉన్న సభ్యత్వ రుసుము క్రమంగా రూ.10 వేలు ఆ తర్వాత రూ.లక్ష వరకూ చేరింది. ప్రస్తుతం ‘మా’లో 900 మందికి పైగా శాశ్వత సభ్యులుండగా.. 29 మంది అసోసియేట్ సభ్యులు, 18 మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. వీరిలో సుమారు 850మంది యాక్టివ్‌ మెంబర్స్‌.

 

చిరంజీవి టు నరేశ్‌  ‘మా’ అధ్యక్షులు వీరే!

మా అసోసియేషన్‌కు మొదట వ్యవస్థాపక అధ్యక్షుడిగా చిరంజీవి నియమితులు కాగా, ఆ తర్వాత బాధ్యతలను మురళీమోహన్ స్వీకరించారు. ప్రతి రెండేళ్లకోసారి అసోసియేషన్ అధ్యక్షుడ్ని ఎన్నుకునేవారు. ఈ క్రమంలో మోహన్​బాబు, నాగార్జున, నాగబాబు ‘మా’ అసోసియేషన్‌కు సేవలందించారు. అత్యధికంగా ఆరుసార్లు మురళీమోహన్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు. ఆరేళ్లపాటు వరుసగా జరిగిన పోటాపోటీ ఎన్నికల్లో నటులు రాజేంద్రప్రసాద్, శివాజీరాజా, నరేశ్‌ అధ్యక్షులుగా పనిచేశారు.

గతంలోనూ అసోసియేషన్‌కు ఎన్నిక జరిగినప్పటికీ అంతర్గతంగానే ఉండేది. మీడియా అటెన్షన్ లేకపోవడం వల్ల ‘మా’ ఎన్నికల హడావుడి పెద్దగా కనిపించలేదు. వరుసగా ఆరేళ్లు అధ్యక్షుడిగా పనిచేసిన మురళీమోహన్.. ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. జయసుధ, రాజేంద్రప్రసాద్‌ పోటీలో నిలిచారు. దీంతో 2015 నుంచి అసోసియేషన్‌లో ఎన్నికల వేడి రాజుకుంది. ఆ తర్వాత నరేశ్‌- శివాజీరాజా పోటీపడగా సినీ పెద్దలు నరేశ్‌కు నచ్చజెప్పి శివాజీరాజాను ఎన్నుకున్నారు. శివాజీరాజా ఉన్నప్పుడు మా అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం శివాజీరాజా పదవీకాలం పూర్తవడంతో 2019లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో నరేశ్‌, జీవితా రాజశేఖర్‌లు విజయం సాధించారు.

ఇప్పుడు ప్రకాశ్‌రాజ్‌ VS మంచు విష్ణు

గత రెండు ‘మా’ ఎన్నికలతో పోలిస్తే, ఈసారి వాతావరణం పూర్తి భిన్నంగా ఉంది. అధ్యక్ష బరిలో ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణులు నిలబడ్డారు. ‘మా’ భవనం ప్రధాన అజెండాగా మొదలైన ఎన్నికల ప్రచారం, పరస్పర ఆరోపణలు వ్యక్తిగత దూషణలు, సవాళ్ల స్థాయికి చేరింది. ‘మా’ సభ్యులను ప్రసన్నం చేసుకోవడానికి ఇరు వర్గాలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎవరికి వారు తమ వద్ద ఉత్తమమైన ప్రణాళిక ఉందని, తాము గెలిస్తే, ‘మా’ సభ్యుల జీవితాలు మారిపోతాయని హామీలు ఇస్తున్నారు. ‘మా’ ఎన్నికలు ప్రాంతీయవాద రంగును పులుముకున్నాయి. ‘మా’ అధ్యక్షులుగా బరిలోకి దిగిన ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణుల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. నటుడు ప్రకాశ్‌రాజ్‌కు నాగబాబు తదితరులు మద్దతు తెలపగా, మంచు విష్ణు సీనియర్‌ నటులైన కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణ వంటి నటుల మద్దతు కోరుతున్నారు. బాలకృష్ణ, రవిబాబు, రాజీవ్‌ కనకాల వంటి నటులు  మంచు విష్ణుకే తమ మద్దతు అని బహిరంగంగా తెలిపారు. మరి ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఎవరు ‘మా’ నూతన అధ్యక్షుడిగా ఎన్నికవుతారు? తెలియాలంటే అక్టోబరు 10వ తేదీ వరకూ వేచి చూడాల్సిందే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని