Thammareddy Bharadwaja: సినిమా టికెట్‌ ధరల తగ్గింపు పెద్ద సమస్యే కాదు: తమ్మారెడ్డి

సినిమా టికెట్‌ ధరల తగ్గింపు అనేది పెద్ద సమస్యే కాదని ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో హాట్‌ టాపిక్‌గా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ సినిమా టికెట్‌ ధరల తగ్గింపుపై....

Updated : 05 Jan 2022 14:12 IST

హైదరాబాద్‌: సినిమా టికెట్‌ ధరల తగ్గింపు అనేది పెద్ద సమస్యే కాదని ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో హాట్‌ టాపిక్‌గా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ సినిమా టికెట్‌ ధరల తగ్గింపు అంశంపై ఆయన తాజాగా స్పందించారు. సినిమా టికెట్‌ ధరలు తగ్గించడం వల్ల చిన్న సినిమాలకు సమస్య ఉండదన్నారు. ‘‘సినిమా టికెట్‌ ధరలు తగ్గించడం అనేది సమస్యే కాదు. ప్రజలందరికీ అందుబాటులో ఉండాలనే టికెట్‌ ధరలు తగ్గించామని ఏపీ ప్రభుత్వం చెబుతుంది. టికెట్‌ ధరలు తగ్గించడం వల్ల ప్రజలకు ఎలాంటి సమస్య లేదు. కొంతమంది ఆనందిస్తున్నారు. అదే మాదిరిగా టికెట్‌ ధరలు తగ్గించడం వల్ల చిన్న సినిమాలకూ ఇబ్బంది ఉండదు. కేవలం పెద్ద సినిమాలకే సమస్య. అలాంటప్పుడు పెద్ద చిత్రాలకు వేరే ధరలు నిర్ణయించమని కోరితే సరిపోతుంది. అలా కాకుండా కొంతమంది కావాలనే ఎవరో ఒకరి మీద బురద జల్లడం కోసమే టికెట్‌ ధరలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు’’ అని ఆయన అన్నారు.

అనంతరం ఆయన.. సినీ పరిశ్రమకు పెద్దగా ఉండనంటూ ఇటీవల చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ‘‘ఇండస్ట్రీకి పెద్దగా కాదు.. బిడ్డగా ఉంటానని చిరంజీవి చెప్పారు. ఆయన మాట్లాడిన దానిలో ఎలాంటి తప్పు లేదు. ఇండస్ట్రీ మొత్తం ఆయన్ని పెద్ద దిక్కుగా భావించినప్పటికీ గత కొంతకాలంగా జరిగిన పరిస్థితుల రీత్యా ఆయన విసిగిపోయి.. ఈ విధంగా వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. సినిమా టికెట్‌ ధరల విషయంలో ఆయన మాట్లాడటానికి ముందుకు రావడం లేదని వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఆయన ఎందుకు రావాలి? ఈ విషయంపై ముందు ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌? డిస్ట్రిబ్యూటర్స్‌, ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ స్పందించాలి. ఒకవేళ వాళ్ల వల్ల కానప్పుడు ఇండస్ట్రీకి చెందిన చిరంజీవి, బాలకృష్ణ, లేదా నాగార్జున, మోహన్‌బాబు దగ్గరకు వెళ్లి ఏదైనా సాయం కోరాలి’’ అని తమ్మారెడ్డి భరద్వాజ వివరించారు.

Read latest Cinema News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని