
BheemlaNayak: సంక్రాంతి బరిలో ‘భీమ్లానాయక్’..?వరుస పెట్టిన పోస్టులు
హైదరాబాద్: పవన్‌కల్యాణ్(Pawan kalyan) ప్రధాన పాత్ర పోషిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘భీమ్లానాయక్’. మలయాళంలో సూపర్‌హిట్ అందుకున్న ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్రబృందం మొదట భావించగా.. అదే సమయంలో ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ వంటి భారీ చిత్రాలు ఉండటంతో సినీ పరిశ్రమ సంక్షేమం దృష్ట్యా ‘భీమ్లానాయక్’ని ఫిబ్రవరి 25కు వాయిదా వేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. కాగా, తాజాగా ఒమిక్రాన్, కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాగార్జున, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన ‘బంగార్రాజు’ని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మరోవైపు, ‘భీమ్లానాయక్’, మరికొన్ని చిన్న చిత్రాలను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్‌మీడియాలో వరుస పోస్టులు దర్శనమిస్తున్నాయి. అయితే సినిమా విడుదలపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
► Read latest Cinema News and Telugu News