Bhola Shankar: ‘భోళాశంకర్‌’.. భళా ఆరంభం

చిరంజీవి కథానాయకుడిగా ఏకే ఎంటర్‌  టైన్‌మెంట్స్‌ పతాకంపై  తెరకెక్కుతున్న చిత్రం ‘భోళా శంకర్‌’. తమన్నా కథానాయిక. కీర్తిసురేష్‌ సోదరి పాత్రలో   నటిస్తోంది. మెహర్‌ రమేష్‌ దర్శకుడు. రామబ్రహ్మం

Updated : 12 Nov 2021 07:40 IST

చిరంజీవి కథానాయకుడిగా ఏకే ఎంటర్‌  టైన్‌మెంట్స్‌ పతాకంపై  తెరకెక్కుతున్న చిత్రం ‘భోళా శంకర్‌’. తమన్నా కథానాయిక. కీర్తిసురేష్‌ సోదరి పాత్రలో నటిస్తోంది. మెహర్‌ రమేష్‌ దర్శకుడు. రామబ్రహ్మం సుంకర నిర్మాత.  తమిళంలో విజయవంతమైన ‘వేదాలం’ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా గురువారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు కె.రాఘవేంద్రరావు క్లాప్‌నిచ్చారు. వి.వి.వినాయక్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. కొరటాల శివ, హరీష్‌ శంకర్‌, వంశీ పైడిపల్లి, బాబీ, గోపీచంద్‌ మలినేని, ఎన్‌.శంకర్‌, రచయిత సత్యానంద్‌ కలిసి దర్శకనిర్మాతలకి స్క్రిప్ట్‌ని అందజేశారు. అనంతరం విలేకర్లతో ముచ్చటించింది చిత్రబృందం. దర్శకుడు మాట్లాడుతూ ‘‘చిరంజీవి అన్నయ్యతో సినిమా చేయాలనేది నా కల. ఇన్నేళ్ల విరామం తర్వాత మంచి కథతో రావాలనుకున్నా. సోదరి బంధం నేపథ్యంలో సాగే కథ కుదిరింది. ఏడాదిన్నరగా కష్టపడి సత్యానంద్‌ ఆధ్వర్యంలో స్క్రిప్ట్‌ని సిద్ధం చేశాం. అన్నయ్యని భోళాశంకర్‌ అనే అంటారు. ఆయన పేరులోనూ శంకర్‌ ఉంటుంది. ఈ పేరు ఖరారు చేయడంతోనే ఈ సినిమా గురించి మరింత ప్రత్యేకంగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. తమన్నా పలు సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. అయినా ఈ చిత్రం ఒప్పుకొన్నారు. ‘సైరా నరసింహారెడ్డి’లో తమన్నా చేసిన పాత్రకి పూర్తి భిన్నంగా, ఇందులో ఫన్‌తో కూడుకున్న పాత్రలో కనిపిస్తుంది. సంగీత దర్శకుడిగా మహతి సాగర్‌ని అనుకున్నాం అని చెప్పగానే, వెంటనే ఓకే చెప్పారు చిరు అన్నయ్య. నన్ను దర్శకుడిగా కన్నడలో పరిచయం చేసింది కె.ఎస్‌.రామారావు. ఆయనతో కలిసి మళ్లీ ఈ సినిమా కోసం ప్రయాణం చేయడం ఆనందంగా ఉంది. బాలీవుడ్‌లో పలు సినిమాలకి పనిచేసిన డడ్లీ కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రకాశ్‌ ఆధ్వర్యంలో కలకత్తా, హైదరాబాద్‌కి సంబంధించిన సెట్్స వేసి చిత్రాన్ని తెరకెక్కించనున్నాం’’ అన్నారు. తమన్నా మాట్లాడుతూ ‘‘క్లిష్ట పరిస్థితుల్లోనూ సినిమాలు విడుదలవుతూ విజయాన్ని అందుకుంటుండం ఆనందంగా ఉంది. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత అనిల్‌ సుంకరతో కలిసి ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘కల నిజం కావడం అంటారు కదా, ఈ సినిమా నా కల కంటే పెద్దది. ఈ   అవకాశం ఇచ్చినందుకు మెహర్‌ రమేష్‌ అన్నకి   కృతజ్ఞతలు’’ అన్నారు సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్‌. అనిల్‌ సుంకర మాట్లాడుతూ ‘‘ఒక స్ట్రెయిట్‌ కథలాగే దీన్ని సిద్ధం చేశాం. కె.ఎస్‌.రామారావుతో కలిసి ప్రయాణం చేస్తుండడం ఆనందంగా ఉంది’’ అన్నారు. నిర్మాత కె.ఎస్‌.రామారావు, ఛాయాగ్రాహకుడు డడ్లీ మాట్లాడారు. రఘుబాబు, రావు రమేష్‌, మురళీశర్మ, రవిశంకర్‌, వెన్నెల కిశోర్‌, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్‌ శ్రీను, రష్మి గౌతమ్‌, ఉత్తేజ్‌, ప్రభాస్‌ శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు:  రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యాం, శ్రీమణి, సిరా శ్రీ, కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, నృత్యాలు: శేఖర్‌, పోరాటాలు: రామ్‌ లక్ష్మణ్‌, దిలీప్‌ సుబ్బరాయన్‌, కెచ్చా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని