Published : 13 Dec 2021 01:21 IST

bigg boss telugu 5: బిగ్‌బాస్‌ నుంచి ఆర్జే కాజల్‌ ఎలిమినేట్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-5 (bigg boss telugu 5) టాప్‌-5 కంటెస్టెంట్స్‌ ఎవరో తేలిపోయింది. హౌస్‌లో ఆర్జే కాజల్‌ (RJ Kajal) ప్రయాణం ఆదివారంతో ముగిసింది. ఆరుగురు కంటెస్టెంట్‌లలో అతి తక్కువ ఓట్లు వచ్చిన కాజల్‌ బిగ్‌బాస్‌-5 నుంచి ఎలిమినేట్‌ అయినట్లు వ్యాఖ్యాత నాగార్జున ప్రకటించారు. దీంతో మానస్‌ (Manas), షణ్ముఖ్‌ (Shanmuk), సిరి (siri), శ్రీరామ్‌ (sriram), సన్నీ (Sunny) టాప్‌-5లో నిలిచారు. తమ అభిమాన కంటెస్టెంట్స్‌ను గెలిపించుకునేందుకు ప్రేక్షకులు భారీగా ఓట్లు వేశారు. ఉత్కంఠగా సాగిన ఎలిమినేషన్‌ రౌండ్‌లో చివరకు కాజల్‌ నిష్క్రమించాల్సి వచ్చింది. సెప్టెంబరు 5న ప్రారంభమైన సీజన్‌-5లో 17వ కంటెస్టెంట్‌గా కాజల్‌ అడుగు పెట్టింది. మొత్తం 98 రోజుల పాటు హౌస్‌లో ఆమె ప్రయాణం కొనసాగింది. ఈ సీజన్‌లో కెప్టెన్‌ కాకుండా ఎలిమినేట్‌ అయిన వాళ్లలో కాజల్‌ ఒకరు.

మాటలతో మరిపించి...

‘గుడ్‌ మార్నింగ్‌ హైదరాబాద్‌’ అంటూ తన గొంతుతో కోట్లాది మందికి సుపరిచితురాలు ఆర్జే కాజల్‌. సామాజిక మాధ్యమాల వేదికగా ఆమెకు భారీగానే అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా గత బిగ్‌బాస్‌ సీజన్‌లను విశ్లేషిస్తూ ఆమె చేసిన పోస్టులతో అప్పుడు వార్తల్లో నిలిచారు. ఇప్పుడు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి కాజల్‌ వస్తుందంటే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అందుకు తగ్గట్టుగానే ఇంటిలోకి వచ్చిన వెంటనే అందరితోనూ కలిసి పోయింది. ‘నేను బిగ్‌బాస్‌కు పెద్ద అభిమానిని. తెలుగులోనే కాదు, ఇతర భాషల్లో వచ్చే ఈ షోలను ఫాలో అయ్యేదాన్ని’ అంటూ ఇంటి సభ్యులతో పంచుకునేది. కంటెంట్‌, స్క్రీన్‌ స్పేస్‌ కోసం వివిధ ప్రయత్నాలు చేసేది. దీంతో హౌస్‌మేట్స్‌కు ఆమెకు ‘గేమ్‌ ప్లానర్’, ‘కంటెంట్‌ క్వీన్‌’ అనే బిరుదులు ఇచ్చారు. సందర్భం వచ్చినప్పుడు తడుముకోకుండా మాట్లాడటం కూడా కొందరు హౌస్‌మేట్స్‌కు నచ్చేది కాదు.

ఆ గ్రూప్‌తో జర్నీ మొదలై...

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వచ్చిన ప్రతి కంటెస్టెంట్‌ ఇతరులతో కలవడానికి కొంత సమయం పడుతుంది. అయితే, అంతకుముందే ఇద్దరి మధ్య పరిచయం ఉంటే మాత్రం త్వరగా కలిసిపోతారు. అలా బయట ఉన్న పరిచయం కారణంగా షణ్ముఖ్‌, సిరి, జెస్సీలతో కలిసి కాజల్‌ ఉండేది. దాదాపు నాలుగో వారం వరకూ వీళ్లు నలుగురు కలిసి ఉండేవారు. అక్కడి మాటలు ఇక్కడ.. ఇక్కడి మాటలు అక్కడ చెబుతోందన్న అనుమానంతో షణ్ముఖ్ టీమ్‌ కాజల్‌ను దూరంగా పెట్టింది. నామినేషన్స్‌ సందర్భంగా ‘నీతో మాకేమీ వైబ్‌ వద్దు’ అన్నట్లు సిరి, షణ్ముఖ్‌ మాట్లాడారు. ఆ తర్వాత కూడా వారితో కలిసేందుకు కాజల్‌ ప్రయత్నించింది. ఆమె రాగానే వాళ్లంతా ముఖాలు మాడ్చుకుని ఉండటంతో గమనించిన కాజల్‌ నెమ్మదిగా వాళ్లకు దూరమైంది. మరోవైపు కాజల్‌ మొదటి నుంచి మానస్‌తో స్నేహంగా ఉండేది.

వ్యవహారశైలిలో మార్పు.. హేళనలు తట్టుకుని

బిగ్‌బాస్‌ హౌస్‌లో కంటెస్టెంట్‌ల మధ్య గొడవలు, వాగ్వాదాలు సహజం. కొన్నిసార్లు అవి శ్రుతి మించుతాయి కూడా. తొలిరోజుల్లో కాజల్‌ వ్యవహారశైలి ఎవరికీ నచ్చేది కాదు. హౌస్‌మేట్స్‌తో పాటు, ప్రేక్షకులు ఆమె తీరు పట్ల అసహనం వ్యక్తం చేసేవారు. ప్రతిదీ కంటెంట్‌ కోసం చేస్తోందని, గొడవలు పెడుతోందని అభిప్రాయపడేవారు. హౌస్‌లో ఉన్న యాంకర్‌ రవి, శ్రీరామ్‌, హమీద అభిప్రాయం కూడా అలాగే ఉండేది. దీంతో ఆమెను నామినేట్‌ చేసేవారు. ఆ తర్వాత వీరికి అనీ మాస్టర్‌ తోడయ్యారు. కాజల్‌ విషయంలో అనీ మాస్టర్‌ వెక్కిరింతలు, హేళనలు పతాకస్థాయి చేరాయి. ఇవన్నీ కాజల్‌కు కలిసొచ్చాయి. అన్నింటినీ తట్టుకుని, తన వాదనను వినిపించటంలో కాజల్‌ ఏమాత్రం వెనక్కి తగ్గేది కాదు. దీంతో అప్పటివరకూ కాజల్‌పై ప్రేక్షకుల్లో ఉన్న అసహనం, కోపం కాస్తా సానుభూతిగా మారింది. దీంతో కాజల్‌ వ్యవహారశైలి కూడా మారింది. ఎలాంటి గేమ్‌ ప్లాన్‌ లేకుండా టాస్క్‌ల్లో ముందుకు సాగడం మొదలు పెట్టింది.

సన్నీతో గొడవ.. ఆ తర్వాత స్నేహం..

ప్రస్తుతం హౌస్‌లో బెస్ట్‌ ఫ్రెండ్స్‌ ఎవరంటే బిగ్‌బాస్‌ చూస్తున్న వారు ఎవరైనా ఎస్‌ఎంకే (సన్నీ, మానస్‌, కాజల్‌) అంటారు. అంతలా వీరి బంధం ప్రేక్షకుల్లోకి వెళ్లిపోయింది. అయితే, తొలినాళ్లలో సన్నీతో కాజల్‌ తీవ్రంగా గొడవ పడటం గమనార్హం. ‘వెయిట్‌లాస్‌ టాస్క్‌’ సందర్భంగా జెస్సీ, కాజల్‌ ఒక టీమ్‌గా చేశారు. ఈ టాస్క్‌లో చివరిగా కెప్టెన్‌ కంటెండర్స్‌గా సన్నీ, శ్వేత, శ్రీరామ్‌ నిలబడ్డారు. అప్పుడు హౌస్‌లో ఉన్న వాళ్లలో ఎక్కువమంది సన్నీకి కత్తిపోటులు పొడిచారు. శ్రీరామ్‌, శ్వేత మధ్య టై అవ్వగా కాజల్‌ తన గేమ్‌ ప్లాన్‌ అంటూ సన్నీ స్నేహితురాలైన శ్వేతకు కత్తిపోటు పొడిచింది. సన్నీ వద్దని వారించినా ఆమె వినలేదు. దీంతో శ్రీరామ్‌ కెప్టెన్‌ అయ్యాడు. ఈ సందర్భంగా సన్నీతో తీవ్రంగా గొడవ పడింది. ఆ వారం తర్వాతి నుంచి మానస్‌, సన్నీకి కాజల్ దగ్గరవటం ప్రారంభించింది.

నాగార్జునతో సైతం ధైర్యంగా మాట్లాడి..

వీకెండ్స్‌లో నాగార్జున వచ్చి, ఆ వారం హౌస్‌మేట్స్‌ చేసిన తప్పులను ఎత్తి చూపుతూ తలంటుతారు. టాస్క్‌ల్లో అగ్రెసివ్‌గా ఉండే సన్నీకి ఎక్కువ తిట్లు పడేవి. ఆ సమయంలో కాజల్ అతడికి అండగా నిలబడి మాట్లాడేది. ప్రియతో జరిగిన గొడవ, సిరిని ‘అప్పడం అయిపోతావు’, ‘తంతా’ అంటూ సన్నీ అనడంపై నాగార్జున క్లాస్‌ తీసుకుంటుంటే మధ్యలో నిలబడి సన్నీ అన్న ఉద్దేశం వేరని, బయట స్నేహితులు అనుకునే మాటలేనని నాగార్జునతో ధైర్యంగా చెప్పింది. సన్నీని నిలబెట్టి కడిగేస్తున్న నాగార్జున మాటలకు బ్రేక్‌ వేసింది. ఆ వీకెండ్‌ ఎపిసోడ్‌ తర్వాత ప్రేక్షకుల్లో కాజల్‌ విపరీతమైన క్రేజ్‌ సొంతం చేసుకుంది. ముఖ్యంగా సన్నీ ఫ్యాన్స్‌ ఆమె మాటలకు ఫిదా అయిపోయారు.

స్నేహితుల కోసం గేమ్‌ ప్లాన్‌..

తొలిరోజుల్లో తనకోసం, కంటెంట్‌ కోసం గేమ్‌ ప్లాన్‌లు వేసిన కాజల్‌ చివరి వారాల్లో స్నేహితుల కోసం ఆడింది. ఫైరింజన్‌ టాస్క్‌లో సన్నీ, కాజల్‌ ఫొటోలు కాల్చేద్దామని శ్రీరామ్‌, రవి అనుకుంటే, అదే ప్లాన్‌ను ఉపయోగించి సిరి, అనీ మాస్టర్‌ ఫొటోలు కాలిపోయేలా చేయటంలో కాజల్‌ కీలకంగా వ్యవహరించింది. ఆ సమయంలో ఇంటి కెప్టెన్‌ అయిన మానస్‌ మాటను సైతం పక్కన పెట్టి సన్నీకి ఎవిక్షన్‌ ఫ్రీపాస్‌ వచ్చేలా చేసింది. ఆ తర్వాత అదే పాస్‌ను సన్నీ ఆమె కోసం వాడాడు. అయితే, అంతకు ముందే 10వ వారం నామినేషన్స్‌లో ఇంటి నుంచి వెళ్లిపోయే ప్రమాదం కాజల్‌ తలుపు తట్టింది. అయితే అదే సమయంలో జెస్సీ అనారోగ్యం కారణంగా ఇంటి నుంచి వెళ్లిపోవడటంతో హౌస్‌లో చివరకు మిగిలిన మానస్‌, కాజల్‌ సేవ్‌ అయినట్లు నాగార్జున ప్రకటించారు. అక్కడి నుంచి నాలుగు వారాల పాటు తనదైన గేమ్‌ ఆడుతూ 98 రోజల పాటు హౌస్‌లో కాజల్‌ తన జర్నీ పూర్తి చేసింది.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని